నేటి చాటువులు
ABN , Publish Date - Apr 17 , 2025 | 06:06 AM
అగ్ని సాక్షి గాను అవినీతి భూతమ్ము న్యాయమూర్తి యింట నాట్యమాడి దగ్ధమైన నోట్ల దరిచేరి నవ్వేను ఢిల్లి కోర్టు గుండె జల్లుమనగ...
అగ్ని సాక్షి గాను అవినీతి భూతమ్ము
న్యాయమూర్తి యింట నాట్యమాడి
దగ్ధమైన నోట్ల దరిచేరి నవ్వేను
ఢిల్లి కోర్టు గుండె జల్లుమనగ
ఉద్యమాల జాడ ఉస్మానియయెదపై
కఠినమైన ఆంక్ష కాలుదువ్వి
చెరిపివేసె నకట నిరసించు హక్కును
పోరుబాట గుండె భోరుమనియె
చిన్నగ ధనలక్ష్మి శిఖరమ్ము నెక్కించి
లోయలోకి నెట్టి వేయునపుడె
పీకమీద కత్తి ‘బెట్టింగు యాప’న్న
అదును చూసి జనుల హత్యజేయు
‘హెచ్చిసీయు’ లోన పచ్చని అడవమ్మ
భూము లెన్నొ లెస్స బుక్క నెంచి
చిదిమి వేయ జూసె జీవన శ్వాసను
నెమలి పిట్ట కూడ కుమిలి యేడ్చె
ద్రోహచింతనతొ మతోన్మాద తంత్రమ్ము,
వక్రశాసనమ్ము వక్ఫు బిల్లు
మందిబలము చూసి మనువాద కత్తితో
సంవిధాన స్ఫూర్తి చంపివేసె
రైలు, బస్సు, ఆటొ, రాస్తాలో నిరతమ్ము
కామసర్పవితతి కాటు వేయు
అత్యచార ఘటన అసలు జరుగనట్టి
స్థలములేనె లేదు ధరణి లోన
దగ్ధమయ్యె ప్రబల దండకారణ్యము
రాజ్యహింస అగ్ని రగిలి రగిలి
హత్య కాండ చూసి అమిత సంతోషము
మరణములు గుణించి మంత్రి మురిసె
– సంఘమిత్ర
ఈ వార్తలు కూడా చదవండి:
Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు.. తనను పెళ్లి చేసుకున్నాడంటూ..
MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..