Environmental Education: పర్యావరణ విద్యను నవీకరించాలి
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:55 AM
భారతదేశం 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలని లక్ష్యమిద్దుకుని, పర్యావరణ విద్యను ఆధునీకరించే అవసరం ఉంది. పాత పాఠ్యాంశాలు విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించడంలో విఫలమవుతున్నాయి
ప్రపంచం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ), కార్బన్ ట్రేడింగ్, గ్రీన్ ఎనర్జీ, క్లైమేట్ టెక్నాలజీస్ వంటి వినూత్న మార్గాల్లో దూసుకుపోతోంది. భారత్ 2030 నాటికి ఎస్‌డీజీలను చేరాలన్న లక్ష్యంతో పాటు, 2045 కల్లా కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించడం, 2070 నాటికి నెట్–జీరో దేశంగా మారడం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, మన విద్యా విధానం పర్యావరణాన్ని ఇంకా ప్రాథమిక స్థాయిలో మాత్రమే విద్యార్థులకు బోధిస్తోంది. పాఠ్యాంశాలు పాతవి, దృష్టి కోణం మరీ పాతది! పర్యావరణ విద్య అంటే ‘కాలుష్యం, మొక్కలు నాటడం, అటవీ సంరక్షణ’ అనుకునే స్థాయికే విద్యార్థులు పరిమితం అవుతున్నారు. ఫలితంగా వారు, పర్యావరణ శాస్త్రాన్ని విలువలేని విషయంగా, తక్కువగా చూస్తున్నారు. కార్బన్ క్రెడిట్స్, ఈఎస్‌జీ ఫ్రేమ్‌వర్క్‌లు, సస్టైనబిలిటీ వంటి కీలక అంశాలు తెలియనప్పుడు– రేపటి గ్రీన్ ఎకానమీ అవకాశాల్లో వారు ఎలా పోటీపడగలరు? మన ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోని పర్యావరణ విభాగాలు కూడా దశాబ్దాల కిందటి పాఠ్యాంశాలకే పరిమితమయ్యాయి! అంటే సిలబస్‌ను నవీకరించకుండా, విద్యార్థుల భవిష్యత్తును పాతబడిన విద్యతోనే మనం నిర్దేశిస్తున్నామన్న మాట. అందుకే పాఠ్యప్రణాళికలోని ‘పర్యావరణ విద్య’ సిలబస్‌ను ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. మార్పు ఒక అవసరం కాదు– అది మన భవిష్యత్తును నిలబెట్టే అద్భుత సాధనం. పర్యావరణాన్ని ఒక సబ్జెక్ట్‌గా చూడటం ఆపాలి– దాన్ని ఒక సమిష్టి బాధ్యతగా, ఒక జీవన దిశగా స్వీకరించాలి.
– డా. పేటేటి శేషబాల