Presidential Rule Petition: రాజ్యాంగ లక్ష్మణరేఖలు
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:50 AM
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో హింస చెలరేగిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన కోరిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారితీశాయి.
భారత ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న జస్టిస్ గవాయ్ సోమవారం ఒక పిటిషన్ విచారణ సందర్భంలో కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలుచేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో హింస చెలరేగిన నేపథ్యంలో, ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలు రాష్ట్రపతి నిర్వహణలోకి పోవాలని కోరుతున్న పిటిషన్ అది. ఆర్టికల్ 355 ప్రకారం నివేదిక తెప్పించుకోవలసిందిగా రాష్ట్రపతికి చెప్పండి అంటూ విష్ణుశంకర్ జైన్ అనే న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయోధ్య నుంచి జ్ఞానవాపివరకూ తన పిటిషన్లతో న్యాయస్థానాల్లో పలువిజయాలు సాధించిపెట్టిన ఈ సుప్రీంకోర్టు న్యాయవాది ఎంత సుప్రసిద్ధుడో తెలిసిందే. ఈ పిటిషన్ చూడగానే జస్టిస్ గవాయ్‌కు మన ఉపరాష్ట్రపతి కళ్ళలో మెదిలి ఉంటారు. మీరేమో రాష్ట్రపతికి చెప్పాలంటూ నేరుగా ఇలా ‘మాండమస్’ ఇవ్వమంటారు, మేము మరోపక్క పార్లమెంటరీ, కార్యనిర్వాహక విధుల్లో జోక్యం చేసుకుంటున్నామని మాటలు పడుతూంటాం అన్నది గవాయ్ వ్యాఖ్యల సారాంశం. రాష్ట్రపతికి చెప్పగలిగేంతవాళ్ళం కాదు అని సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించివుంటే ఆ రాష్ట్రానికి గతంలో గవర్నర్‌గా వ్యవహరించిన జగదీప్ ధంఖర్ సంతోషించేవారా? అన్నది కాంగ్రెస్ నాయకుల ప్రశ్న. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధించినందుకు సుప్రీంకోర్టును తప్పుబడుతూ ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు దేశప్రజల్లో సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. ఆయన తన హోదాకు తగనిరీతిలో మాట్లాడారని సామాన్యులకు సైతం అనిపించింది. వాళ్ళే శాసనకర్తలు, వాళ్ళే తీర్పరులు, వాళ్ళే కార్యనిర్వాహకులు, సమస్తం వాళ్ళే, ఇక్కడి చట్టాలు మాత్రం వాళ్ళకు వర్తించవు, ఎందుకంటే వీటిన్నింటికీ అతీతులు వారు అంటూ న్యాయమూర్తులను విమర్శించారు జగదీప్ ధంఖర్.
సుప్రీంకోర్టును ‘సూపర్ పార్లమెంట్’గా, ఆర్టికల్ 142ను దాని అమ్ములపొదిలో ఉన్న నూక్లియర్ మిసైల్‌గా అభివర్ణించడం ఆయన స్థాయికి తగినట్టుగా లేదు. న్యాయశాస్త్రం చదువుకున్న వ్యక్తి కనుక ఆయన తన అభిప్రాయాన్ని గౌరవప్రదంగా వెలిబుచ్చవచ్చు. అసమ్మతిని, విమర్శను నిర్మాణాత్మకంగా చేయవచ్చు. కానీ, ఆయన వాడిన భాషవల్ల ఇంకా ఆయనను పక్షపాతాలూ, విధేయతలు వీడలేదన్న భావన కలిగింది. విషయం పక్కకుపోయి, ఆయన రాజకీయ ప్రస్థానం, ఎదిగివచ్చిన క్రమం ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. మోదీ తెచ్చిన ఎన్‌జేఎసిని సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు ఎంపీలంతా చేష్టలుడిగి, చేతలుకట్టుకొని కూర్చున్నారంటూ ఈ మధ్యనే వారిని రెచ్చగొట్టేరీతిలో వ్యాఖ్యానించారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఉదంతం జరగ్గానే కొద్దిగంటల్లోనే బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులను ఇంటికి పిలిపించుకొని మరీ ఎన్‌జేఎసిమీద చర్చించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయన వర్మ ఉదంతాన్ని ఆయుధంగావాడి మరీ అక్కసు తీర్చుకున్నారు. వక్ఫ్ చట్టంలోని కొన్ని వివాదాస్పద అంశాలమీద సుప్రీంకోర్టు స్టే విధించే అవకాశాలు కనిపిస్తున్నందువల్లే అధికారపక్షం నుంచి సుప్రీంకోర్టు మీద పై స్థాయిలో ఎదురుదాడి జరుగుతోందని విపక్ష నేతల ఆరోపణ. గవర్నర్లు సరే, రాష్ట్రపతికి గడువు విధించడం సరికాదని ఉపరాష్ట్రపతి అభ్యంతరం. విపక్షపాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు ఏమీ తేల్చకుండా బిల్లులను నిరవధికంగా తొక్కిపెడుతున్నారు కనుక, అక్కడి ప్రభుత్వాలు సుప్రీంకోర్టును శరణుజొచ్చవలసి వస్తున్నది.
కోర్టు కూడా ఏళ్ళ తరబడి హితవులు చెప్పి, ఫలితం లేకపోవడంతోనే ఈ గడువులు విధించాల్సివచ్చింది. అసెంబ్లీ రెండోమారు ఆమోదించిన బిల్లులను సైతం తమిళనాడు గవర్నర్ అతితెలివిగా రాష్ట్రపతికి పంపితే, అక్కడ కూడా అవి కదలకుండా ఉండిపోతే ఏం చేయాలి? రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన గవర్నర్లు గాడితప్పినప్పుడల్లా రాష్ట్రపతి మందలిస్తూ ఉంటే, అసలు ఈ కేసులే ఉండవు. ఒక బిల్లు గవర్నర్ దగ్గర ఎంతకాలం ఉండాలి, రాష్ట్రపతికి ఏ దశలో నివేదించాలన్నది రాజ్యాంగం స్పష్టంగా చెప్పనికారణంగా దానిని ఒక రాజకీయఆయుధంగా వాడుకుంటున్నవారు, ఇప్పుడు కాలపరిమితి విధించినందుకు న్యాయవ్యవస్థమీద బురదజల్లుతున్నారు. రాజ్యాంగ మూలస్తంభాలు మూడు సమన్వయంతో, సహకారంతో, పరస్పర గౌరవంతో నడుచుకోవాలి. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య పరిమితులు, పరిధులకు సంబంధించి ఘర్షణ తలెత్తడం కొత్తేమీ కాదు. కానీ, వాటిని సరిదిద్ది, తిరిగిపట్టాలమీద ఉంచాల్సిన అత్యున్నత స్థాయి వ్యక్తులే చర్చకు కాక, రచ్చకు దారితీసేవిధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. ప్రతీ వ్యవస్థా లక్ష్మణరేఖదాటకుండా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది.