Share News

వాటీజ్‌ దిస్‌ జస్టిస్‌?

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:46 AM

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయని వెలువడ్డ వార్త న్యాయ వ్యవస్థను ఉలికిపాటుకు గురిచేసింది. న్యాయవ్యవస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిన...

వాటీజ్‌ దిస్‌ జస్టిస్‌?

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయని వెలువడ్డ వార్త న్యాయ వ్యవస్థను ఉలికిపాటుకు గురిచేసింది. న్యాయవ్యవస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వెలువడిన ఈ వార్తతో సదరు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం మరింత సన్నగిల్లింది. ఈ ఉదంతంతో పలు మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నోట్ల కట్టలు ఈ నెల 14న బయటపడగా, వారం రోజుల వరకు అది వెలుగు చూడకపోవడానికి కారణం ఏమిటి? ఆ నోటా ఈ నోటా ఈ ఉదంతం వెలుగులోకి రావడం ఏమిటి? సదరు న్యాయమూర్తిని కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకోవడం ఏమిటి? లెక్కల్లో చూపని నగదు దొరికినప్పుడు హడావిడి చేసే ఈడీ, ఆదాయపు పన్ను శాఖలు మౌనంగా ఉండటం ఏమిటి? ఈ సంఘటనపై సమాచారం సుప్రీంకోర్టు కొలీజియంకు నిజంగానే ఆలస్యంగా తెలిసిందా? లేక ఈ వ్యవహారం గాలివానగా మారడంతో విధిలేని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కొలీజియం స్పందించిందా? ఈ సంఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ చేపట్టగా ‘అబ్బే, సదరు న్యాయమూర్తి ఇంట్లో డబ్బే దొరకలేదు’ అని ఢిల్లీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటించడం ఏమిటి? ఇందులో నిజానిజాలు తెలుసుకొనే హక్కు ఈ దేశ పౌరులకు లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయా? అవినీతికి అతీతం కాదా?? మిగతా వ్యవస్థల వలే న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి చోటుచేసుకుంటోందన్న విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే, న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కారణంగా న్యాయమూర్తుల అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. కీలకమైన, సున్నితమైన అంశాలపై విచారణ జరిపి తీర్పులు ఇచ్చే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రాజ్యాంగ నిర్మాతలు సదుద్దేశంతో రక్షణలు కల్పించారు. ఇప్పుడా రక్షణలను కొంతమంది న్యాయమూర్తులు దుర్వినియోగం చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. తీర్పులు అనుకూలంగా రాని సందర్భాలలో కక్షిదారులు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించకుండా రాజ్యాంగ నిర్మాతలు ఈ రక్షణలు కల్పించారు. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించే వారిని కోర్టు ధిక్కరణ కింద శిక్షించే వెసులుబాటును న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించింది. న్యాయమూర్తులకు కల్పించినంత రక్షణ న్యాయాధికారులకు కల్పించలేదు. కింది స్థాయి కోర్టులలో పనిచేసే న్యాయాధికారులు అవినీతికి పాల్పడినా లేదా ఇతర అనైతిక చర్యలకు పాల్పడినా వారిపై చర్యలు తీసుకొనే అవకాశం హైకోర్టులకు కల్పించారు. అదే హైకోర్టు న్యాయమూర్తి ఎవరైనా అవినీతికి పాల్పడ్డారని వెల్లడైనా సదరు న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు కూడా నేరుగా చర్య తీసుకోలేదు.


పార్లమెంటు ఉభయ సభల్లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారానే సదరు న్యాయమూర్తులను తొలగించగలరు. స్వతంత్ర భారతావనిలో రామస్వామి, సౌమిత్రసేన్‌ అనే ఇద్దరు న్యాయమూర్తులు మాత్రమే అభిశంసన ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు లభించిన విషయం వాస్తవమేనని రుజువైతే ఆయనపై ఏమి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. న్యాయాధికారులను అవినీతి కేసులలో అరెస్టు చేసి జైలుకు పంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇనుప ఖనిజం గనుల వ్యవహారంలో గాలి జనార్దన్‌రెడ్డి అండ్‌ కో నుంచి ఐదు కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలపై పట్టాభి రామారావు అనే న్యాయాధికారిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో సీబీఐ అధికారులు ఆయనను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో అవమాన భారంతో కుంగిపోయిన పట్టాభి రామారావు కొంతకాలానికి ఆత్మహత్య చేసుకున్నారు. నిజమేనా? నిజమైతే ఏం చేస్తారు? ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మ వ్యవహారం రచ్చగా మారింది. వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కొలీజియం నిర్ణయించడంతో, ‘మా హైకోర్టు ఏమైనా చెత్త బుట్టా?’ అని అలహాబాద్‌ హైకోర్టు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీంతో వర్మ బదిలీకి, ఆయనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేపట్టిన అంతర్గత విచారణకూ సంబంధం లేదని సుప్రీంకోర్టు కొలీజియం వివరణ ఇచ్చింది. డబ్బు కట్టలు లభించిన విషయం నిజమా? కాదా? అని నిర్ధారించుకోవడానికి వారం రోజులు చాలవా? ఇంకెంత కాలం కావాలి? ఒకవేళ అది నిజం కాని పక్షంలో యశ్వంత్‌ వర్మ ప్రతిష్ఠకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అంతర్గత విచారణలో అది నిజమే అని తేలితే సదరు న్యాయమూర్తిపై ఏమి చర్యలు తీసుకుంటారు? వారం రోజులుగా ఈ వ్యవహారం గుప్పుమంటున్నా నోరు విప్పని ఢిల్లీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ గర్గ్‌ ఇప్పుడు ‘అబ్బే, అలాంటిదేమీ లేదు’ అని ప్రకటించడమేమిటి? దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మౌనంగా ఎందుకుందో తెలియదు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల వద్ద లెక్కల్లో చూపని నగదు స్వల్ప మొత్తంలో దొరికినా అవినీతి నిరోధక సంస్థలు కేసులు పెడతాయి.


లంచంగా వంద రూపాయలు తీసుకున్నప్పటికీ నేరం నేరమేనని ఉన్నత న్యాయస్థానాలు ఎన్నో సందర్భాలలో తీర్పులు ఇచ్చాయి. ఈ సూత్రం న్యాయమూర్తులకు వర్తించదా? రాజ్యాంగపరంగా రక్షణ కల్పించబడినప్పటికీ ఇలాంటి సందర్భాలలో సదరు న్యాయమూర్తులపై చర్యలు తీసుకోని పక్షంలో ప్రజలకు న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఎలా ఉంటుంది? న్యాయవ్యవస్థలోనూ జవాబుదారీతనం ఉండాలి కదా? కీలక ప్రశ్నలు... న్యాయ వ్యవస్థలో అవినీతి అనేది బహిరంగ రహస్యంగా మారిన ఈ రోజుల్లో న్యాయమూర్తులకు రాజ్యాంగం కల్పించిన రక్షణలను కొనసాగించవలసిందేనా? ఇప్పటికే న్యాయమూర్తుల నియామకం ప్రక్రియ చర్చనీయాంశం అయింది. ఉన్నత న్యాయస్థానాలతోపాటు సర్వోన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించే అధికారం కొలీజియం వద్ద ఉండటం వాంఛనీయం కాదన్న వాదన నడుస్తోంది. అలా అని న్యాయమూర్తుల నియామక అధికారం ప్రభుత్వాలకు అప్పగిస్తే న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందన్న వాదన కూడా బలంగా ఉంది. ఇటీవలి కాలంలో మన న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. దేశంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడల్లా న్యాయ వ్యవస్థ సాగిలపడిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో పాలకులు ఎంత శక్తిమంతులుగా ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడిన న్యాయమూర్తులను కూడా చూశాం. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ లొంగిపోయిందని చెబుతారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉండేవారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పి.శివశంకర్‌ పనిచేశారు. అప్పట్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ద్రోణంరాజు సత్యనారాయణ అనే కాంగ్రెస్‌ నాయకుడు హైకోర్టులో రిట్‌ దాఖలు చేశారు. ఈ రిట్‌ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనం నెలల తరబడి విచారించింది. చివరికి ముఖ్యమంత్రి నివాసంలో పరిమితికి మించి పాలు వినియోగించడం వంటి అంశాలలో ఎన్టీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేందుకు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం తేల్చింది.


రెండు మూడు లీటర్ల పాలు ఎక్కువగా వినియోగించారని ఇప్పుడు తీర్పు ఇస్తే జనం నవ్వుకుంటారు. వందల, వేల కోట్ల అవినీతి జరిగినా, జరుగుతున్నా ప్రజల్లో స్పందన ఉండటం లేదు. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా తీర్పు రావడానికి పై నుంచి వచ్చిన ఒత్తిళ్లు పనిచేశాయని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిపై ఎన్టీఆర్‌ సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. అది విచారణకు రాకముందే ఆయన కన్ను మూశారు. కేసు దాఖలు చేసిన ద్రోణంరాజు గానీ, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కానీ, న్యాయశాఖ మంత్రి శివశంకర్‌ కానీ, ద్రోణంరాజు తరఫున కేసులు వాదించిన ఎస్‌.రామచంద్రరావు కానీ ఇప్పుడు మన మధ్య లేరు. ఎన్టీఆర్‌ తరఫున వాదించిన ఇ.అయ్యపురెడ్డి కూడా ఇప్పుడు మనతో లేరు. కేంద్రంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడు న్యాయవ్యవస్థ ఒత్తిళ్లకు తలొగ్గే అవకాశం ఉందని చెప్పడానికి ఎన్టీఆర్‌ కేసును ఒక ఉదాహరణగా న్యాయ నిపుణులు చెబుతుంటారు. అలా అని న్యాయమూర్తులు అందరూ అలాగే ఉంటారని భావించకూడదు. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది కూడా అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తే. జస్టిస్‌ జగ్మోహన్‌ లాల్‌ సిన్హా ఇచ్చిన ఆ సాహసోపేత తీర్పు బలమైన నాయకురాలు ఇందిరాగాంధీని డిఫెన్స్‌లో పడేసింది. నాటి తీర్పు నుంచి బయటపడేందుకు దేశంలో అత్యయిక పరిస్థితిని ఇందిరాగాంధీ అమలు చేశారు. ఆమె అధికారం కూడా కోల్పోయారు. అలాంటి నిఖార్సయిన న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు. తులసి వనంలో గంజాయి మొక్కల్లా అక్కడక్కడా కొంత మంది దారితప్పుతారు. కాకపోతే ఇటీవలి కాలంలో గంజాయి మొక్కలు ఎక్కువ అవుతున్నాయన్న భావన ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు మళ్లీ యశ్వంత్‌ వర్మ వ్యవహారానికి వద్దాం! ఈ విషయం కేవలం న్యాయ వ్యవస్థ ప్రైవేటు వ్యవహారం కాదు. న్యాయ వ్యవస్థ స్వచ్ఛంగా ఉండాలని కోరుకొనే హక్కు ఈ దేశ పౌరులకు ఉంది. రాజ్యాంగం ఎన్ని రక్షణలు కల్పించినప్పటికీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయే పనులు చేయకూడదు కదా! తనకు సంబంధించి వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సదరు న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మ అయినా ప్రకటించాలి, లేదా విచారణను త్వరగా ముగించి వాస్తవం ఏమిటో ప్రజలకు తెలియజేయాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు మంచి పేరే ఉంది. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను కాపాడేందుకు ఆయన చర్యలు తీసుకోవాలి. సంఘటన జరిగిన తర్వాత వారం రోజుల వరకు నోట్ల కట్టల వ్యవహారం బయటకు రాకపోవడమే తనను అధికంగా బాధిస్తోందని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయంతో ఎవరైనా ఏకీభవించాల్సిందే. నోట్ల కట్టలు అక్కడ ఉండటం నిజమే అయితే దాన్ని దాచిపెట్టాలని అనుకోవడం కూడా నేరమే అవుతుంది. తప్పు జరిగినప్పుడు చర్యలు తీసుకోవాలిగానీ జరిగిన దానికి మసిబూసి మారేడు కాయ చేయాలనుకోవడం కూడా నేరం అవుతుంది. నిప్పు లేనిదే పొగ రాదు అని అంటారు. ఇప్పుడు పొగ వచ్చింది. నోట్ల కట్టల వ్యవహారం దాచిపెట్టాలని ఏ స్థాయిలో ప్రయత్నాలు జరిగినా ప్రజల్లో న్యాయ వ్యవస్థ విశ్వసనీయత మరింత దెబ్బతింటుంది. న్యాయమూర్తులు కూడా ఈ సమాజం నుంచే వస్తారు. వారు ఆకాశం నుంచి ఊడిపడరు. సమాజంలో ఉన్న బలహీనతలు వారిలో కొందరికి ఉండవచ్చు కూడా. అంచేత తప్పు జరిగి ఉంటే... తప్పు జరిగిందని సర్వోన్నత న్యాయస్థానమైనా స్పష్టం చేస్తే ప్రజలకు కొంతలో కొంతైనా ఉపశమనం లభిస్తుంది.


అలా కాకుండా ఇది తమ అంతర్గత వ్యవహారమని, తామే చూసుకుంటామని ఏ స్థాయిలోనైనా భావిస్తే అది న్యాయ వ్యవస్థకు కీడు చేసినట్టే అవుతుంది. నోట్ల కట్టల ఉదంతం శుక్రవారం ఉదయం నుంచి ప్రసార మాధ్యమాలలో ప్రచారమైనప్పటికీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ రాత్రి పొద్దుపోయాక అంతా ఉత్తదే అని ప్రకటించడం, శనివారం అందుకు విరుద్ధంగా తాను అలా అనలేదని మాటమార్చడం వింతగా ఉంది. ఏదేమైనా మన న్యాయ వ్యవస్థకు కూడా జవాబుదారీతనం ఉండాలి. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో నిజంగా డబ్బు లభించి ఉంటే ఆయనకు ఏ శిక్ష విధిస్తారోనని కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయనతో రాజీనామా మాత్రమే చేయిస్తారా? లేక అవినీతి నిరోధక చట్టాలు, మనీ లాండరింగ్‌ చట్టాల కింద శిక్షిస్తారా అన్నది కూడా తెలుసుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన వార్తా పత్రికలలో ఈ ఉదంతమే పతాక శీర్షికగా వచ్చింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి చెందిన రోత మీడియాలో మాత్రం ఈ వార్త ఫస్ట్‌ పేజీలో అప్రధానంగా ప్రచురించారు. అవినీతి కేసులలో విచారణను ఎదుర్కొంటున్న జగన్‌రెడ్డికి నైతికత లేనందునే కాబోలు ఆయన రోత మీడియా ఈ వార్తను విస్మరించింది. తెలియదంటే సరిపోదు... Ignorance of law is not an excuse అని పలు సందర్భాలలో న్యాయ స్థానాలు తీర్పులు ఇచ్చాయి. తెలంగాణలో బెట్టింగ్‌ యాప్‌ల తరఫున ప్రచారం చేసిన సినీ ప్రముఖులలో కొందరు, తమకు అలా ప్రచారం చేయడం తప్పని తెలియదన్నారు. న్యాయ సమీక్షలో ఈ వాదన నిలబడదు. చట్టాల గురించి తెలుసుకోవలసిన బాధ్యత ప్రజల మీదే ఉంటుందని మన చట్టాలు చెబుతున్నాయి. ప్రకాశ్‌రాజ్‌ వంటి వారు మాత్రం బెట్టింగ్‌ యాప్‌ల కోసం ప్రచారం చేయడం తప్పు అని తెలియగానే తాను ఆపేశానని హుందాగా చెప్పారు. నిజానికి మన దేశంలో ఏమి చట్టాలు ఉన్నాయి? ఎన్ని చట్టాలు ఉన్నాయి? అన్న విషయం ఎంతమందికి తెలుసు? కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వారిలో ఎంత మందికి అమలులో ఉన్న చట్టాల గురించి తెలుసు? ఇందుకు కారణం లేకపోలేదు. ఆయా ప్రభుత్వాలు చట్టాలు చేసుకుంటూ పోతున్నాయి. వాటి గురించి ప్రజలకు కనీస అవగాహన కల్పించడం లేదు. అంతెందుకు! సదరు చట్టాలను ఆమోదిస్తున్న చట్టసభల్లోని సభ్యుల్లో ఎంత మందికి ఆ చట్టాల గురించి తెలుసు? ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి మనసులో అనుకుంటారు. వారు అనుకున్న దాన్ని చట్టాల రూపంలో అధికారులు బిల్లుగా రూపొందిస్తారు. సదరు బిల్లులను సమగ్రంగా చర్చించకుండానే అధికార పార్టీ సభ్యులు వాటిని ఆమోదిస్తారు. ఆ వెంటనే ఆయా చట్టాలు అమల్లోకి వస్తాయి. ప్రసార మాధ్యమాలలో కూడా వాటి గురించి వివరించరు. వివరంగా వార్తలు ప్రచురించినా పాఠకులకు ఆసక్తి ఉండదు. చట్టాలు చేసిన వారికి కూడా అందులో ఏముందో తెలియదు. చట్టసభ సభ్యులకే తాము ఆమోదించిన చట్టాల గురించి తెలియని నేపథ్యంలో... ‘చట్టాల గురించి తెలియనంత మాత్రాన నేరం నుంచి తప్పించుకోలేరు’ అని అనడం కించిత్‌ ఆశ్చర్యంగా ఉంది. మన దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నాయని అడిగితే ఒక్కరైనా కరెక్టుగా చెప్పగలరా? కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెట్టింగ్‌ యాప్‌లను, జూదాన్ని పోలిన గేమ్‌లను నిషేధిస్తూ గేమింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చారు.


ఆ తర్వాత యథావిధిగా అందరూ ఆ చట్టాన్ని మరచిపోయారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గేమింగ్‌ యాప్‌ల కోసం సినీ ప్రముఖులు ప్రచారం చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు అప్పుడు పట్టించుకోలేదు. దీంతో అది నేరమే కాదనుకొని ప్రముఖ హీరోలు కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు హఠాత్తుగా అధికారులు మేల్కొన్నారు. హెల్మెట్‌ ధారణ విషయమే తీసుకుందాం. న్యాయస్థానాలు ఆదేశించినప్పుడు లేదా ట్రాఫిక్‌ అధికారులకు గుర్తొచ్చినప్పుడు మాత్రమే హెల్మెట్‌ ధారణ రూల్‌ అమలు చేస్తున్నారు. వాహనాలలో కూర్చున్నవారు బయటకు కనిపించకుండా కార్లలో బ్లాక్‌ ఫిల్మ్‌ అంటించడం కూడా నిషేధించారు. అయినా సుప్రీంకోర్టు స్పందించే వరకు ఈ రూల్‌ అమలు కాలేదు. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో! చట్టాలు చేసిన ప్రభుత్వాలకు వాటికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత లేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చట్టాలు చేశారు, ఏమేమి చట్టాలు చేశారు అని మాజీ ముఖ్యమంత్రులను అడిగితే చెప్పే పరిస్థితి ఉందా? చట్టం గురించి చెప్పాల్సిందెవరు? భారతదేశం వంటి అధిక జనాభా ఉన్న దేశాలలో ఎడా పెడా చట్టాలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అమలు చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడే చట్టాలను చేయాలి. అలా జరిగితేనే ప్రజల్లో అవగాహన ఏర్పడుతుంది. ఏదైనా జరిగినప్పుడు ప్రజలను సంతృప్తిపరిచేందుకు చట్టాలు చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. గేమింగ్‌ యాప్‌ల విషయంలో పోలీసులు ఇప్పుడు కేసులు నమోదు చేసి సినిమా వాళ్లను పిలుస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇది ప్రధాన వార్తగా మారింది. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రచారం చేసిన వారిపై పోలీసులు అప్పుడే ఎందుకు కేసులు పెట్టలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు హడావిడి చేస్తున్నారు? చట్టాలను అమలు చేయని అధికారులపై కూడా చర్యలు ఉండాలి కదా? చట్టాలంటే ప్రజల్లో భయం ఉండాలి. చట్టాలను ఉల్లంఘిస్తే శిక్ష పడుతుందన్న భయం ఉండాలి. అలా కాకుండా గిట్టని వారిని ఇబ్బంది పెట్టేందుకు... మూలన పడి ఉన్న చట్టాలను దుమ్ము దులిపి అమలు చేయాలనుకోవడం వల్లనే తంటా అంతా. ఈ కారణంగానే ప్రజల్లో చట్టాలపట్ల భయం, గౌరవం లేకుండా పోయింది. పలుకుబడి ఉంటే చట్టాలు చుట్టాలుగా మారిపోతున్నాయి. ప్రజలు కూడా చట్టాల పట్ల అవగాహన ఏర్పరుచుకోవాలి. లేని పక్షంలో తమను ఇబ్బందులపాలు చేయడానికి సదరు చట్టాలను దుర్వినియోగం చేస్తారని గ్రహించాలి.


ఉదాహరణకు ఇటీవల విడుదలైన ‘కోర్టు’ అనే సినిమాలో చట్టాల గురించి తెలియకపోతే వాటిని ఎంతలా దుర్వినియోగం చేస్తారో చక్కగా వివరించారు. పోక్సో చట్టం గురించి ఈ సినిమాలో చక్కగా చెప్పారు. సదుద్దేశంతో చేసిన చట్టాలను కక్ష సాధింపులకు వాడుకుంటున్నారు. వైవాహిక జీవితంలో మహిళలకు రక్షణ కల్పించడం కోసం రూపొందించిన చట్టంలోని 498ఏ సెక్షన్‌ను విస్తృతంగా దుర్వినియోగం చేస్తున్నారని వింటున్నాం, చూస్తున్నాం. చిన్న పిల్లలను లైంగికంగా వేధించే వారిని కఠినంగా శిక్షించడానికి రూపొందించిన పోక్సో చట్టాన్ని అడ్డుపెట్టుకొని పద్దెనిమిదేళ్లు నిండటానికి కొద్ది రోజులే మిగిలి ఉన్న యువతిని ప్రేమించిన పాపానికి ఒక యువకుడిని కేసు పెట్టి వేధించిన తీరును ‘కోర్టు’ చిత్రంలో చక్కగా చూపించారు. పసి పిల్లలను కూడా వదలకుండా లైంగికంగా వేధిస్తున్న కేసులు వెలుగుచూడటంతో పోక్సో చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం ప్రకారం పద్దెనిమిదేళ్లు నిండని యువతిని ప్రేమించడం నేరం అన్నట్టుగా ‘కోర్టు’ చిత్రంలో ఒక యువకుడిపై కేసు పెట్టి చిత్రహింసలు పెడతారు. పోక్సో చట్టం ప్రకారం బెయిల్‌ కూడా లభించదు. ఇలాంటి చట్టాల విషయంలో అయినా ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా? చట్టసభలలో సంఖ్యా బలంతో చట్టాలు చేశాం, వాటి గురించి మీరే తెలుసుకోండి అని ప్రభుత్వాలు చెప్పడం ఎంత వరకు సమంజసం? మన దేశంలో ఇంకా నిరక్షరాస్యత ఉంది. కొండ కోనల్లో జీవిస్తున్న గిరిపుత్రులకు నాగరిక ప్రపంచంతో సంబంధాలు ఉండటం లేదు. అలాంటి వారు చట్టాల గురించి ఎలా తెలుసుకుంటారు? ఈ కారణంగా Ignorance of law is not an excuse అని మరో చట్టంలో ఉన్న విషయం చెప్పి శిక్షిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నిజంగా నగదు లభించి ఉంటే Ignorance of law అని చెప్పలేరు కదా? ఆయన నేరానికి శిక్ష పడాల్సిందే!

ఆర్కే

Updated Date - Mar 23 , 2025 | 06:06 AM