Share News

విద్యా సంక్షోభం : విరుగుడేమిటో మీకు తెలియదా?

ABN , Publish Date - Apr 17 , 2025 | 06:13 AM

తెలంగాణ శాసనమండలిలో విద్యారంగం మీద కొన్ని గంటల పాటు కొందరు సభ్యులు చేసిన ప్రసంగం మీద పౌరసమాజం తప్పక చర్చించాలి. తీన్మార్‌ మల్లన్న, తక్కెల్లపల్లి రవీందర్‌రావు చేసిన ప్రసంగాలు...

విద్యా సంక్షోభం : విరుగుడేమిటో మీకు తెలియదా?

తెలంగాణ శాసనమండలిలో విద్యారంగం మీద కొన్ని గంటల పాటు కొందరు సభ్యులు చేసిన ప్రసంగం మీద పౌరసమాజం తప్పక చర్చించాలి. తీన్మార్‌ మల్లన్న, తక్కెల్లపల్లి రవీందర్‌రావు చేసిన ప్రసంగాలు, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన విషయాలు కొన్ని ప్రశ్నలను తెలంగాణ సమాజం ముందు ఉంచాయి. ‘ప్రభుత్వ రంగంలో నడుస్తున్న విద్య సంక్షోభంలో ఉందని, వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నా తగిన ఫలితం రావటం లేదని, విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు కనీస స్థాయిలో లేవని, తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్య పట్ల విశ్వాసం సడలిందని, ఉపాధ్యాయులు, అధ్యాపకులు వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతను ప్రదర్శించటం లేదని’ సభ్యుల, ముఖ్యమంత్రి చర్చల సారాంశంగా మనం అర్థం చేసుకోవచ్చు.

ప్రభుత్వ విద్యారంగం పతనం ఇవాల్టికి ఇవ్వాళ ప్రారంభం కాలేదు. దేశంలోకి నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించాక సంక్షేమరంగం మీద, ముఖ్యంగా విద్యారంగం మీద, ప్రభుత్వ కేటాయింపులు తగ్గుతూ వచ్చాయి. విద్య ప్రభుత్వ ప్రాధాన్యంలో లేకుండా పోయింది. ఫలితంగా విద్యార్థులు చదువుకోవడానికి కావలసిన మౌలిక వసతులు తరగతిగదుల నిర్మాణం నిలిచిపోయింది. ఉపాధ్యాయుల నియామకాలు నామమాత్రమయ్యాయి. ప్రభుత్వం విద్యా రంగం మీద కేటాయించే బడ్జెట్‌ కేవలం టీచర్ల జీతభత్యాలకే సరిపోయేది. కాబట్టి ఈ ప్రభావమంతా బోధన మీద పడింది. ఈ పరిస్థితిని గమనించిన కొందరు వ్యాపారవేత్తలు విద్యా రంగంలోకి ప్రవేశించి ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పారు. ఈ క్రమంలో ఆర్థిక వెసులుబాటు ఉన్న కుటుంబాలు తమ పిల్లలను ఫీజులు చెల్లించి ప్రైవేట్‌ పాఠశాలల్లో, కళాశాలల్లో చేర్పించారు. సహజంగానే ప్రభుత్వ విద్యాసంస్థలు పేదల, కింది కులాల విద్యార్థులకు పరిమితం అయ్యాయి. విద్యలో ఒక విభజన రేఖ ఏర్పడింది. లాభసాటిగా మారిన విద్యా వ్యాపారంలోకి ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రవేశించడం వల్ల ప్రైవేట్‌ విద్యారంగానికి నష్టం జరగని విధాన రూపకల్పన ముందుకు వచ్చింది. రాజకీయ పార్టీలకు ఎన్నికలలో డబ్బును సమకూర్చే స్థాయికి విద్యా వ్యాపారవేత్తలు ఎదిగారు. ఫలితంగా ‘పూనుస్పర్థలు విద్యలందు వైరములు వాణిజ్యమందు’ అని గురజాడ చెప్పిన మాట తలకిందులై విద్యా వ్యాపారంలోకి వైరం ప్రవేశించింది.


గ్లోబలైజేషన్‌ వ్యక్తి ప్రాధాన్యాన్ని ముందుకు తీసుకొచ్చింది. కెరియరిజానికి పెద్దపీట వేసింది. సామూహిక ఆలోచనలు, విలువలు, సామాజిక ప్రయోజనం, బాధ్యతల స్థానంలో వ్యక్తి ఒక విలువగా ఈ కాలం ప్రదర్శించింది. నిబద్ధతతో పాఠం బోధించాల్సిన టీచర్లు కూడా ప్రపంచీకరణ కదుపుకు గురయ్యారు. ఉదాత్త ఆశయాలు, విలువలు సమాజంలో లుప్తమవుతున్న సందర్భం కూడా తరగతి గదిని ప్రభావితం చేసింది. అవసరానికి మించిన సంపాదన ఒక లక్ష్యంగా సమాజంలోకి వ్యాపించింది. ప్రభావిత సమూహంగా ఉన్న కొందరు ఉపాధ్యాయులు చిట్టీల, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లోకి ప్రవేశించారు. ప్రభుత్వం స్థాయిల వారీగా చేయాల్సిన పర్యవేక్షణను గాలికొదిలేసింది. ప్రజా ఉద్యమాలకు, విప్లవోద్యమాలకు, కమ్యూనిస్టులకు, బహుజన పార్టీలకు విద్య ప్రధాన ఎజెండా కాకుండా పోయింది. ఇది కేవలం తమ అనుబంధ అధ్యాపక, విద్యార్థి సంఘాల నినాదంగా మారిపోయింది. ప్రభుత్వ విద్యను కాపాడితేనే ఓట్లు అడగాలనే చైతన్యాన్ని ప్రజలలో కల్పించి పాలకపార్టీల మీద ఒత్తిడి పెంచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇన్ని కారణాల వల్ల ప్రభుత్వ విద్య పట్ల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి విముఖత ప్రదర్శిస్తోంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అనాథలయ్యాయి.

ప్రైవేట్‌, ప్రభుత్వ విద్య అనే తేడా లేకుండా ఈ పాతికేళ్లలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తగిన స్థాయిలో లేవని రేవంత్‌రెడ్డి ఆవేదన చెందారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం తగినంతగా లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ‘గాయం ఒక చోట ఉంటే మందు మరో చోట’ రాస్తే సరైన ఫలితాన్ని ఆశించలేం. ఒక విద్యార్థి మీద ప్రభుత్వం ఏడాదికి చేస్తున్న ఖర్చు రూ.లక్షకు పైగా ఉంటోందని విధాన మండలిలో ముఖ్యమంత్రి చెప్పారు. నిజమే, కానీ ఆ లక్ష రూపాయల్లో ఉపాధ్యాయుల, పాఠ్యేతర ఉద్యోగుల జీతాలు, పాఠశాల కరెంట్‌ బిల్లులు కూడా కలిసి ఉంటాయని ఆయన తెలియక మాట్లాడారా? ప్రతి విద్యార్థికి ప్రాథమిక పాఠశాల కేంద్రంగా అభ్యసనం జరగాలి. కానీ పాతికేళ్లుగా మన పాలకులు ప్రాథమిక విద్యను గాలికి వదిలివేసారు.

మన దేశంలో టీచర్లను తయారుచేసే ‘ఉపాధ్యాయ శిక్షణా విద్య’ అధమ స్థాయిలో ఉంది. సర్టిఫికెట్లు ఇచ్చి సమాజం మీదికి పంపటం తప్ప ఆ కళాశాలల్లో సృజనాత్మకత శూన్యం. అపరిమిత సంఖ్యలో ప్రైవేట్‌, డి.ఎడ్‌., బి.ఎడ్‌ కళాశాలలు ప్రవేశించాక విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయి. రికార్డులు రాయకపోయినా, టీచింగ్‌ ప్రాక్టీస్‌ చేయకపోయినా అభ్యర్థుల వద్ద డబ్బులు తీసుకొని మార్కులు వేసే కళాశాలలే అధికంగా ఉన్న చోట నాణ్యమైన, ప్రతిభావంతమైన ఉపాధ్యాయులను ఎలా ఆశించగలం?

విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు అవుతారు. కానీ విశ్వజ్ఞానాన్ని అందించవలసిన విశ్వవిద్యాలయాలు తెల్లపేపరును విద్యార్థి నల్లగా చేస్తే మార్కులు వేసి, పట్టాలు ఇచ్చి పంపుతున్నాయి. అక్షరాలను సరిగ్గా రాయలేని, చదువలేని వాళ్లకు కూడా పీహెచ్‌డీ లాంటి అత్యున్నత డిగ్రీని ఇచ్చి సత్కరిస్తున్నాయి. ఫలితంగా బోధనా రంగంలోకి నైపుణ్యాలు లేనివారు ప్రవేశిస్తున్నారు. సమాజంలో మెరికల్లాంటి యువత ఆకర్షణీయమైన కార్పొరేట్‌ జీతాల వైపు వెళ్తున్నారు. దేశీయంగానైతే సివిల్‌ సర్వెంట్లుగా, గ్రూప్స్‌ అధికారులుగా స్థిరపడడానికి ఆసక్తి చూపుతున్నారు. బోధనా వృత్తివైపు, పరిశోధన వైపు వచ్చేవారికి ఆయా రంగాల్లో తగిన నైపుణ్యం ఉండటం లేదు.


ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలన్న చిత్తశుద్ధి రేవంత్‌రెడ్డికి ఉంటే తక్షణ కార్యాచరణ ప్రకటించాలి. ఉపాధ్యాయుల, అధ్యాపకుల శిక్షణా కళాశాలలను పునఃసమీక్షించి వాటి అనుమతులను పునరుద్ధరించాలి. డి.ఎడ్‌, బి.ఎడ్‌ కోర్సులకు అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలో సమూల మార్పులు తీసుకురావాలి. పఠన, లేఖన నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రవేశపరీక్ష ఉండాలి. ఐచ్చిక ప్రశ్నల స్థానంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నల ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాలి. ఉపాధ్యాయ శిక్షణ తర్వాత నిర్వహించే పరీక్ష పత్రాల మూల్యాంకనం శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఉండాలి. పీజీ, పీహెచ్‌డీ స్థాయి విద్యను అభ్యసించేవారి ఎంపిక కోసం నిర్వహించే పరీక్షల్లో కూడా రాత, మౌఖిక పరీక్షా పద్ధతులను ప్రవేశపెట్టి, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయాలి.


యూనివర్సిటీల ఆచార్యుల ఎంపిక ప్రస్తుతం లోపభూయిష్ఠంగా ఉంది. సివిల్‌ సర్వీస్‌ స్థాయి లాంటి మూడంచల పరీక్షా పద్ధతిని ప్రవేశపెట్టి ఆచార్యులను ఎంపికచేయాలి. విశ్వవిద్యాలయాల్లోకి విశ్వజ్ఞానాన్ని ఆహ్వానించే విధంగా ఎంపిక ఉండాలి. అధికారంలో ఉన్నవాళ్లు విశ్వవిద్యాలయాలను తమ రాజకీయ క్షేత్రంగా మార్చుకోవడాన్ని విస్మరించాలి. మంత్రుల, రాజకీయ నాయకుల జన్మదినాలు జరపడం, పాలాభిషేకాలు చేయడం లాంటి విద్యేతర కార్యకలాపాలు చేయకుండా తమ అనుచర గణానికి పరిమితులు విధించాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రే చొరవచూపి అదుపుచేయాలి. విశ్వవిద్యాలయాలను కేవలం విద్యార్థి సంఘాల విద్యా సంబంధిత రాజకీయ చర్చలకు వేదికలుగా ఉండనివ్వాలి. సమాజం ఎదుర్కొంటున్న సామాజిక రాజకీయ ఆర్థిక సమస్యలకు పరిష్కారాలను వెదికే మేధోనిలయాలుగా విశ్వవిద్యాలయాలు ఉండాలనే పరిపక్వత సమాజానికి, రాజకీయ నాయకత్వానికీ రావాలి. బోధనా రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి కార్పొరేట్‌ రంగంలో ఇస్తున్న విధంగానే ఆకర్షణీయమైన వేతనాలు ఉండాలి. అన్నిటికీ మించి విద్యారంగానికి సరిపడా నిధులను ప్రభుత్వం కేటాయించాలి.

ప్రొఫెసర్‌ చింతకింది కాశీం

ఈ వార్తలు కూడా చదవండి:

Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు.. తనను పెళ్లి చేసుకున్నాడంటూ..

MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

Updated Date - Apr 17 , 2025 | 06:13 AM