Share News

Dr. Keshav Rao Hedgewar: స్వాభిమాన భారత స్వాప్నికుడు

ABN , Publish Date - Mar 29 , 2025 | 06:03 AM

డాక్టర్ కేశవరావ్ బలిరాం పంత్ హెడ్గేవర్ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. హిందూ సమాజాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను స్థాపించారు.

Dr. Keshav Rao Hedgewar: స్వాభిమాన భారత స్వాప్నికుడు

స్వాభిమాన భారతాన్ని సాధించాలనే సంకల్పంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు పురుడు పోశారు డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవర్. బ్రిటిష్‌ వారి విభజించు, పాలించు అనే దుష్ట నీతిని గ్రహించిన హెడ్గేవర్.. దేశ ఐక్యతకు ప్రతినబూనారు. 1889 ఏప్రిల్ 1న (ఉగాది పండుగ రోజున) బలిరాం పంత్ హెడ్గేవర్, రేవతి బాయ్ దంపతులకు కేశవరావు జన్మించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో జన్మించినా, వారి పూర్వీకులది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కందకుర్తి గ్రామం. బాల్యం నుంచే భరతమాత వైభవం కోసం తపించిన హెడ్గేవర్.. స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకున్నారు. అడుగడుగునా భారతీయ జవసత్వాలు నింపుకున్న హెడ్గేవర్.. విక్టోరియా మహారాణి జయంతి సందర్భంగా పంచిన మిఠాయిలను విసిరేసి స్వాభిమానం చాటుకున్నారు. తోటి విద్యార్థులను కూడగట్టి విదేశీ జెండాలను పెకిలించి వేశారు. పాఠశాల సందర్శనకు వచ్చిన ఆంగ్లేయ అధికారులకు వందేమాతరం.. భారత్ మాతాకీ జై... నినాదాలతో స్వాగతం పలికారు. పేదరికంలో పుట్టినప్పటికీ, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ పట్టు సడలని.. మొక్కవోని దీక్షతో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. సుఖమయ జీవితాన్ని త్యాగం చేసి.. తల్లి భారతి ఔన్నత్యం కోసం తనను తాను సమర్పించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడుగా అనేక బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొని జైలు జీవితం అనుభవించారు. 1921లో ఖిలాఫత్ ఆందోళనకు మహాత్మాగాంధీ మద్దతు ఇవ్వడం నచ్చక, సొంతబాట పట్టారు. దేశంలో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తుంటే చెల్లాచెదురైన హిందూ సమాజాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఉందని గ్రహించారు. కులాలు, జాతులు, వర్ణాలు, వర్గాల పేరుతో ఎవరికి వారేగా ఉంటున్న హిందూ సమాజాన్ని ఏకం చేయాలని సంకల్పించారు. దేశానికి స్వాతంత్ర్యం రావడం ఖాయమని, అయితే దాన్ని స్వాభిమాన స్వాతంత్ర్యంగా నిలుపుకొని భారతీయ మూలాలను పరిరక్షించాలని నిర్ణయించారు. 1925 విజయదశమి రోజున కేవలం ఐదుగురు సభ్యులతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు పురుడు పోశారు డాక్టర్ హెడ్గేవర్‌. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్‌ను హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు విస్తరించాలని ప్రతినబూనారు. ‘‘అఖండ భారత్ హమారా హై’’ అంటూ నినదించారు.


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విస్తరణలో పట్టుదల, క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన సుశిక్షితులైన స్వయంసేవకుల తయారీ కోసం సంఘ శాఖలను ప్రారంభించారు. నిస్వార్థంగా దేశం కోసం పనిచేసే సైనికులను తీర్చిదిద్దారు. విశ్వంలోని హిందువులందరినీ ఒక్కటి చేయాలనే ఏకైక లక్ష్యం ఏర్పాటు చేసుకుని, దార్శనికత ప్రదర్శించారు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటూ త్రికరణశుద్ధితో భరతమాత సేవలో తనువు సమర్పించుకున్న భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ హెడ్గేవర్. హిందువులంతా సంఘటితమైతేనే జాతీయత సాధ్యమని, అందుకు సంఘ శాఖలే ప్రధాన భూమిక పోషించాలని స్వయం సేవకులకు ఉద్బోధించారు. భారతీయులందరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా ఆత్మీయతను నూరిపోశారు. ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకీ జై’.. అనే నినాదాలు మంత్రాలుగా మలిచి ప్రతి వ్యక్తిలో జాతీయభావాలు నూరిపోశారు. సంఘ్‌ శాఖల ద్వారా దేశభక్తుల తయారీని ప్రారంభించారు. సంఘ్‌ శాఖలో సామాజిక సమరసతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు డాక్టర్ హెడ్గేవర్‌. కుల జాడ్యానికి తావులేకుండా స్వయం సేవకులను తయారు చేశారు. ‘‘అందరం హిందువులం.. అందరం భారతీయులం’’ అనే ఆత్మీయ భావనను తీసుకువచ్చారు. ఒక సందర్భంలో సంఘ్‌ శిబిరాన్ని మహాత్మాగాంధీ సందర్శించి, అందులోని స్వయంసేవకులను మీరు ఏ కులానికి చెందినవారు అని ప్రశ్నించారు. దీంతో మేమంతా హిందువులం అని స్వయం సేవకులు సమాధానం చెప్పారు. మరొక సందర్భంలో డాక్టర్ అంబేడ్కర్ సంఘ శిబిరాన్ని సందర్శించారు. ఇక్కడ కులాల కుంపటి లేకుండా సామాజిక సమరసత వెల్లివిరియడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. 1925లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ విస్తరణ కోసం ప్రచారక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు హెడ్గేవర్‌. ‘‘ఆ జీవన పర్యంతం సమాజసేవకే అంకితం’’ అని ప్రతి వ్యక్తి మదిలో నింపి.. సజ్జన సమాజ నిర్మాణానికి తోడ్పడ్డారు. ఆ విధంగా తయారైన స్వయం సేవకులు దేశ నలుమూలలా విస్తరించి, హైందవ సమాజ జాగృతి కోసం కంకణం కట్టుకొని పనిచేశారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం రానే వచ్చింది. వచ్చిన స్వాతంత్ర్యాన్ని నిలుపుకునేలా, స్వాభిమాన భారతాన్ని తయారుచేసేలా సంఘాన్ని కూడా విస్తరించారు.


హిందూ సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక రుగ్మతలను ఒక్కొక్కటిగా పారదోలుతూనే హిందూ ఐక్యతకు ప్రాధాన్యమిచ్చారు స్వయం సేవకులు. దేశంలోని అన్ని రంగాలలో రాజకీయ, విద్యార్థి, కార్మిక, కర్షక, రైతు, మేధావి... ఇలా అన్ని క్షేత్రాలలో స్వయంసేవకుల ప్రాధాన్యం పెంచారు. ఫలితంగా స్వాతంత్ర్యానంతరం కాశ్మీర్ కోసం.. అయోధ్య రామ మందిరం కోసం అనేక ఉద్యమాలు చేసి ప్రాణత్యాగం చేసిన స్వయం సేవకులను, కర సేవకులను తయారు చేశారు. వారు సంఘ్ సిద్ధాంతాన్ని వ్యాపింప చేశారు. సమర్థ నాయకులు అటల్ బిహారీ వాజ్‌పాయి, నరేంద్ర మోదీ వంటి ప్రధానమంత్రులను సంఘ్‌ తయారు చేసింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా హెచ్‌ఎస్‌ఎస్ (హిందూ స్వయంసేవక్ సంఘ్) పేరుతో ప్రపంచంలోనే 60కి పైగా దేశాలలో విస్తృతంగా పనిచేస్తోంది. ఆర్ఎస్ఎస్‌కు అనుబంధంగా ధార్మిక కార్యక్రమాల కోసం విశ్వహిందూ పరిషత్‌ను స్థాపించి హిందూ ఐక్యత కోసం కృషి చేస్తున్నది. ఒక మాటలో చెప్పాలంటే నాడు హెడ్గేవర్ నాటిన మొక్క నేడు మానుగా మారి, మహావృక్షమైంది. ఇంతటి గొప్ప సంస్థ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న శుభ సందర్భంలో డాక్టర్ హెడ్గేవర్ జయంతిని స్మరించుకోవడం అత్యంత ఆవశ్యకం. l పగుడాకుల బాలస్వామి విశ్వహిందూ పరిషత్, తెలంగాణ

Updated Date - Mar 29 , 2025 | 06:03 AM