Former Vice President Venkaiah Naidu: పృథ్వి పరిరక్షణ పౌర కర్తవ్యం
ABN , Publish Date - Apr 22 , 2025 | 05:20 AM
ప్రకృతి పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు, మనందరి బాధ్యత అని ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు సూచించారు. పర్యావరణం కాపాడటానికి చెట్లు నాటడం, నీటిని వృథా చేయకుండా ఉపయోగించడం వంటి 5 ముఖ్యమైన పంచసూత్రాలను పాటించాలని అభిప్రాయపడుతున్నారు
‘మాతా భూమి పుత్రోహం పృథివ్యా’ ఈ భూమి నా తల్లి, నేను ఆమె కుమారుడిని అన్నది అథర్వణ వేదంలో చెప్పిన ఈ సూక్త భాగానికి భావం. ఈ రోజు ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో సమస్త జీవరాశులకు ఆధారమైన ఈ భూమిని కాపాడుకునే దిశగా ప్రతినబూనడం మనందరి కనీస బాధ్యత. ఈ విశాల విశ్వంలో జీవం మనుగడ ఉన్న భూమి లాంటి మరో గ్రహం ఉన్నట్లు ఇంతవరకు ఆధారాలు లేవు. చైతన్యపూరితమైన జీవం ఉన్నది ఈ భూమిపైనే. అరుదైన ఆ చైతన్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ భూమిని కాపాడుకోవాలి. ఈ భూమి లేకపోతే ఈ చైతన్యం లేదు. మనం లేము. ఈ ఎరుకను భావితరాల్లో నింపేందుకు ప్రయత్నాలు మన నుంచే ప్రారంభం కావాలి. ఇందుకోసం ముందు మనం ఈ భూమిని కాపాడుకుని, భవిష్యత్ తరాలకు అందించాలి. భూమిని తల్లిగా మనసా వాచా కర్మణా భావిస్తూ, జీవం మనుగడకు ప్రకృతే ఆధారం అన్న గొప్ప ఎరుక వేదకాలంలోనే మన పెద్దలు తెలియజేశారు. ప్రకృతిని పరిరక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని నమ్మి, ఆచరించిన ధన్యభూమి మనది. చెట్టూ పుట్టకు మొక్కి, పాముకు పాలు పోసి, చీమకు చక్కెరపెట్టి, పశువుకు దణ్ణం పెట్టే సంస్కృతి మనది. అటువంటి సంస్కృతికి దూరం అవుతున్న కొద్దీ విపరిణామాలు దగ్గరవుతున్నాయి. ప్రకృతి గొప్పతనాన్ని వివరిస్తూ బోధించిన విజ్ఞానాన్ని అవహేళన చేసే పరిస్థితి దాపురించింది. పాశ్చాత్య అభివృద్ధి నమూనాతో ఈ భూమిని, భూమిని ఆవరించుకుని ఉన్న ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల దుష్ఫలితాలను ఎదుర్కొంటున్నాం. తాగునీటిని సీసాల్లో కొనుక్కోవాల్సిన దుస్థితికి చేరుకున్నాం.
అంతేకాదు.. అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి, భూతాపం పెరిగిపోవడం వంటి విపత్తులతో అపార ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ప్రపంచంలో మంచి నీటికి, కొన్ని ప్రధాన నదుల పుట్టుకకు మూల వనరులు అయిన హిమానీ నదాలు (గ్లేసియర్లు) చాలా వేగంగా కరిగిపోతున్నాయన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా భూతాపం పెరిగి మంచు కొండలు, హిమానీ నదాలు చాలా వేగంగా కరిగిపోవడం కారణంగా నీటి చక్రం (మంచు కొండలు కరిగి నీటిగా మారడం, ఆ నీరు ఆవిరవడం, ఆవిరయిన నీరు వర్షంగా మారి తిరిగి భూమికి చేరడం– ఇదంతా ఒక క్రమబద్ధమైన చక్రం) అనూహ్య మార్పులకు లోనవుతోంది. ఫలితంగా తాగునీటి కొరత ఏర్పడడంతో పాటు సముద్ర మట్టం పెరిగిపోయి భూభాగం ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. భూమిపై అందుబాటులో ఉన్న మంచి నీటిలో 70 శాతం మంచు, హిమానీ నదాల రూపంలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 200 కోట్ల మంది ప్రజలు... హిమానీ నదాలు, మంచు కరగడం వల్ల వచ్చే నీటిపై, కొండలపై నుంచి ప్రవహించే నీటిపై ఆధార పడుతున్నారు. ఒక్క 2023లోనే హిమానీ నదాలు వేగంగా కరగడం వల్ల 600 గిగా టన్నుల నీటిని కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత 50 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత ఎక్కువ నష్టం. 1900 నుంచి ఇప్పటికి 20 సెంటీమీటర్లకు పైగా సముద్ర మట్టం పెరిగిందని నివేదికలు చెబుతున్న మాట ఎంతో కలవరపర్చే అంశం. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే నీరు అత్యంత విలాస వస్తువుగా మారిపోతుంది. నీటి కోసం యుద్ధాలు సంభవిస్తాయి. ఇప్పటికే నీటి కోసం ప్రజల మధ్య, దేశాల మధ్య సంఘర్షణ వాతావరణం నెలకొని ఉండడం, పాత ఒప్పందాలను కాలరాయడానికి కూడా తెగబడడాన్ని మనం చూస్తున్నాం.
నీటికి, అడవులకు అవినావాభావ సంబంధముంది. అడవులను కాపాడుకుంటే వర్షపాతం పెరుగుతుంది. వర్షపాతం పెరిగితే అది మళ్లీ అడవుల మనుగడకు ఉపయోగపడుతుంది. కానీ అభివృద్ధి పేరుతో అడవులను ఆక్రమిస్తూ, విధ్వంసానికి కారణమవడం వల్ల కూడా నీటి చక్రం తారుమారవుతోంది. అడవులు సహజసిద్ధమైన జలాశయాలు. వర్షపాతాన్ని ఇముడ్చుకుని భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేలా కాపాడతాయి. అడవులను విచ్చలవిడిగా నరికివేయడం వల్ల పచ్చదనం తగ్గి, వర్షపాతం తగ్గి కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పారిశ్రామికీకరణకు ముందు ఉన్న ఉష్ణోగ్రతల కన్నా 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు పెరగకుండా చేస్తే ప్రపంచంలోని ప్రాచీన హిమానీ నదాల్లో మూడింట రెండోవంతు హిమానీ నదాలను కాపాడుకోవచ్చని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఇందుకు కర్బన ఉద్గారాలను తగ్గించడం అత్యంత అవసరమైన పని. భూతాపంలో పెరుగుదల 2 డిగ్రీల సెల్సియస్ – 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న పారిస్ ఒప్పందానికి మన దేశం కట్టుబడి ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు చిత్తశుద్ధితో ఈ ఒప్పందానికి కట్టుబడడంతో పాటు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి కావాల్సిన నిధులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందిస్తే సమస్త మానవాళికి మేలు. భారతదేశ పౌరులుగా మనమందరం కూడా మనవంతు కర్తవ్యం నెరవేర్చాలి. పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకుంటూ పునర్వినియోగ ఇంధనం వైపు, శుద్ధ ఇంధనం వైపు మరలాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్లో సౌర విద్యుత్తు ఉపయుక్తం. గృహ వినియోగానికి సౌర విద్యుత్తును కేంద్ర ప్రభుత్వం రాయితీతో ప్రోత్సహిస్తోంది. ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఎక్కువ మంది ఇళ్లల్లో తాగునీటికి ఆర్వో పరికరాలను వాడుతున్నారు. వాటిల్లో నీటి వృథా ఎక్కువగా ఉంటుంది. ఆ నీటిని వృథాగా సింకుల్లోకి వదలకుండా మొక్కలకు పారేలా ఏర్పాట్లు చేసుకోవాలి. లేదంటే ఆ నీటిని సమీకరించే ఏర్పాటు చేసుకుని ఇతరత్రా అవసరాలకు వాడుకోవాలి. నీటిని పునర్వినియోగించుకునే పద్ధతులను అలవర్చుకోవాలి.
భూమి సహజ స్వభావాన్ని నాశనం చేస్తున్న అంశాల్లో ప్లాస్టిక్ ఒకటి. ఈ రోజు మన జీవితాల్లోకి ప్లాస్టిక్ బాగా చొచ్చుకొచ్చేసింది. పాత్రల నుంచి ప్యాకేజింగ్ వరకు అంతా ప్లాస్టిక్కే. ప్లాస్టిక్‌పై సరైన అవగాహన లేకుండా వినియోగిస్తే, దానివల్ల వాటిల్లే నష్టం ఎక్కువ. మైక్రోప్లాస్టిక్స్ దీర్ఘకాలంలో విషపూరిత రసాయనాలు విడుదల చేస్తాయని, అవి ఆహార చక్రంలోకి చేరి మానవాళి సహా జీవజాలం మొత్తానికి తీవ్ర హాని కలిగిస్తాయని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ప్రతి ఏటా 460 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తుంటే 20 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ పర్యావరణంలోకి చేరుతోంది. ఇది భూమిలో తొందరగా కలవదు. దీంతో జీవావరణానికి చాలా నష్టం జరగుతుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. దాదాపు 10 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ప్రతి ఏటా సముద్రాల్లో కలుస్తూ జీవావరణానికి విపరీత నష్టం కలిగిస్తోంది. సాధ్యమయినచోట వస్తువులను తీసుకువెళ్లడానికి ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జౌళి సంచులు వంటివి ఉపయోగించాలి. ప్లాస్టిక్ పాత్రలకు బదులు మట్టి పాత్రలు, దీర్ఘకాలం మన్నే స్టీలు పాత్రల వంటివి వాడుకోవాలి. జలవనరులను కలుషితం చేయడం, ఎక్కడికక్కడ చెత్త పారవేయడం వంటివి కూడా భూమి స్వభావాన్ని ప్రభావితం చేస్తున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. తడిచెత్త, పొడిచెత్తను వేరు చేస్తూ పునర్వినియోగానికి వీలుగా ఉన్నవాటిని పునిర్వియోగరూపంలోకి తీసుకొచ్చే ఏర్పాట్లు, ఇంధనం ఉత్పత్తి చేసే ఏర్పాట్లు, అందుకు తగ్గ విధానాలున్నా ఆచరణలో ఇంకా చాలా అవరోధాలున్నాయి. మన సమాజం ఇంకా ఈ పద్ధతులకు అలవాటుపడలేదు. నినాదాలకు పరిమితం కాకుండా ప్రజల్లో క్షేత్రస్థాయి నుంచే మార్పు వచ్చేలా ఆచరణాత్మక విధానాలు రూపొందించి అమలు చేయాలి.
మన మనుగడకు ఆధారం అయిన ఈ ధరిత్రిని కాపాడుకోవడానికి మనమందరం ఈ పంచసూత్రాలను అవలంబించాలి: 1. వినియోగ తత్వాన్ని తగ్గించుకుంటూ దీర్ఘకాలం మన్నే వస్తువులను వాడడం; 2. చెట్లను విచ్చలవిడిగా కొట్టకుండా, వీలయినన్ని ఎక్కువ మొక్కలు నాటుతూ అటవీ సంపదను పెంచడం; 3. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించుకుంటూ సౌరవిద్యుత్తు వంటి శుద్ధ ఇంధనం వైపు మరలడం; 4. జలవనరులను పరిరక్షించుకోవడం, ఆక్రమణలను తొలగించడం; 5. పూర్వ ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు ప్రకృతి వనరుల పరిరక్షణపై అవగాహన కల్పించడం, ఆచరణలో పెట్టించడం. ‘సుజలాం సుఫలాం మలయజశీతలామ్ సస్యశ్యామలాం మాతరం వందే మాతరం’ అంటూ స్వరాజ్య ఉద్యమ సమయంలో మన భారత భాగ్య విధాతలు కలలుగన్న కాలుష్యరహితమైన భూమిని భవిష్యత్ తరాలకు అందించడమే ఆ మహనీయులకు అందించే నిజమైన నివాళి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ప్రకృతి సంపదకు మనం ధర్మకర్తలమే కానీ యజమానులం కాదన్న జాతిపిత మహాత్మాగాంధీ బోధనలను ఆచరణలో చూపించాలి. ప్రకృతి వనరుల పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది మనందరి బాధ్యత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించినప్పుడు ఈ స్ఫూర్తి తరతరాలకు పరిఢవిల్లుతుంది.
ముప్పవరపు వెంకయ్యనాయుడు పూర్వ ఉపరాష్ట్రపతి (నేడు ధరిత్రి దినోత్సవం)