Sheela Veerraju: అక్షరాలూ రంగుల సవ్యసాచి
ABN , Publish Date - Apr 22 , 2025 | 05:05 AM
శీలా వీర్రాజు సాహిత్యం మరియు చిత్రకళలో చేసిన విభిన్న కృషితో తెలుగు కళా, సాహిత్యరంగాల్లో గుర్తింపు పొందారు. ఆయన యొక్క వాటర్ కలర్స్, ఆయిల్ పెయింట్స్, మరియు ఇతర చిత్రాలు నాటి సంస్కృతిని ప్రతిబింబించాయి
మన సాహిత్యంలో నవల, కథ, కవిత, గేయం, నాటకం, పద్యం వంటి ప్రక్రియలు ఉన్నట్లే, చిత్రకళలో కూడా వాటర్ కలర్స్, ఆయిల్ పెయింట్స్, చార్‌కోల్, కలర్ పెన్సిల్, పేస్టల్స్, కత్తిరింపుల కళ, పేపర్ ఆర్ట్, మ్యూరల్స్ వంటి పలు రకాల ప్రక్రియలు ఉన్నాయి. శీలా వీర్రాజు అటు సాహిత్యంలోనూ, ఇటు చిత్రకళా రంగంలోనూ సమకృషి చేసి రెండు రంగాల వారిని మెప్పించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు కళారంగాల్లో కృషి కొనసాగించినవారు అరుదు. రాంభట్ల కృష్ణమూర్తి, అడవి బాపిరాజు, చలసాని ప్రసాదరావు, సంజీవదేవ్, వేలూరి రాధాకృష్ణ, తలిశెట్టి రామారావు, పిలకా లక్ష్మీనరసింహమూర్తి, అంట్యాకుల పైడిరాజు, రాజాజీ, జింకా రామారావు, ఆకురాతి రామకృష్ణ, ఇనపకుర్తి చిన సత్యనారాయణ, బాలి, ఎస్వీ రామారావు, వడ్డాది పాపయ్య, అబ్బూరి గోపాలకృష్ణ, బి.ధర్మారావు, బాలగోపాల భాస్కరరాజు, చేమకూర సత్యనారాయణ, ద్వివేదుల సోమనాథశాస్త్రి, యీడూరి రామచంద్ర రావు, కొండిపర్తి శేషగిరిరావు, మాధవపెద్ది గోఖలే, మారేమండ శ్రీనివాసరావు, పల్లా పర్సినాయుడు, తాడి మోహన్, తిప్పాసి వెంకటరావు, ఉండ్రు ఆశీర్వాదం తదితరులు సాహిత్య, చిత్రకళా రంగాల్లో కృషిచేసి రెండు రంగాల్లోనూ గుర్తింపు పొందారు. శీలా వీర్రాజు చిత్రకళలో ముఖ్య విభాగాలు స్కెచ్‌లు, వాటర్ కలర్స్, ఆయిల్ పెయింట్స్.
ఒక్క మాటలో చెప్పాలంటే కార్టూన్లు తప్ప మిగిలిన అన్ని విభాగాల్లోనూ ఆయన సాధన చేశారు. వందలాది కథలు, నవలలు చదివి అందులో రచయిత/ రచయిత్రి చెప్పిన ముఖ్య విషయాన్ని వీర్రాజు రేఖల్లో చెప్పేవారు. బాపు తర్వాత ఎక్కువమంది నాటి రచయితలు తమ గ్రంథాలకు చిత్రాలు, వీర్రాజు గారిచే వేయించుకోవాలని ఆరాటపడేవారంటే ఆయన చిత్ర ప్రతిభ ఊహించవచ్చు. ఆయన వెయ్యికి పైగా గ్రంథాలకు ముఖచిత్రాలు చిత్రించారు. అవన్నీ కూడా ఒక గ్రంథంగా త్వరలో రానున్నాయి. సుప్రసిద్ధ దర్శనీయ స్థలాలైన లేపాక్షి, భువనేశ్వర్, కోణార్క్, ఎల్లోరా, పాకాల, అమరావతి, ఉండవల్లి, పానగల్లు, ఆంధ్ర మహావిష్ణు ఆలయం, శ్రీకాకుళం, వరంగల్లు, హనుమకొండ, శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవాలయం, గోల్కొండ కోట, బిర్లా వెంకటేశ్వరాలయం తదితరాల్ని ఇండియన్ ఇంక్ స్కెచ్లుగా గీసి, సజీవ శిల్పాలుగా మన ముందు వుంచారు. శిల్ప రేఖల్లో వేగం, జీవం మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. ఇంకా ఆయన తిరుపతి వేంకటకవులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కుందుర్తి, బుచ్చిబాబు వంటి తనకిష్టమైన రచయితల రూపచిత్రాల్ని రేఖల్లో చూపించారు. తొలితరం ఆంధ్ర చిత్రకారులైన దామెర్ల రామారావు సన్నిహితుడు వరదా వెంకటరత్నం శిష్యుడైన వీర్రాజుగారు వందలాది వాటర్, ఆయిల్ కలర్ చిత్రాలు వేశారు. కొందరి చిత్రాల్లా వీర్రాజుగారి చిత్రాలు చూసిన వెంటనే ఇది వాటర్ కలర్ అనీ, ఇది ఆయిల్ కలర్ అని చెప్పడం కష్టం.
ఆయన తన తైలవర్ణ చిత్రాల్ని సహజ సుందరంగా ఉండే రంగుల్లో చూపించగా, నీటిరంగుల చిత్రాలకు ప్రాథమిక వర్ణాలను అద్దారు. నాటి గ్రామీణుల పండుగలు, అలంకరణలు, సంస్కృతి, కట్టు, బొట్టు, నేపథ్యం... ఇవీ ఆయన ప్రధాన ఇతివృత్తాలు. నాటి సంస్కృతిని తన చిత్రాలతో కళ్ళకు కట్టారు. ‘చెరువు నుంచి’ చిత్రంలో ఎనిమిది మంది మహిళలు ఇత్తడి, రాగి, మట్టి కుండలతో నీళ్లు తెస్తున్న దృశ్యం నేటి సమాజంలో మనకు ఎక్కడా గోచరించదు. చిత్రకారుణి సూక్ష్మపరిశీలనకు నిలువెత్తు నిదర్శనం ఈ చిత్రం. ఇంకా వారు గీసిన– ‘మహాకవి పోతన’, ‘ఏటికెదురు’, ‘పళ్ళ మార్కెట్’, ‘కేశాలంకరణ’, ‘దీపావళి సంబరం’, ‘దంచడం’, ‘తిరగలి’, ‘సంత నుంచి’, ‘చలిమంట’, ‘మేదరుల జీవనం’, ‘చెమ్మచెక్క’, ‘హరిదాసు’, ‘మట్టి మనుషులు’, ‘కమ్మరి’, ‘క్షురకుడు’, ‘గొబ్బెమ్మ’... అత్యద్భుతమైన వర్ణ దృశ్యాలు, కావ్యాలు. వీర్రాజుగారితో నాకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, వారితో 2012 నుంచి ఒక దశాబ్దం పాటు పరోక్ష సంబంధం వుంది. హైదరాబాద్‌కు చెందిన సిపి బ్రౌన్ అకాడెమీ కోరికపై నేను ‘జాతిరత్నం: వడ్డాది పాపయ్య’ జీవితచరిత్ర వ్రాశాను. అకాడెమీవారు ఆ గ్రంథాన్ని పరిశీలన నిమిత్తం శీలా వీర్రాజుగారికి పంపారు.
ఆ గ్రంథాన్ని చదివి ఆయన చాలా విలువైన విషయాల్ని తెలిపారు. కొరకరాని కొయ్యగా పేరొందిన వపాతో స్నేహం చెయ్యడంతో పాటు, కొయ్యని కొరికిన అసాధ్యుడివి అని అభినందించారు. 2017 ఏప్రిల్ 28, 29 తేదీల్లో విశాఖ మ్యూజియంలో వీర్రాజుగారి వ్యక్తిగత చిత్రకళా ప్రదర్శన నిర్వహించి విశాఖ చిత్రకళాభిమానులకు ఆయన చిత్ర ప్రతిభను మా చిత్రకళా పరిషత్ ద్వారా పరిచయం చేశాం. వారి అనారోగ్య కారణంగా వారి పరోక్షంలో ఈ కళాప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో దాదాపు 30కి పైగా వాటర్, ఆయిల్ కలర్ చిత్రాలను ప్రదర్శించాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖలో అనువాదకుడిగా ఎన్నో ఒత్తిడులు ఎదుర్కొంటూ సాహిత్య, చిత్రకళా రంగాల్లో వీర్రాజుగారు తనదైన చెరగని ముద్ర వేశారు. పొగడ్తలకు, ప్రశంసలకు అవకాశం ఇవ్వకుండా తన కళా కృషిని మౌనంగా కొనసాగించిన వీర్రాజుగారి ప్రతిభను మన ప్రభుత్వం గుర్తించకపోయినా, సాహితీ, కళాభిమానులు వారి ప్రతిభను గుర్తించారు, ఉచిత రీతిన అనేక సంస్థలు గౌరవించాయి. రాజమహేంద్రవరంలో వీర్రాజుగారు చిత్రకళ అభ్యసించిన దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో దామెర్ల, వరదా, రాజాజీ వంటి ఉద్దండుల చిత్రాలతో పాటు వీర్రాజుగారి చిత్రకళా వర్ణ వైభవాన్ని మనం చూడవచ్చు.
- సుంకర చలపతిరావు (నేడు శీలా వీర్రాజు జయంతి)