Share News

Kanshi Ram: బహుజన రాజ్యాధికార పథనిర్దేశకుడు

ABN , Publish Date - Mar 15 , 2025 | 03:42 AM

బహుజనుల సకల సమస్యల పరిష్కారం లక్ష్యంగా మహోద్యమాన్ని నడిపిన యోధుడు కాన్షీరామ్‌. ‘ఓట్‌ హమారా – రాజ్‌ తుమారా, నహీ చలేగా.. నహీ చలేగా’ అనే డైనమేట్‌ వంటి నినాదంతో....

Kanshi Ram: బహుజన రాజ్యాధికార పథనిర్దేశకుడు

హుజనుల సకల సమస్యల పరిష్కారం లక్ష్యంగా మహోద్యమాన్ని నడిపిన యోధుడు కాన్షీరామ్‌. ‘ఓట్‌ హమారా – రాజ్‌ తుమారా, నహీ చలేగా.. నహీ చలేగా’ అనే డైనమేట్‌ వంటి నినాదంతో, జిస్‌కా జిన్‌కా సంఖ్య భారీ, ఉస్‌కి ఉత్‌ని భాగ్యధారి అనే నినాదంతో సమాజంలోని 85 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు రాజ్యాధికారం దక్కాలనే సిద్ధాంత భూమికలో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన గొప్ప వ్యూహకర్త కాన్షీరామ్‌.

1934 మార్చి 15న పంజాబ్‌ రాష్ట్రం, రోపార్‌ జిల్లా ఖవాస్‌పూర్‌లో ఉన్న పీర్షివూర్‌ బంగ్లా గ్రామంలో ఒక చమార్‌ కుటుంబంలో కాన్షీరామ్‌ జన్మించారు. ఆయిదో సిక్కు గురు రాందాస్‌ చమార్‌లను సిక్కు మతంలోకి తీసుకువచ్చారు. వారిని రాందాసియాలు అనేవారు. కబీర్‌, రవిదాస్‌ల వంటి దళిత సాధువులతో ప్రభావితమైన ఖల్సా పంథ్‌, ఆర్యసమాజ్‌ ఉద్యమాల ప్రభావం చిన్ననాడే కాన్షీరామ్‌‌పై పడింది. పూణేలోని (ఈఆర్‌డిఎల్‌) ఎక్స్‌ప్లోజివ్‌ రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబరేటరీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నప్పుడు అధికారులు బుద్ధ జయంతి, అంబేడ్కర్‌ జయంతి సెలవులను రద్దు చేయడంపై దళిత ఉద్యోగులు నిరసన తెలుపడంతో, అందులో రాజస్థానీ షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వ్యక్తిని సస్పెండ్‌ చేయడంపై కాన్షీరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్షీరామ్‌ ఆయన పక్షాన నిలిచి పోరాడారు. అది ఆయన దళిత ఉద్యోగుల ఉద్యమాన్ని నిర్మించేందుకు కారణమైంది. ఈ ఉద్యమం తీవ్రతరమై కాన్షీరామ్‌ ఏకంగా రక్షణ మంత్రి వై.బి.చవాన్‌ను కలిసి పరిస్థితి వివరించారు. చవాన్‌ మొత్తం ఉదంతంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించి సస్పెండయిన ఉద్యోగికి న్యాయం జరిగేలా చేశారు. దీనితో కాన్షీరామ్‌ దళిత ఉద్యోగులకు ఒక హీరోగా మారారు. ఈ సంఘటనే కాన్షీరామ్‌ జీవితాన్ని మార్చి వేసింది. తన జాతి జనుల కోసం పాటుపడ్డ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాల్ని కొనసాగించాలని, ప్రస్తుత సామాజిక వ్యవస్థపై తిరుగుబాటు చేయక తప్పదని నిర్ణయించుకున్నారు.


1965 నుంచి 1971 వరకు రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాను బలోపేతం చేయడానికి రాత్రి పగలు అకుంఠిత దీక్షతో కృషి చేశాడు. ఆర్‌పీఐలో వచ్చిన విభేదాలతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి తన ఉద్యమాన్ని కొనసాగించారు. బోధించు, పోరాడు, సమీకరించు నినాదంతో 1978 డిసెంబర్‌ 6న ‘వెనుకబడిన కులాల, మైనారిటీ ఉద్యోగుల సమాఖ్య’ (బామ్‌సెఫ్‌) స్థాపించారు. తాము పుట్టిన కులంలోని అట్టడుగున ఉన్న తమ సోదరుల కోసం తాము కొంత పాటుపడాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ కృషితో వచ్చిన రిజర్వేషన్ల వల్ల లాభం పొందిన వారిని ఏకం చేశారు. బామ్‌సెఫ్‌ నిర్వహణకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం తీవ్రంగా శ్రమించాడు. ‘పే బ్యాక్‌ టు ద సొసైటీ’ అనే నినాదంతో రాజకీయేతర పునాదులను పటిష్ఠం చేయడానికి బామ్‌సెఫ్‌ పనిచేసింది. దోపిడీకి గురౌతున్న సమాజానికి విద్యావంతులైన ఉద్యోగులు మేధస్సు, డబ్బు, ప్రతిభ అందించాలని, బామ్‌సెఫ్‌ నిర్మాణానికి ఈ మూడే చోదక శక్తులని కాన్షీరామ్‌ ప్రకటించాడు. బామ్‌సెఫ్‌ను కాన్షీరామ్‌ నిజమైన అంబేడ్కర్‌ మిషన్‌గా తీర్చిదిద్దాడు.


సామాజిక పరివర్తన ధ్యేయంగా 1981లో డిసెంబర్‌ 6న దళిత అణగారిన వర్గాల పోరాట సమితి (డీఎస్‌ 4) స్థాపించారు. ఉత్తర భారతదేశంలో ఒక సంచలనాత్మక సామాజిక విప్లవాన్ని సృష్టించారు. ఇందులో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరారు. కార్గిల్‌ నుంచి కన్యాకుమారి వరకు ‘సమానత్వం కోసం’ సైకిల్‌ ర్యాలీ నిర్వహించిన కాన్షీరామ్‌ 1982లో హర్యానా, ఢిల్లీ, పంజాబ్‌, జమ్మూకాశ్మీర్‌ ఎన్నికల్లో సంస్థ పోటీ చేసింది. పోటీ చేసిన పార్టీలలో 4వ స్థానాన్ని సాధించింది. ఈ ఉత్సాహంతో కాన్షీరామ్‌ ఉత్తర భారతదేశమంతా పర్యటించి బహుజనులకు ఒక రాజకీయ పార్టీ అవసరాన్ని తెలియజేస్తూ సభలు నిర్వహించాడు. 1930లో డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ తొలిసారిగా ఓటు హక్కు లభించాక ‘‘మీరు వెళ్ళి మీ ఇంటి గోడలపై రాయండి, ఈ దేశానికి మేము పాలకులం కాబోతున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ నినాదాన్ని తీసుకుని. మేధావులతో చర్చించి కాన్షీరామ్‌ పార్టీ పేరు, ఎన్నికల గుర్తు గురించి చర్చించి, ఏప్రిల్‌ 14, 1984న బహుజన్‌ సమాజ్‌ పార్టీని స్థాపించారు. కాన్షీరామ్‌ ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది అంబేడ్కర్‌ పుట్టిన రోజున గానీ, మరణించిన రోజున గానీ చేస్తారు. ఎందుకంటే ఆ రెండు రోజులు బహుజనులకు ప్రధానమైనవని ఆయన భావించేవారు. ఫూలే ఉద్యమం నుండి బహుజన్‌ సమాజ్‌ పేరును, అంబేడ్కర్‌ ఉద్యమం నుండి నీలిజెండా, ఏనుగు గుర్తును తీసుకున్నట్లుగా కాన్షీరామ్‌ ప్రకటించారు.


బహుజన సమాజ్‌ పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దడంలో కాన్షీరామ్‌ నిరంతరం శ్రమించాడు. విజయం సాధించాడు. దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ఒక సామాన్య మహిళా, ‘చమార్‌’ స్త్రీని మూడుసార్లు ముఖ్యమంత్రిని చేసిన ఘనత పూర్తిగా కాన్షీరామ్‌దే. ఓట్ల రాజకీయాలను నోట్లు కలుషితం చేస్తూ కార్పొరేట్‌ రాజకీయాలు కొనసాగుతున్న తరుణంలో ‘ఒక ఓటు ఒక నోటు’ అనే నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్ళి వారిచ్చే డబ్బుతో ప్రచారం చేస్తూ ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని సాధించి దేశ రాజకీయాలకు సరికొత్త విలువలు నేర్పిన మార్గదర్శకుడు కాన్షీరామ్‌. పదవులు ముఖ్యం కాదు బహుజన సమాజ్‌ నిర్మాణమే నా కర్తవ్యం అని భావించేవారు. 1994లో కోనేరు రంగారావు ఉపముఖ్యమంత్రి కాగలిగారంటే అందుకు కాన్షీరామ్‌ హైదరాబాద్‌ జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించిన శక్తి ప్రదర్శన ప్రధాన కారణం. 2003లో మెదక్‌ అసెంబ్లీ ఉపన్నికలలో బీఎస్‌పీ అభ్యర్థి పోటీ చేసినపుడు బహుజనులు ఏకమైతేనే ఈ నిచ్చనమెట్ల కుల వ్యవస్థను కూలదోయవచ్చని పిలుపునిచ్చారు.

దేశ రాజకీయాల్లో కాన్షీరామ్‌ ప్రవేశం గొప్ప సంచలనం. అంబేడ్కర్‌ కలలు నిజం చేయడానికి ముందుకురికిన రాజనీతిజ్ఞుడు. అన్ని రాజకీయ పార్టీలు వారి వారి పార్టీ స్థాపకుల ఫోటోలను వేదిక మీద ప్రదర్శిస్తుంటే కాన్షీరామ్‌ మాత్రం జాతిని చైతన్య పరిచిన బుద్ధుడు, ఫూలే, నారాయణగురు, పెరియార్‌, అంబేడ్కర్‌ల వంటి సామాజిక విప్లవకారుల చిత్రపటాలను బహిరంగ సభల్లో ప్రదర్శించేవారు. ఈ దేశాన్ని పాలించడమే లక్ష్యంగా రాజ్యాధికారం వైపు వెళితేనే బహుజనులకు భవిష్యత్తు ఉంటుందని స్పష్టంగా వివరించినవారు కాన్షీరామ్‌‌. ఆయన మరణించినా ఆయన ఆశయం మరణించలేదు.

డాక్టర్‌ బోనకుర్తి సోమేశ్వర్‌

(నేడు కాన్షీరామ్‌ జయంతి)

‘పునాది’ సెంటర్‌ ఫర్‌ రిసెర్చ్‌

Updated Date - Mar 15 , 2025 | 03:42 AM