వెన్నాడుతున్న ‘ఇంద్రవెల్లి’ జ్ఞాపకాలు
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:41 AM
అది ఏప్రిల్ 20, 1981. ఆదివాసీ గూడేలు, పల్లెలలో నివసిస్తున్న ప్రజల సమస్యలను పరిష్కరించే సభ ఉందని, అదే రోజు అంగడి కూడా ఉండడంతో రెండు పనులూ చూసుకువద్దామని, మన కొరకు...
అది ఏప్రిల్ 20, 1981. ఆదివాసీ గూడేలు, పల్లెలలో నివసిస్తున్న ప్రజల సమస్యలను పరిష్కరించే సభ ఉందని, అదే రోజు అంగడి కూడా ఉండడంతో రెండు పనులూ చూసుకువద్దామని, మన కొరకు పెట్టిన సంఘం వారు చెప్పేది విందాం అన్న ఉత్సాహంతో ఇంద్రవెల్లి సభకు గుంపులు గుంపులుగా కదిలారు ఆదివాసీలు.
ఈ సభకు వారం రోజుల ముందు నుంచే నిర్మల్, ఉట్నూర్, ఆదిలాబాద్ డివిజన్ ప్రజలకు రైతు కూలీ సంఘం వారు కరపత్రాలు పంచి, గూడేల ప్రజల సమస్యల పరిష్కారానికి సభకు రావాలని చాటింపు వేయించారు. పోలీసు అధికారుల అనుమతి కూడా తీసుకున్నారు. ఆ సభకు జనం తండోపతండాలుగా కదలడం చూసి ఇంద్రవెల్లి షావుకార్లు, దోపిడీదారులు, వలసవాదుల గుండెలు అదిరాయి. వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారులకు అబద్ధపు సమాచారం ఇచ్చారు. ‘ఆదివాసులు దాడులు చేయడానికి ఇంద్రవెల్లిని చుట్టుముడుతున్నారు. పల్లెలు, గోండు గూడేలు కదిలినాయి. మాకు ప్రాణభయం ఉంది రక్షించండ’ని చెప్పడంతో, అప్పటి ఆదిలాబాద్ ఎస్పీ పోలీసు బలగాలను దించి, ఆదివాసీలను చుట్టుముట్టారు. అమాయక గోండు ప్రజలకు ఇదంతా అర్థం కాలేదు. దీనికి తోడు వారికి తెలుగు భాష అర్థం కాదు. పోలీసులకు గోండు భాష అర్థం కాలేదు. ఒక పోలీసు అధికారి వచ్చి ‘ఇక్కడ (ఇంద్రవెల్లి) చుట్టపక్కల కూర్చోవడానికి, గుంపులు గుంపులుగా ఉండడానికి అనుమతి లేదు. వెళ్లిపోండి’ అని హెచ్చరికలు జారీచేశారు. తొడసం కట్టి అనే ఆదివాసీ నాయకుడు లేచి ఆరు రోజుల ముందే సభ అనుమతి తీసుకున్నాం అన్నాడు. అతన్ని అరెస్టు చేశారు. కొంత మంది ముఖ్య నాయకులను 19వ తేదీనే అరెస్టు చేశారు. పోయినోళ్లను పోయినట్లే అరెస్టు చేస్తున్నారు. ఏం జరుగుతుందో వచ్చిన ప్రజలకు అర్థం కావడం లేదు. సభలో ఏం చెబుతారో, సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమోనని గుంపులు.. గుంపులుగా ఇంకా జనం వస్తూనే ఉన్నారు. సభ అయిన తరువాత అంగడి చేద్దామనుకున్నారు.
కనక హన్మంతు (నిజాం గూడ) రైతుకూలి సంఘం నాయకత్వంలో జనాన్ని కంట్రోల్ చేస్తున్నారు. జనం సభ స్థలానికి పోవడానికి తహతహలాడుతున్నారు. పోలీసులు పంపడం లేదు. విసుగు చెంది మన సభ, మన స్థలం ఎవరిదైనా గుంజుకుంటున్నామా! మన సభలో ఈ పోలీసులు ఎందుకూ! సభ స్థలంకై పోదం పదండని మహిళలు దండు పిట్టబొంగరం, వెట్టి ఇస్రూబాయి ధైర్యంతో ముందడుగు వేశారు. మహిళా దండు కదిలింది. అంతలోనే మగ పోలీసులు సభకు వెళ్లొద్దని ఆపే క్రమంలో మహిళల ఛాతీపై చేతులు వేసి వెనక్కి దొబ్బడంతో, కోపంతో ఆమె ఆ పోలీసును కొట్టి చంపింది. ఇదే అదునుగా పోలీసులు గోండు ప్రజలపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. భయంకరమైన శబ్దాలతో సభా ప్రదేశం దద్దరిల్లుతోంది. హాహాకారాలు, అరుపులు, కేకలు, ఏం జరుగుతుందో తెలియని స్థితి. గంట, గంటన్నర తరువాత చూస్తే భయంకరమైన దృశ్యాలు రక్తంతో భూమి తడిసింది. శరీరాల నుంచి రక్తం కారుతూనే ఉంది. శవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒకే లారీలో శవాలతో పాటు గాయాలతో ఉన్నవారిని, కొన ఊపిరితో కొట్టుకుంటున్నవారిని ఒకరి మీద ఒకరిని కట్టెల మోపులాగా వేయడంతో ఇంకొందరు ఊపిరాడక చనిపోయారు. ఆ కాల్పుల్లో 130 మంది వరకు చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కనిపించకుండా పోయిన వారి సంఖ్యకు అంతులేదు. ఆ సంఘటన తరువాత నుంచి వడ్గాం గ్రామం కనకరాము కనిపించకుండా పోతే కొన్ని నెలల తరువాత పోలీసులు వచ్చి అతడు కాల్పుల్లో మరణించాడని చెప్పి ఐదు వందల రూపాయలు చేతిలో పెట్టి పోయారు. ఇలా దాదాపు నాలుగున్నర దశాబ్దాల నుంచి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి.
ప్రభుత్వాలు మారుతున్నాయి. నాయకులు మారుతున్నారు. అన్ని పార్టీలలో ఆదివాసీ నాయకులున్నారు. అయినా ఈ రోజుకీ అమరులందరినీ గుర్తించలేకపోతున్నారు. సమస్యల్ని పరిష్కరించలేకపోతున్నారు. గుర్తించిన అమరుల కుటుంబాలకైనా పరిహారం ఇచ్చారా అంటే అదీ లేదు. దోపిడీలు, షావుకార్ల, వడ్డీ వ్యాపారుల, చౌకీదార్ల, పోలీసుల బూటకపు హత్యలు, ఏజెన్సీ, ఆదివాసీ రక్షణ చట్టాల ఉల్లంఘన... 45 సంవత్సరాల క్రితం ఉన్న స్థితే నేటికీ కొనసాగుతోంది. రూపాలు వేరు కాని దోపిడి పాతదే. ఆదివాసీ గోండుల సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారికి పూజలు కూడా చేయనీయకుండా, స్థూపాలు కట్టకుండా చేశారు. ఒకవేళ కట్టినా దొంగచాటుగా వాటిని కూల్చేసేవారు. 1982 నుంచి 1999 వరకు ఉన్న ప్రభుత్వాలు గ్రామాల్లో పోలీసు బలగాల పహారా ఏర్పరచి, నిషేధాజ్ఞలు పెట్టాయి. తెలంగాణ ఉద్యమంలో స్థూపం వద్దకు వచ్చిన నాయకులు ప్రమాణాలు చేసి, ఇంద్రవెల్లి అమరులు ఏ ఆశయం కోసం ప్రాణాలర్పించారో... తెలంగాణ వస్తే వారి ఆశయాలను నెరవేరుస్తామని చెప్పారు. నిషేధాజ్ఞలను ఎత్తివేస్తామని, ఆ ప్రదేశాన్ని స్మృతి వనం చేస్తామని, అటవీ హక్కుల చట్టాలు అమలుపరుస్తామని చెప్పారు.
2017లో ప్రస్తుతం ఉన్న అమరవీరుల స్థూపం స్థలంలో స్మరించుకోవడానికి, పూజకు అనుమతి కొరకు హైకోర్టులో ఈ వ్యాస రచయిత, తదితరులు కోర్టులో పిటిషన్ వేసి అనుమతి తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్, -20న పూజలు జరుగుతున్నాయి. 2017 నుంచి కోర్టు ఆదేశాలతో గూడేలలో పోలీసు కూంబింగ్ తగ్గించారు కానీ, 144 సెక్షన్ ఇప్పటికి అమలు చేస్తూనే ఉన్నారు.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏజెన్సీ అటవీ హక్కుల చట్టాలు అమలుచేస్తామని నమ్మబలికి, పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే గ్రీన్ హంట్, ఆపరేషన్ కగార్. ఇది ఎవరి అభివృద్ధి కోసం? ఆదివాసులు ఈ దేశ పౌరులు కాదా? అడవి, ఆదివాసులకు రక్షణ లేదు. ఎప్పుడేం జరుగుతుందోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కుమంటు ఆదివాసులు రోజులు గడుపుతున్నారు. వారిని రక్షించడం ప్రభుత్వాల బాధ్యత కాదా?
ఆత్రం భుజంగరావు
ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయ సాధన సమితి వ్యవస్థాపకులు
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఫోర్త్ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి
Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!
Read Latest Telangana News And Telugu News