Share News

ఎవరు దేశభక్తుడు? ఎవరు దేశద్రోహి?

ABN , Publish Date - Apr 17 , 2025 | 06:15 AM

ఇటీవల ఒక సినిమా షూటింగ్‌ కోసం ఢిల్లీకి వెళ్లాను. రాత్రంతా షూటింగ్‌. పగలు విశ్రాంతి. బయటకు వెళ్దామంటే ఎర్రటి ఎండ. టీవీ పెడితే పార్లమెంట్‌లో వక్ఫ్‌ చట్టంపై చర్చ జరుగుతోంది. దాన్ని...

ఎవరు దేశభక్తుడు? ఎవరు దేశద్రోహి?

ఇటీవల ఒక సినిమా షూటింగ్‌ కోసం ఢిల్లీకి వెళ్లాను. రాత్రంతా షూటింగ్‌. పగలు విశ్రాంతి. బయటకు వెళ్దామంటే ఎర్రటి ఎండ. టీవీ పెడితే పార్లమెంట్‌లో వక్ఫ్‌ చట్టంపై చర్చ జరుగుతోంది. దాన్ని చూస్తుంటే నాకెందుకో ఉమర్‌ ఖలీద్‌ గుర్తుకొచ్చాడు. ఏసీ రూముల్లో నివసించే నేనే ఎండను తట్టుకోలేకపోతున్నానే, ఐదేళ్ల పాటు తీహార్‌‌ జైలులో ఈ ఎండను ఉమర్‌ ఎలా తట్టుకున్నాడా? అనిపించింది. నా ఆలోచనలు– ఖలీద్‌ తల్లిదండ్రుల వైపు మళ్లాయి. ఒకసారి వాళ్లని కలిసి ధైర్యం చెబితే బావుంటుంది కదా అనుకున్నాను. మా ఇద్దరికీ పరిచయం ఉన్నవారికి ఫోన్‌ చేశాను. ఉమర్‌ తల్లిదండ్రులతో వారు మాట్లాడి, నేను వాళ్లను కలిసేందుకు వస్తున్నానని చెప్పారు. మార్గమధ్యంలో వాళ్లు కలిసారు. ఉమర్‌ను వారందరూ వారానికొకరు తీహార్‌‌ జైల్లో కలుస్తూ ఉంటారు. ‘‘మీ పనులు మీకుంటాయి. ఇంత హడావుడి జీవితంలో ప్రతివారం ఉమర్‌ను కలవటానికి సమయం ఎలా కేటాయించగలుగుతున్నారు?’’ అని అడిగాను. ‘‘జైలు జీవితం ఎవరినైనా మార్చేయొచ్చు, అంత క్రూరంగా ఉంటుంది. అమీర్‌ అని మాకు తెలిసిన ఓ యువకుడున్నాడు. అతణ్ణి కూడా తప్పుడు అభియోగాలతో జైలుకు పంపారు. మొదటి మూడు నెలలు అమీర్‌ కుటుంబ సభ్యులు ప్రతి వారం వచ్చి తనను కలిసేవారు. కానీ వాళ్లది రెక్కడితే కాని డొక్కాడని పరిస్థితి. దాంతో జైలుకు రావటం తగ్గించారు. వారు రాకపోవటంతో అమీర్‌లో ఆత్మవిశ్వాసం తగ్గింది. సునాయాసంగా బెయిల్‌ వచ్చేసే ఆ కేసులో– అమీర్‌ పదేళ్లు జైలులోనే గడిపాడు. జైలు అతణ్ణి ఎలా మార్చిందో మా కళ్లతో చూశాం. ఉమర్‌కు అలాంటి స్థితి రాకూడదని నిర్ణయించుకున్నాం. ‘నీకు అండగా మేమున్నాం’ అని చెప్పటానికి ప్రతి వారం మాలో ఒకరు వెళ్లి కలిసి వస్తూ ఉంటాం’’ అని ఉమర్‌ స్నేహితుడొకరు చెప్పారు. బెయిల్‌ రాకుండా, విచారణ లేకుండా జైళ్లల్లో మగ్గిపోతున్నవారు కొన్ని కోట్లమంది ఉన్నారు. వారి వేదన కేవలం వారి కుటుంబాలకు, స్నేహితులకు మాత్రమే తెలుస్తుంది. ఉమర్‌ స్నేహితుల దృష్టిలో అతనొక దేశభక్తుడు. దేశంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నవాడు. అలాంటి వ్యక్తిని ప్రభుత్వం జైలులో ఉంచి మానసికంగా ఇబ్బంది పెడుతోంది కాబట్టి వారు అతనికి అండగా నిలవాలనుకున్నారు ఉమర్‌ స్నేహితులు. వారిని చూస్తుంటే గర్వంగా అనిపించింది.


మేము వెళ్లే సమయానికి ఉమర్‌ తండ్రి వక్ఫ్‌ బోర్డు సమావేశానికి వెళ్లారు. తల్లి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించింది. పైకి నవ్వుతూ మాకు ఆతిథ్యమిచ్చినా, ఆమె కన్నుల్లో ఎంతో బాధ గూడుకట్టుకు ఉంది. ఆమెను ఎలా ఓదార్చాలో నాకు తెలియలేదు. ఏవో సందర్భం లేని మాటలు మాట్లాడుతున్నాం. మధ్యలో ఎక్కడో ఉమర్‌ కేసు ప్రస్తావన వచ్చింది. ‘‘నా కుమారుడు త్వరలో విడుదలవుతాడు, కచ్చితంగా బయటకు వస్తాడు. మాకు న్యాయ వ్యవస్థపై ఇంకా విశ్వాసం ఉంది’’ అంది. మేము ఆమెను ఓదార్చటానికి వచ్చినట్లు అనిపించలేదు. ఆమె మమ్మల్ని ఓదారుస్తున్నట్లు అనిపించింది. నా కళ్లు చెమర్చాయి. కొడుకును అన్యాయంగా జైలులో పెట్టినవారికి శాపనార్ధాలు పెట్టాల్సిందిపోయి, న్యాయవ్యవస్థపై నమ్మకంతో మాట్లాడుతోందంటే ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఎలా వర్ణించాలి? ఇంతలో ఉమర్‌ తండ్రి వచ్చాడు. లోపలికి వెళ్లి మా అందరికీ చాయ్‌ కలిపి తీసుకువచ్చాడు. ‘‘మీ కుమారుడు ఒంటరి కాదు, మేమందరం ఉన్నాం,’’ అన్నాను. ఆయన కళ్లలో ఒక వైపు విశ్వాసం, మరోవైపు ఆవేదన కనిపిస్తున్నాయి. ‘‘ఉమర్‌ తప్పు చేసి జైలుకు వెళ్లలేదు. ప్రజల కోసం పోరాడుతూ జైలుకు వెళ్లాడు. అయినా మనందరం తనతోనే ఉన్నాంగా,’’ అన్నారాయన. ఆ తండ్రి ఆత్మవిశ్వాసానికి మనస్సులోనే సెల్యూట్‌ చేశాను. మాటలు సాగుతున్నాయి. ‘‘ఉమర్‌కు బెయిల్‌ వచ్చి విడుదలయితే, ప్రకాశ్‌ సార్‌ దగ్గరకు దక్షిణ భారతదేశానికి పంపేద్దాం. అక్కడైతే క్షేమంగా ఉంటాడు బాబా!’’ అని ఉమర్‌ స్నేహితుడొకరు అన్నారు. ఉమర్‌ తండ్రి అతని కళ్లలోకి సూటిగా చూసి ‘‘పోరాటం జరుగుతున్నది ఇక్కడ, ఢిల్లీలో. ఆ ప్రాంతాన్ని వదలి ఎక్కడికి వెళ్లాలి? ఎందుకు వెళ్లాలి?’’ అన్నారు. ఆయన మాటలకు నాకు షాక్‌ కొట్టినట్లయింది. వారి దృష్టిలో పోరాటమనేది జీవితానికి పర్యాయపదం. ఒక వ్యక్తికి ఉన్న సహజమైన హక్కులతో, రాజ్యాంగం చట్టబద్ధంగా ప్రసాదించిన గౌరవంతో ఈ సమాజంలో జీవించాలంటే పోరాడాల్సిందే. జీవచ్ఛవాలుగా ఉండలేం కదా! వర్తమానంలో ఉమర్‌ను ఎన్ని రకాలుగానైనా అనుకోవచ్చు. చరిత్ర మాత్రం భవిష్యత్తులో ఉమర్‌ను, అతని తల్లితండ్రులను దేశభక్తులుగా గుర్తిస్తుందనే నమ్మకం నాకుంది.


ఇక్కడ మనం ఇంకొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాలి. అసలు దేశద్రోహం అంటే ఏమిటనే విషయం తెలియకపోతే ఎవరు దేశభక్తుడో ఎవరు దేశద్రోహో ఎలా తెలుస్తుంది? ఈ నిర్వచనాలు తెలుసుకోవటానికి ఎప్పటి చరిత్రనో తవ్వాల్సిన అవసరం లేదు. వందేళ్ల నాటి చరిత్రను గమనిస్తే చాలు. మన దేశాన్ని అహింస అనే సూత్రం ద్వారా ఏకతాటిపై ఉంచిన మహాత్ముడు మత సామరస్యమనే సిద్ధాంతాన్ని గాఢంగా నమ్మాడు. ‘‘దేశం అంటే భూభాగం కాదు. దానిలో నివసించే ప్రజలు. వారందరికీ తమకు నచ్చిన మతాన్ని అనుసరించే హక్కు ఉంది. జాతి, మతం, భాషలు వేరు కావచ్చు. కానీ అందరూ సోదరులే’’ అని ప్రచారం చేశాడు. ఈ భావజాలాన్ని వ్యతిరేకించిన గాడ్సే అనే మతతత్వ ఉన్మాది మహాత్ముడిని హత్య చేశాడు. ఈ మధ్యకాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత– గాంధీజీని దేశద్రోహిగా, గాడ్సేను దేశభక్తుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ చేతిలో అధికారం ఉంది. తమ విధానాలను అడ్డుకున్నవారు దేశద్రోహులవుతున్నారు. తమ మతమౌడ్యాన్ని సమ్మతించేవారు అనతి కాలంలోనే దేశభక్తులవుతున్నారు! ఉమర్‌ కూడా అంతే! అతను ఒకప్పుడు చురుకైన యువకుడు. భారత రాజ్యాంగ ఆత్మను అర్థం చేసుకున్నవాడు. దానిని నాశనం చేస్తున్న వారికి వ్యతిరేకంగా రోడ్డెక్కి పోరాడినవాడు. మతద్వేషాన్ని, మతమౌఢ్యాన్ని వ్యాప్తి చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనుకున్నవారికి వ్యతిరేకంగా పోరాడినవాడు. ‘‘మతం వ్యక్తిగత అంశం. దానికి రాజకీయాల్లో స్థానం లేదు’’ అని ప్రతిపాదించిన గాంధీకి నిజమైన మానస పుత్రుడు. ‘‘సర్వాధికారానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటం మన నుంచి ప్రారంభం కాలేదు, మనతో ఆగిపోదు’’ అని గర్జించిన భగత్‌సింగ్‌ వారసుడు.


మన దేశానికి సౌభ్రాతృత్వం అంతరాత్మ. దీన్ని నాశనం చేయటానికి ఉద్దేశించినదే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ). దీనికి వ్యతిరేకంగా ఉమర్‌ పోరాడాడు. దీనిని వ్యతిరేకించేవారికి, సమర్థించేవారికి మధ్య జరిగిన పోరాటం హింసాత్మక రూపం దాల్చింది. ఈ పోరాటంలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయింది ముస్లింలే! ఈ హింసాత్మక ఘర్షణలను ప్రేరేపించే విధంగా ప్రసంగాలు చేసిన పాలక పార్టీ సభ్యులు స్వేచ్ఛగానే తిరుగుతున్నారు. రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఉమర్‌ను మాత్రం ఉగ్రవాద నిరోధక చట్టం (యూఏపీఏ) కింద ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. కింది కోర్టులన్నీ ఉమర్‌కు బెయిల్‌ ఇవ్వటానికి నిరాకరించాయి. సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. ఆరోపణలపై విచారణ చేయకుండా, నిర్ధారణ చేయకుండా, ఒక వ్యక్తిని ఐదేళ్లు జైలులో ఉంచటం చట్టవిరుద్ధమని సహజన్యాయ సూత్రాలు చెబుతున్నాయి. కానీ ఉమర్‌కు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనే అవకాశమే లేకపోతోంది. ‘‘ఇరవై నిమిషాలు సమయం ఇవ్వమనండి. ఉమర్‌ ఏ అపరాధమూ చేయలేదని నిరూపిస్తా’’ అంటాడు ఆయన తరఫు న్యాయవాది. కానీ ఆ ఇరవై నిమిషాల సమయం సుప్రీంకోర్టుకు లభించటం లేదు. చచ్చిన చేపలే ప్రవాహానికి కొట్టుకుపోతాయి. బతికిన చేపే ప్రవాహానికి ఎదురీదుతుంది. ఒడ్డుకు చేరుతుంది. నా దృష్టిలో ఉమర్‌ ప్రస్తుతం ప్రవాహానికి ఎదురీదుతున్న చేప. ఎప్పటికైనా తప్పకుండా విజయం సాధిస్తాడు.

ప్రకాశ్‌ రాజ్‌

సినీనటుడు, సామాజిక ఉద్యమకారుడు

ఈ వార్తలు కూడా చదవండి:

Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు.. తనను పెళ్లి చేసుకున్నాడంటూ..

MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

Updated Date - Apr 17 , 2025 | 06:15 AM