Share News

పచ్చళ్ళమ్మాయి–పెట్టుబడిదారీ భాష!

ABN , Publish Date - Apr 17 , 2025 | 06:08 AM

‘‘ఇదే అదనుగా చోటామోటా వ్యాపారులంతా చెలరేగిపోతున్నారు. క్యూ వెంబడి రకరకాల వస్తువులు పట్టుకుని తిరుగుతున్నారు. కొనమని డిమాండ్‌ చేస్తున్నారు. కొననివాళ్లను తిడుతున్నారు....

పచ్చళ్ళమ్మాయి–పెట్టుబడిదారీ భాష!

‘‘ఇదే అదనుగా చోటామోటా వ్యాపారులంతా చెలరేగిపోతున్నారు. క్యూ వెంబడి రకరకాల వస్తువులు పట్టుకుని తిరుగుతున్నారు. కొనమని డిమాండ్‌ చేస్తున్నారు. కొననివాళ్లను తిడుతున్నారు. మరీ భీష్మించుకుంటే నిర్దాక్షిణ్యంగా క్యూలోంచి లాగిపడేస్తున్నారు. ఇంట్లోంచి బయటికొచ్చాక ఏదో ఒకటి కొనకుండా ఎలా ఉంటారండీ. అసలు అలాంటి వాళ్లు ఇంట్లోంచి బయటికి ఎందుకొచ్చారండీ’’ ఇవి నేను 2014లో రాసిన ‘ఒంటిచెయ్యి’ కథలోని మాటలు.

కొనుగోలు శక్తి లేనివారికి బయట తిరిగే అర్హత లేదనేది ఈ సన్నివేశంలో సారాంశం. మళ్లీ అలాంటి అంశమే నాకు అలేఖ్య చిట్టి పచ్చళ్ల వివాదంలో కనిపించింది. ధర ఎక్కువ అని ఒక కస్టమర్‌ అన్నందుకు ఆ పచ్చళ్లు అమ్మే అమ్మాయిల్లో ఒకామె ఓ ఆడియోలో అతణ్ణి దుర్భాషలాడింది. ‘నువ్వెందుకూ పనికిరావు.. తొందరపడి ప్రేమ, పెళ్లి వంటి వాటి జోలికి వెళ్లకు, ముష్టి పచ్చళ్లే కొనలేని నువ్వు రేపు పెళ్లానికి బంగారం ఏమి కొనిపెడతావు’ అంటూ అతణ్ణి దెప్పిపొడిచింది. ఆ ఆడియో వైరల్‌ అయిపోయింది. ఆడపిల్ల, పైగా పెళ్లి కాని యువతి అయ్యుండి, పవిత్ర భారత సమాజంలో ఇంతటి పచ్చిగా మాట్లాడుతావా... అంటూ అందరూ ఆ అమ్మాయిని ట్రోల్‌ చేశారు. ఆమె నడిపే వెబ్‌సైటును, యూట్యూబ్‌ చానల్‌ను రిపోర్టు కొట్టారు.


ఇక్కడ ఆమె వాడిన భాష కన్నా ఆ మాటల్లోని అంతరార్థమే ఎక్కువ ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ధర ఎక్కువ అని ప్రశ్నించిన వారికి ఆమె అనునయంగా నచ్చచెప్పే ప్రయత్నం చేయలేదు. ధర ఎందుకు ఎక్కువో వివరించే ప్రయత్నమూ చేయలేదు. అసలు ఆ ప్రశ్న అడగడమే తప్పు అన్నట్టు తిట్టింది. ఇంకోసారి ఇంకెవరైనా అలాంటి ప్రశ్న వేయడానికే భయపడిపోయి ఆత్మన్యూనతా భావానికి గురయ్యేలా ప్రవర్తించింది. సమాజంలో కొనుగోలు శక్తి లేని బక్క ప్రాణులకు తన పచ్చళ్లు తినే అర్హత లేదని తెలిసో తెలియకో ఆమె తేల్చేసింది.

నిజానికి ఈ పచ్చళ్ల అమ్మాయి మాట్లాడింది పెట్టుబడిదారీ సమాజపు భాష. మొన్న ఓ ఐస్‌క్రీం ప్రకటన చూశాను. దాని ధర మనం నిత్యం తినే సాధారణ ఐస్‌క్రీం కన్నా పది రెట్లు ఎక్కువ! పైగా బ్రాండెడ్‌. ప్రకటనలో ఒకమ్మాయి ఆ బ్రాండెడ్‌ ఐస్‌క్రీమ్‌ని కొనగానే ఉన్నట్టుండి సమాజం ఆమెను చూసే చూపు మారిపోతుంది. అప్పటిదాక సాధారణ స్త్రీలా ఉన్న ఆమె ఆ ఐస్‌క్రీమ్‌ కొన్న మరుక్షణమే మహారాణిలా కనిపిస్తుంది. పైగా ఇదే ప్రకటనలో సాధారణ ఐస్‌క్రీమ్‌ తింటున్న ఒకతను ఈ బ్రాండెడ్‌ ఐస్‌క్రీమ్‌ తింటున్న ఆమెను చూసి ఆత్మన్యూనతా భావానికి గురై సిగ్గుతో తన ఐస్‌క్రీమ్‌ని చేతులు వెనక్కి పెట్టుకుని దాచుకుంటాడు. ఈ బ్రాండెడ్‌ ఐస్‌క్రీమ్‌ ట్యాగ్‌లైన్‌ ఏంటో తెలుసా? ‘ఎంజాయ్‌ ద రాయల్‌ ట్రీట్‌మెంట్‌’.


పెట్టుబడిదారీ సమాజంలో ఎవరెంత ఖరీదైన వస్తువును కొంటే వారు అంత గొప్ప. అంతే తప్ప ‘దానికంత విలువ ఉందా? వస్తువేంటి? నాణ్యతేంటి?’ వంటి ప్రశ్నలకు, లాజిక్కులకు తావుండదు. అలాంటి ప్రశ్నలు వేసేవారిని ఈ పచ్చళ్లమ్మాయి ఈసడించుకున్నట్టే మార్కెట్‌ కూడా ఈసడించుకుంటుంది. ఒకరకంగా అలాంటి వారితో ఈ సమాజానికి ఎలాంటి ఉపయోగమూ లేదని తేల్చేస్తుంది. వారు బతికుండటం కన్నా చనిపోవడమే మేలు అనేలా ప్రవర్తిస్తుంది. ఎలాగోలాగ డబ్బు సంపాదించి పోటీలో నిలబడి, ఎంతకు పడితే అంతకు వస్తువులు కొని అనుభవించడం ఒకటే పరమార్థంగా బోధిస్తుంది. దానికోసం నువ్వు ఏ దారులు తొక్కినా ప్రోత్సహిస్తుంది. అంతిమంగా డబ్బే జీవితం అని చెబుతుంది. అలా అని ఆ అందని పండులో ఏదైనా ప్రత్యేకత ఉంటుందా అంటే... ఏమీ ఉండదు. కేవలం ప్రచారం ద్వారా దాని చుట్టూ అల్లిన ‘బ్రాండు’ అనే ఒక రూపరహితమైన మాయాపొర మాత్రమే ఉంటుంది. ‘ధర’ అనే ప్రశ్నే మన దగ్గర్నుంచి రాకుండా బ్రాండు పేరుతో ఏమీ లేని దానికి ప్రచారం కల్పించి, పోటీకి పెట్టి, ఊరించి కిమ్మనకుండా కొనేలా చేస్తుంది పెట్టుబడిదారి మార్కెట్‌. అది కొనలేకపోతే జీవితమే వృథా అనిపిస్తుంది.

మధ్యతరగతి ప్రజలు ఈ మాయలో పడి ఆదాయానికి, ఖర్చుకు మధ్య పొంతన కుదరక నిరంతరం నరకం చూస్తారు. వస్తువులు కొనకుండా ఉండలేక, కొని బతకలేక పూర్తిగా డబ్బుతో ముడిపడ్డ మానవ సంబంధాలన్నీ ధ్వంసమై, చావలేక, బతకలేక నలిగిపోతుంటారు. ఒక దశలో మనిషికున్న కొనుగోలు శక్తి మాత్రమే సమాజంలో అతని హోదాని, గౌరవాన్ని నిర్దేశిస్తుంది.


ఇక్కడ పచ్చళ్లమ్మాయి కాబట్టి ధర ఎక్కువని మన నోరు లేచింది కానీ, నిత్య జీవితంలో మనం ఈ ప్రశ్న ఎంతమందికి వేస్తున్నాం? ముఖ్యంగా మల్టీ నేషనల్‌ కంపెనీలు కేవలం హంగులు పొంగులతో వచ్చి మన దగ్గర దొరికే మంచినీళ్లను కూడా మనతోనే వందలు పెట్టి కొనిపించడం లేదూ! ప్రతి చోటా నిత్యం ఖరీదైన షాపుల్లో తలొంచుకుని అడిగినంత ఇచ్చి కొనుగోలు చేస్తున్న మనకు కేవలం పచ్చళ్ళమ్మాయివంటివారిని మాత్రమే ‘ధర ఎక్కువ’ అని ప్రశ్నించే హక్కు ఉందా? నాకైతే ఆ పచ్చళ్లమ్మాయిలో ఈ పెట్టుబడిదారీ సమాజం తయారు చేసిన ఒక మరబొమ్మ మాత్రమే కనిపిస్తోంది.

డా. వేంపల్లె షరీఫ్‌

ఈ వార్తలు కూడా చదవండి:

Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు.. తనను పెళ్లి చేసుకున్నాడంటూ..

MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

Updated Date - Apr 17 , 2025 | 06:08 AM