Share News

Daripelli Ramayya: జనారణ్యం మధ్య వనజీవి

ABN , Publish Date - Apr 22 , 2025 | 05:11 AM

దరిపెల్లి రామయ్య, 50 సంవత్సరాల పాటు పర్యావరణ పరిరక్షణలో నిష్కలంకంగా పనిచేసినవారు. ఆయన మొక్కల పెంపకం, పర్యావరణ స్థితి సుస్థిరంగా ఉండాలనే విశ్వాసంతో చేసిన కృషి ఎంతో ప్రేరణదాయకంగా నిలిచింది

Daripelli Ramayya: జనారణ్యం మధ్య వనజీవి

డిచే చెట్టులా కనిపించేవాడు దరిపెల్లి రామయ్య. పాతబడిన స్కూటీకి ఇరువైపులా విత్తన గింజల సంచులు, నీళ్లు నింపుకున్న ప్లాస్టిక్‌ బాటిళ్లూ తగిలించుకొని ఊళ్ల దారుల్లో ఆయన ముందుకు సాగుతూ ఉంటే, హరిత వనమేదో జవజీవాలతో కదులుతున్నట్టు అనిపించేది. అడవుల పరిరక్షణ, మొక్కల పెంపకం కేవలం ప్రభుత్వాల బాధ్యతే అనేలా పరిస్థితులు మారిన తరుణంలో– రామయ్య విలక్షణమైన వ్యక్తిలా కనిపించేవాడు. ఎవరేమనుకున్నా ‘నా దారి పర్యావరణ దారి’ అనే నైజాన్ని ఒంటబట్టించుకొని రామయ్య జీవిత పర్యంతం ఒంటరిపోరు చేశాడు. ఖమ్మంలో, ఆ మాటకొస్తే తెలుగునాట హరితస్పృహను రగిలించడంలో రామయ్యది ప్రత్యేకమైన స్థానం. చివరి శ్వాస వరకూ రామయ్య వన రుషిగా బతికాడు. 79 ఏళ్ల వయస్సులో నిద్రలోనే తనువు చాలించాడు. ఆయనది సార్థక జీవితం. ఆనాడు రామయ్య అజ్ఞాతవాసంలో కీకారణ్యంలో వనజీవిగా సంచరిస్తే ఈ రామయ్య జనారణ్యంలో మొక్కవోని దీక్షతో అభినవ వనజీవిగా సంచరించాడు. తరిగిపోతున్న అడవులతో పర్యావరణపరంగా విపరిణామాలు తలెత్తుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా అన్ని దేశాలకు చెట్ల పెంపకం ఒక ఎజెండాగా మారిపోయింది. పాలకులు వ్యవస్థాగతంగా చేపట్టిన ‘హరితహారం’, ‘వనమహోత్సవం’ కంటే ఈ కార్యాచరణను యాబై ఏళ్ల క్రితమే దరిపెల్లి రామయ్య ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఒంటరిగా చేపట్టడం గొప్ప ఆదర్శంగా గోచరిస్తుంది. కుమ్మరి సామాజికవర్గానికి చెందిన రామయ్య తల్లిదండ్రులు లాలయ్య–పుల్లమ్మ కులవృత్తిని నమ్ముకొని బతికేవారు. బతుకుదెరువు కోసం వారు ఖమ్మం రూరల్‌ మండలంలోని ముత్తగూడెం నుంచి ఖమ్మం పట్టణ శివారులోని రెడ్డిపల్లికి వలస వచ్చారు. అక్కడే సర్కారు పాఠశాలలో రామయ్య చేరాడు.


ఐదో తరగతిలో మల్లేశం అనే ఉపాధ్యాయుడు చెట్లను నాటడం, వాటిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో బోధించాడు. ఆ మాటలు రామయ్యపై ఎంతో ప్రభావం చూపాయి. అప్పటి నుంచి మొక్కలు నాటడంపై రామయ్య మక్కువ పెంచుకున్నాడు. తొమ్మిదేళ్ల వయస్సులో ఆయనకు జానమ్మతో వివాహమైంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆయనలో వనస్పృహ పెరుగుతూ వచ్చింది. జానమ్మతో వివాహమైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా దానిని విడిచిపెట్టలేకపోయాడు. బతకడమే గగనమైన రోజులవి. పని చేస్తేనే పూట గడిచే కుటుంబం వారిది. బతుకుతెరువుకు ఒకవైపు వ్యవసాయం చేస్తూ, ఊరూరా పాలు అమ్ముతూ ప్రవృత్తిగా వనయజ్ఞాన్ని చేపట్టాడు. ఆ తర్వాత అదే తన జీవితమైంది. రూపాయి ఖర్చు లేకుండా ప్రకృతి ఆలంబనగా రామయ్య సాగించిన వనయజ్ఞం అబ్బురపరుస్తుంది. తొలిదశలో కేవలం మొక్కలను సేకరించి, నాటడం చేస్తే, ఆ తర్వాత వేసవిలో చెట్ల కాయలను, విత్తన గింజలను సేకరించి, వానా కాలంలో ఖాళీ స్థలాల్లో చల్లడం, రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలను నాటడం పనిగా పెట్టుకున్నాడు. రూపాయి రాబడి లేకున్నా మల్లేశం సారు చెప్పిన మాటలు ఆయనలో మొక్కవోని దీక్షను కలిగించాయి. ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్ల వెంట, పుట్టల వెంట రామయ్య విత్తనగింజల కోసం రోజంతా తిరుగుతుండేవాడు. తిరిగి వానాకాలంలో ఒక్కడే ఖాళీ స్థలాల్లో చల్లుతూ ఉండేవాడు.


సైకిలే ఆయన వాహనం. ఆయన వెనుక ఎవరూ లేరు. ఆయన వెంట ఎలాంటి బృందమూ లేదు. ‘‘నేను ఒక్కడినే గింజలు ఏరుతున్నప్పుడు, వాటిని విత్తుతున్నప్పుడు అందరూ నన్ను పిచ్చోడు అనుకునేవారు. నేను వారి మాటల్ని పట్టించుకునేవాడిని కాదు. వర్షాలు కురవాలంటే, పవనాలు రావాలంటే చెట్లు ఒక్కటే శరణ్యం. అందువల్ల పచ్చని చెట్లే నాకు లోకంలా మారాయి,’’ అని ఓ సందర్భంలో తన మనోగతాన్ని వెల్లడించాడు. రామయ్య మొక్కవోని దీక్షకు ఆయన భార్య జానమ్మ కూడా అనివార్యంగా వెన్నంటి నిలిచింది. దీంతో ఆయన ‘ఎకో’పాసన నిర్విఘ్నంగా ముందుకుసాగింది. కుటుంబ బాధ్యతలు, నలుగురు పిల్లల పోషణ, పెళ్లిళ్లు అన్నింటిలో జానమ్మ ముఖ్యపాత్ర వహించింది. జానమ్మ లేకుంటే రామయ్య వనయజ్ఞం అంత సాఫీగా ముందుకు సాగేది కాదు. రామయ్య చెట్టులాంటి వాడైతే, జానమ్మను వేరుగా భావించాల్సి ఉంటుంది. రామయ్యతో ఏడు దశాబ్దాల పాటు జీవనయానం సాగించిన జానమ్మ ఇప్పుడు జీ‘వనదారుల్లో’ ఒంటరిగా మిగిలిపోయింది, రామయ్య తన జీవితంలో దాదాపు 50 ఏళ్లు వన యజ్ఞాన్ని ఉధృతంగా సాగించాడు. ఆయన చేతి చలువ వల్ల కోటికి పైగా మొక్కలు పెరిగాయని చెబుతారు. రామయ్య ఆచరించిన వనయజ్ఞం మొక్కలకు సంబంధించి అపార జ్ఞానాన్ని తెచ్చిపెట్టింది.


ఆయన 250 రకాల మొక్కల పేర్లను, వాటి గుణగణాలను, ఉపయోగాలను ఏకరువు పెట్టేవాడు. వేప, సుబాబుల్‌, కానుగ, నిద్రగన్నేరు వంటి మొక్కలను ఆయన ఎక్కువగా నాటగా, చివరి దశలో ఎర్రచందనం, శ్రీచందనం వంటి మొక్కలను కూడా నాటాడు. భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు ఎర్రచందనం, శ్రీచందనం వంటి మొక్కలు ప్రభుత్వానికి ఆర్థిక బడ్జెట్‌లా ఉపయోగపడతాయని ఆయన నమ్మేవారు. ఒంటరిగా, నిస్వార్థంగా రామయ్య చేసిన కృషికి అంత సులభంగా గుర్తింపు దక్కలేదు. ఆయన పుట్టిన కులమో, ఆయన ఆహార్యమో, ఆయన చదువో... కారణమేదో తెలియదుగానీ, ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రోత్సాహం, అండ దక్కలేదు. పర్యావరణంపై ఆయన పెంచుకున్న అలవిమాలిన ప్రేమ ఆయనకున్న భూమిలో మూడెకరాలను హరించి వేయగా, పిల్లలకు ఉన్నతమైన చదువులను అందించలేక పోయింది. రామయ్య ముగ్గురు కుమారుల్లో ఇద్దరు అనారోగ్యంతో చనిపోయారు. వారసులు దిగువ మధ్యతరగతి జీవితాలను అనుభవిస్తున్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును బహుకరించిన తర్వాతే రామయ్యకు సమాజంలో గౌరవ మర్యాదలు దక్కాయి. ‘‘ఒకప్పుడు నన్ను చూసి ఎగతాళి చేసినవారు పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత నాకు నమస్కారం పెట్టడం మొదలుపెట్టారు’’ అని రామయ్య ఓ సందర్భంలో పేర్కొన్నాడు. రామయ్య ఆచరించిన మార్గాన్ని వారసులు అందిపుచ్చుకోలేదు గానీ, వారు తమ పిల్లలకు మాత్రం తాత స్ఫూర్తితో కబంద పుష్పం, చందన పుష్పం, వనశ్రీ, హరితారణ్య అనే పేర్లు పెట్టుకున్నారు.


రామయ్య కన్నుమూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రులు రేవంతరెడ్డి, చంద్రబాబు ఇంకా అనేకమంది ప్రముఖులు సంతాపాలు తెలిపారు. పర్యావరణ సుస్థిరతకు రామయ్య చేసిన కృషి ఎంతో విలువైనదని కొనియాడారు. ప్రభుత్వాలు వ్యవస్థాపరంగా చేయలేని కార్యాన్ని రామయ్య విజయవంతంగా చేసి చూపించాడు. అర్బన్‌, సెమీ అర్బన్‌ జీవన విధానం పెరుగుతున్న నేటి జమానాలో సహజ వనాలు మాయమై, కాంక్రీట్‌ వనాలు విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రామయ్య వేసిన దారిలో నడిచేవారు ఈ సమాజానికి ఎంతో ముఖ్యం. కంచ గచ్చిబౌలిలో పాలకులే వందలాది ఎకరాల్లో వృక్షవిధ్వంసానికి తెగించి పర్యావరణ స్ఫూర్తికి గండికొట్టారు. ఇప్పటికైతే ఈ గండం గట్టెక్కింది గానీ, భవిష్యత్తులో అక్కడ అడవి ఉంటుందో మాయమవుతుందో ఎవరూ చెప్పలేరు. అందువల్ల అడవుల హననానికి, వృక్ష విధ్వంసానికి విరుగుడుగా ప్రత్యామ్నాయ ప్రక్రియ ఒకటి ఎప్పుడూ కొనసాగుతూ ఉండాలి. అప్పుడే ప్రకృతి సమతౌల్యం సాధ్యం. ఆ ప్రత్యామ్నాయానికి రామయ్య ఆచరించిన యజ్ఞమే ఎప్పటికీ స్ఫూర్తి. ఆయన తాను బతికినన్నాళ్లూ ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే నినాదం గల బోర్డును మెడలో ధరించి జనంలో తిరిగేవారు. ఆయన ప్రదర్శించిన ఆ నినాదమే ఈ సమాజానికి ఎప్పటికీ ప్రాణవాయువు.

శంకర్‌రావు శెంకేసి సీనియర్‌ జర్నలిస్ట్‌

Updated Date - Apr 22 , 2025 | 05:14 AM