Share News

Sustainable Development: శ్రేయో సమాజమే ధరిత్రికి రక్ష

ABN , Publish Date - Apr 18 , 2025 | 03:43 AM

భారతదేశం అభివృద్ధి లక్ష్యాలకు స్థానిక వనరులను ఉపయోగించుకుంటూ వాతావరణ మార్పును అరికట్టాలి, పాశ్చాత్య పద్ధతులను అనుసరించకూడదు

Sustainable Development: శ్రేయో సమాజమే ధరిత్రికి రక్ష

వాతావరణ మార్పును అరికట్టే చర్యలు భారత్‌ చేపట్టకూడదు– ఇవి, ‘యూరోపియన్‌ దేశాల వాతావరణ మార్పు నిరోధక కార్యక్రమ’ ప్రతినిధులతో సంభాషిస్తూ నేను అన్న మాటలు. ఆ మాటలకు వారు కంగారుపడడాన్ని నేను గమనించాను. నేను ఏ కారణాలతో ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశానో వారికి వివరించాను. భారత్‌ లాంటి దేశాలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్లలో అభివృద్ధి ప్రధానమైనది. అభివృద్ధి అనేది సమ్మిళితంగా, సుస్థిరంగా ఉండి తీరాలని మనం నేడు సునిశ్చితంగా విశ్వసిస్తున్నాం కదా. స్థానిక కాలుష్యాన్ని తగ్గించేందుకు, హరిత జీవనాధారాలను పెంపొందించేందుకు మేము చేపట్టే చర్యలే హరిత గృహ వాయు ఉద్గారాలను తగ్గించుతాయి. ఈ విధంగా గ్రీన్‌ హౌజ్‌ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు ఉద్దేశించిన మార్పు... ‘వాతావరణ మార్పు నిరోధక కార్యాచరణ ప్రణాళిక’ (నేషనల్లీ డిటర్‌మైన్డ్‌ కంట్రిబ్యూషన్‌ – ఎన్‌డీసీ) అభివృద్ధి సాధన, వాతావరణ మార్పును అరికట్టడం అనే సహ–ప్రయోజనాల ప్రాతిపదికన ఉంటుంది. ఆ ప్రణాళికను సరైన విధంగా అమలుపరిచిన పక్షంలో సంభవించే అభివృద్ధి తక్షణ వాతావరణ మార్పు సంక్షోభాన్ని కూడా నివారిస్తుంది. ఈ ద్వంద్వ లక్ష్యాల (అభివృద్ధి సాధన, వాతావరణ మార్పు నిరోధం)ను సాధించడమనేది మా ప్రయోజనాలను కాపాడుకునేందుకు చాలా ముఖ్యం. వాతావరణ మార్పు ప్రభావాలకు మేము అమితంగా నష్టపోతున్నాం. అయితే భిన్న వ్యూహంతో అభివృద్ధి సాధనకు మేము పూనుకుంటే వాతావరణ మార్పును నివారించే ఏకైక లక్ష్యంతో రూపొందించిన కార్యాచరణ పథకాల వల్ల ఉత్పన్నమయ్యే అనూహ్య ప్రమాదాలను నివారించుకోగలుగుతాము.


ఏమంత సులువు కానివి, సరళమైనవి కానివీ అయిన మేము తీసుకుంటున్న చర్యలు ప్రజల ఆమోదాన్ని పొందేందుకు దోహదం చేస్తాయి. ఇంతకూ నా ఈ వాదనలను యూరోపియన్ వాతావరణ మార్పు నిరోధక నిపుణులు అమోదించారని నేను కచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే యూరోపియన్‌ దేశాలు ప్రధానంగా హరిత గృహ వాయు ఉద్గారాల తగ్గింపునకు మాత్రమే అమిత ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ అంశాన్ని విపులీకరిస్తాను. చాలా ఇతర దేశాల వలే భారత్‌ కూడా సత్వర సమ్మిళిత అభివృద్ధిని సాధించవలసి ఉన్నది. కోట్లాది మందికి ఉపాధి, ఆరోగ్య భద్రత, విద్య, గృహవసతి, విద్యుత్‌ సరఫరా సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఇదే భారతదేశ అభివృద్ధి నమూనాలో ప్రథమ ప్రాధాన్యం పొందుతున్న అంశం. సమస్త ప్రజల అవసరాలను తీర్చే విధంగా మా అభివృద్ధి ఉండి తీరాలి. ఈ దృష్ట్యా అభివృద్ధి నమూనాను మార్చుకోవలిసిన అవసరమున్నది. పెట్టుబడి–సాంద్ర, సహజ వనరుల వనరుల –సాంద్ర అభివృద్ధి మార్గాన్ని మేము అనుసరించలేము. ఆ అభివృద్ధి పథం పర్యావరణ విధ్వంసానికి, సమాజంలో అసమానతల పెరుగుదలకు మాత్రమే దారితీస్తుంది. పాశ్చాత్య దేశాల అభివృద్ధి నమూనాను భారత్ అనుసరించకూడదని, అనుసరించడం వాంఛనీయం కూడా కాదనే వాస్తవాన్ని దశాబ్దాల అనుభవాల ఆధారంగా మేము గ్రహించాము.


అభివృద్ధి మూలంగా ధ్వంసమైన పర్యావరణాన్ని పునరుద్ధరించుకునేందుకు అవసరమైన ఆర్థిక వనరులు మాకు లేవు. అభివృద్ధి సాధనకు ఉద్దేశించిన విధానాలలోనే వాతావరణ చర్యలు అంతర్భాగంగా ఉండి తీరాలి. ఉదాహరణకు ‘వాయు’ కాలుష్యాన్ని నివారించలేమని మాకు తెలుసు. చలనశీలతకు కొత్త రూపమివ్వకుండా వాయుకాలుష్య సమస్యను పరిష్కరించుకోలేము. వ్యక్తిగత వాహనాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. రోడ్లు అన్నీ వాటితో నిండిపోతున్నాయి. రద్దీని, కాలుష్యాన్ని పెంచుతున్నాయి. ఈ కారణంగానే విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పాశ్చాత్య దేశాలు పోత్సహిస్తున్నాయి. పారిశ్రామిక రంగం వ్యయాల తగ్గుదలకు, పోటీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు తోడ్పడే సాంకేతికతల అభివృద్ధికి పెద్ద ఎత్తున మదుపులు చేయవలసి ఉందనే వాస్తవాన్ని మా అనుభవాల నుంచి తెలుసుకున్నాం. ఉదాహరణకు సిమెంట్‌ పరిశ్రమనే తీసుకోండి. అది ఫ్లై–యాష్‌ను సున్నపురాయికి ప్రత్యామ్నాయంగా ముడి పదార్థంగా ఉపయోగించుకుంటోంది. దీని వల్ల విద్యుత్‌ ఉత్పాదన వ్యయాలు తగ్గుతున్నాయి. తక్కువ–కార్బన్ ఉద్గారాల పారిశ్రామికీకరణ భవిష్యత్తు అదే విధంగా సమరీతిలో లబ్ధికరంగా ఉండగలదు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే హరిత ఆర్థిక వ్యవస్థ భావనపై కొత్త ఆలోచన చేయవలసిన అవసరమున్నది. దాని నిర్మాణాన్ని పునః రూపొందించుకోవాలి హరిత ఉపాధి గురించి ప్రశంసాపూర్వక, ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడితే సరిపోదు, పునరుద్ధరణీయ ఇంధనాలు, విద్యుత్‌ వాహనాలతో జీవనోపాధుల అవకాశాలు పెరగవుగాక పెరగవు. నిజానికి బొగ్గు ఆధారిత వేడి కొలిమి (బ్లాస్ట్‌ ఫర్నేస్‌) నుంచి విద్యుత్‌ ఫర్నేస్‌కు మారినప్పటికీ బ్రిటన్‌లో వేలాది ఉద్యోగాలు మటుమాయమయ్యాయి.


ఈ కారణంగానే ప్రజలు వాతావరణ మార్పు గురించి ఎంతగా కలవరపడుతున్నారో జీవనోపాధుల గురించి కూడా అంతే ఆందోళన చెందుతున్నారు. చెప్పవచ్చినదేమిటంటే స్థానిక జీవనాధారాలకు స్థానిక వనరులను ఉపయోగించుకోవడం ద్వారా భారత్‌ తన ఆర్థిక వ్యవస్థను సరికొత్త రీతిలో నిర్మించుకోవాలి. తద్వారా వాతావరణ వైపరీత్యాలను తట్టుకోగలగడంతో పాటు ఉపాధికై ప్రజల వలసలను కూడా నిలిపివేయగలుగుతాము. సహజవనరులను మితిమీరినస్థాయిలో వినియోగించుకుని సరుకులు ఉత్పత్తి, ఎగుమతులతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెంపుదలే లక్ష్యంగా ఉండే ఆర్థిక వ్యవస్థ భారత్‌కు మేలు చేయదు. స్థానిక జీవనాధారాలను ఇతోధికంగా పెంపొందించేలా పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడే ఆర్థిక వ్యవస్థే భారత్‌కు శ్రేయస్కరమైనది. వాతావరణ మార్పును నిరోధించే భారత్‌ కార్యచరణ పథకం ప్రజల సంక్షేమానికి, ధరిత్రి రక్షణకు ఉపయోగపడేలా ఉండాలి.

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - Apr 18 , 2025 | 03:50 AM