Share News

Sudan Crisis: సూడాన్‌ సంక్షోభం

ABN , Publish Date - Apr 18 , 2025 | 03:25 AM

సూడాన్‌ దేశం అనేక సంక్షోభాలు, రాజకీయ విభేదాలు, అంతర్యుద్ధాలతో పోరాడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా మానవతా సహాయాన్ని అంగీకరించని పరిస్థితుల్లో సూడాన్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

Sudan Crisis: సూడాన్‌ సంక్షోభం

రబ్‌ రాచరిక ప్రభుత్వాల స్వార్థం, అగ్రరాజ్య అధినేత నిర్దయ, దేశీయుల మధ్య కత్తి వైరం కారణంగా ఎడతెగని సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్రికా దేశం సూడాన్‌. గాజా, ఉక్రెయిన్‌ యుద్ధాలతో తల్లడిల్లుతున్న అంతర్జాతీయ సమాజం ఈ ఆఫ్రికన్‌ అభాగ్యుల దుస్థితిని పూర్తిగా ఉపేక్షించడం నేటి ప్రపంచ విస్మయకర, విషాద పోకడకు ఒక తార్కాణం. 19వ శతాబ్దంలో ఒట్టోమన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఆవిర్భవించి, ఇరవయో శతాబ్ది ప్రథమార్ధంలో ఆంగ్లో–ఈజిప్షియన్‌ ఉమ్మడి పాలనలో ఉండి, 1956లో వలసపాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన సూడాన్‌ తన 69 ఏళ్ల అస్తిత్వంలో, మరే ఆఫ్రికన్‌ దేశం కంటే ఎక్కువసార్లు తిరుగుబాట్లను చవిచూసింది. 2019లో సంభవించిన తిరుగుబాటులో 1989 నుంచి నిరంకుశ పాలన చేసిన ఒమర్‌ అల్‌ బషీర్‌ పదవీ భ్రష్టుడయ్యాడు. ఆయన స్థానంలో అధికారంలోకి వచ్చిన పౌర–సైనిక ప్రభుత్వం సుస్థిర ప్రజాస్వామిక పాలననందిస్తామని హామీ ఇచ్చింది. అయితే జనరల్‌ అబ్దేల్‌ ఫత్తా బుర్హన్‌ తన సహచర పౌర పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఇందుకు అతడికి సహకరించిన వ్యక్తి హెమెడ్తీగా ప్రసిద్ధుడైన పారామిలిటరీ దళం ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ అధిపతి మొహమద్ హమ్దాన్‌ డగాలో. అయితే ఆ తరువాత ఇరువురి మధ్య అధికారం కోసం ప్రారంభమైన పెనుగులాట ఫలితమే 2023 నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధం, తత్పర్యవసాన మానవతా సంక్షోభం. ఆఫ్రికాలో చమురు ఉత్పత్తి దేశాలలో సూడాన్‌ అగ్రగామిగా ఉండేది. చమురు విక్రయాలతో అపారంగా సమకూరిన ధన రాశులతో కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు బషీర్‌ పూనుకున్నాడు.


అందులో భాగంగా పదివేల కోట్ల డాలర్ల వ్యయంతో నైలునదిపై డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపట్టాడు. ఆ కార్యక్రమం పూర్తయ్యేలోపే దక్షిణ సూడాన్ ప్రజలు తిరుగుబాటు చేసి స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చమురు నిక్షేపాలు ఉన్న ప్రాంతాలన్నీ దక్షిణ సూడాన్‌వే కావడంతో కొత్త ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణ ప్రయత్నాలకు తీరని విఘాతం కలిగింది. చమురు ఆదాయం లేకపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. అఫ్రికాలో మరే దేశంలో కంటే అధికంగా ఉన్న బంగారు గనులకు నెలవు అయిన పశ్చిమ సూడాన్‌లో తనతో విభేదించిన తెగలను అణచివేసేందుకు ప్రైవేట్‌ మిలీషియాలను బషీర్‌ సృష్టించాడు. అటువంటి ఒక ప్రైవేట్‌ సైన్యం నుంచి ప్రభవించిందే ప్రస్తుతం హెమెడ్తీ నాయకత్వంలోని ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌. బంగారు గనులు ఉన్న పశ్చిమ సూడాన్‌లో హెమెడ్తీదే రాజ్యం. తన పారా మిలిటరీ దళాన్ని జనరల్‌ బుర్హాన్‌ నేతృత్వంలోని సైన్యంలో విలీనం చేసేందుకు తిరస్కరిస్తూ వచ్చిన హెమెడ్తీ గత మంగళవారం నాడు తన నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ పీస్‌ అండ్‌ యూనిటీ’ని ఏర్పాటు చేశాడు. పక్షం రోజుల క్రితం తన పారా మిలిటరీ అధీనంలో ఉన్న దేశ రాజధాని ఖార్టూమ్‌ను జనరల్‌ బుర్హాన్ సైన్యానికి కోల్పోయాడు. అయినప్పటికీ తమ ప్రభుత్వమే సూడాన్‌ ప్రజల నిజమైన ప్రతినిధి అంటున్న హమెడ్తీ బుర్హాన్‌తో రాజీకి ససేమిరా అంటున్నాడు. రెండు సంవత్సరాలుగా ఈ ఇరువురి సైన్యాల మధ్య సూడాన్‌ కకావికలమై పోయింది.


తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాచరిక ప్రభువులు ఈ ప్రత్యర్థులలో చెరొకరి కొమ్ముకాస్తూ అంతర్యుద్ధ పరిస్థితిని మరింత విషమింపచేస్తున్నారు. అంతర్యుద్ధంతో నెలకొన్న విపత్కర పరిస్థితులు ‘ప్రపంచంలోని అత్యంత భయంకరమైన ఆకలి సంక్షోభం’ అని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. మూడు కోట్ల మందికి పైగా సూడానీలు మానవతా పూర్వక సహాయంపై ఆధారపడి ఉన్నారు. లక్షలాది కుటుంబాలు సర్వం కోల్పోయాయి. అనేక లక్షల మంది ఇరుగు పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. హెమెడ్తీ నేతృత్వంలోని పారామిలిటరీ దళాలు పాల్పడిన అకృత్యాలు యుద్ధనేరాలే అని పరిశీలకులు ఘంటాపథంగా చెబుతున్నారు. ప్రపంచ ప్రజలకు మానవతాపూరిత సహాయాన్ని సమకూర్చే ‘యుఎస్‌ ఎయిడ్‌’ కార్యకలాపాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ పూర్తిగా నిలిపివేయడంతో సూడాన్‌లో సహాయ చర్యలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో సూడాన్‌ ప్రజల అవస్థలు మాటల్లో చెప్పలేని విధంగా మిక్కుటమయ్యాయి. అమెరికా నిర్దాక్షిణ్య నిర్ణయం సూడాన్‌ ప్రజలను వారి కర్మకు వదిలివేయడమే అయింది. అభివృద్ధికి తోడ్పడే కీలక సహజ వనరులు ఉన్నప్పటికీ సూడాన్ రాజకీయంగా, ఆర్థికంగా పథభ్రష్టమవడం ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్య పద్ధతులు, సమాజంలో ప్రజాస్వామిక నైతికత అవసరమనే సత్యాన్ని ఎత్తి చూపుతోంది. కడుపు తరుక్కుపోయే కన్నీళ్ల విషాద గాథలు కళ్ల ముందుకు వచ్చినప్పుడు ఆ అభాగ్యగతులకు కనీస సానుభూతి, సహానుభూతి చూపడం విశాల ప్రపంచ విధ్యుక్త ధర్మం.

Updated Date - Apr 18 , 2025 | 03:28 AM