Share News

దొంగే... దొంగ దొంగ అన్నట్లు...!

ABN , Publish Date - Apr 17 , 2025 | 06:11 AM

నోటికొచ్చినట్లు అబద్ధాలాడటం జగన్ ముఠాకు వెన్నతో పెట్టిన విద్య. రాష్ట్ర ప్రజలు నిజాలు గ్రహించి అబద్ధపు రాజును మూలన కూర్చోబెట్టినా ఆయనలో, ఆయన ముఠాలో మార్పేమీ కనబడటం...

దొంగే... దొంగ దొంగ అన్నట్లు...!

నోటికొచ్చినట్లు అబద్ధాలాడటం జగన్ ముఠాకు వెన్నతో పెట్టిన విద్య. రాష్ట్ర ప్రజలు నిజాలు గ్రహించి అబద్ధపు రాజును మూలన కూర్చోబెట్టినా ఆయనలో, ఆయన ముఠాలో మార్పేమీ కనబడటం లేదు. అబద్ధాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి మరోసారి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. నిత్యం రోత రాతలు రాస్తూ కూటమి ప్రభుత్వంపై జగన్ రోత పత్రిక విషం కక్కుతున్నది. టీటీడీ పవిత్రతను తాము కాపాడినట్లు, కూటమి ప్రభుత్వం టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నట్లు జగన్‌ ముఠా ఆరోపణలు చేస్తోంది.

గడచిన మూడు నెలల్లో గోశాలలో వంద గోవులు మృత్యువాత పడ్డాయని, దీనిపై విచారణ జరపాలని, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేశారు. తమ పాలనలో దాతల సహకారంతో 500 గోవులను గోశాలకు తీసుకొచ్చి, వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. వాటికి ఆహారం సరిగ్గా లేక గోవులతో పాటు, లేగ దూడలు మృతి చెందాయని ఆరోపిస్తున్నారు. టీటీడీ గోశాలలో గోవులు మరణించినట్లు జగన్‌ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తూ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనారోగ్యం, వయోభారం వంటి కారణాలతో ఒకటి, రెండు గోవులు చనిపోతే దానిని రాజకీయ ప్రచారానికి వాడుకోవడం వారి రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనం. ఎక్కడో చనిపోయిన గోవుల ఫొటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా చిత్రీకరించి ప్రజల కళ్ళకు గంతలు కట్టాలని చూస్తున్నారు. ఇదే కరుణాకర్‌రెడ్డి, ఒకప్పుడు అదో నల్లరాయి దాని మీదకు చెప్పు విసిరితే ఏమవుతుందంటూ వెంకటేశ్వరస్వామిని దూషించారు. ఇప్పుడదే పెద్ద మనిషి టీటీడీపై సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తున్నారు.


గోశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు గోవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను క్రమం తప్పకుండా సమీక్షిస్తోంది. 260 మందికి పైగా ఉద్యోగులు నిత్యం గోవుల సంరక్షణను చూసుకుంటున్నారు. అయినా టీటీడీ గోసంరక్షణను పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 2,668 గోవులకు జియో ట్యాగ్ చేసి, ప్రతిరోజూ పర్యవేక్షిస్తుంటే, ఆ ట్యాగ్ తీసేశారంటూ విష ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు గోశాలలో టీటీడీ అధికారులు అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేశారు. గోశాలను ప్రతిరోజూ శుభ్రపరచి, బ్లీచింగ్ చేస్తున్నారు. గోశాలను సందర్శించిన భక్తులు కూడా పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ గోశాలలో పరిశుభ్రత లేదని, జనన, మరణాల రిజిస్టరులో నమోదు చేయడం లేదని టీటీడీపై వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.

మార్చి, 2021 నుంచి మార్చి, 2024 వరకు గోశాలలో అనేక అక్రమాలు జరిగాయి. నాటి పాలకులు చనిపోయిన గోవుల లెక్కలు దాచారు. వాటికి అపరిశుభ్రమైన ఆహారం అందించారు. గడువు తీరిన, లేబుల్ లేని, క్వాలిటీ చెక్ చేయని మందులను ఆవులకు ఇచ్చారు. చనిపోయిన గోవులను సంఖ్యను లెక్కల్లో చూపలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండుసార్లు గోశాలలో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 43, పోయిన ఏడాది 179 గోవులు చనిపోయాయని కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఆయన పాలకమండలి అధ్యక్షులుగా ఉన్న సమయంలో జరిగినవే. అంతేకాక అప్పట్లో దళారులను ఆశ్రయించి గదులు, దర్శన టికెట్లను భక్తులు ఆన్‌లైన్‌లో పొందేవారు. ఒక బ్రోకర్ 50సార్లు సేవ టికెట్లు పొంది, ఇతరులకు విక్రయించారు. తిరుపతి కొండపై అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించిందీ, ఏడు కొండలను ఐదు కొండలుగా చిత్రించిందీ నాస్తికుడయిన కరుణాకర్ రెడ్డే.


గత అయిదేళ్లూ జగన్ పాలనలో తిరుమల, తిరుపతిలో జరిగిన ఘోరాతి ఘోరాలు, పాపాలు హిందూ సమాజాన్ని కలవరపెట్టాయి. అంతేకాక అంతర్వేది రథం దగ్ధమైన ఘటన నుంచి, రామతీర్థంలో రాముడి విగ్రహం తల తీసేసిన ఘటన వరకూ వారు పాల్పడిన పాపాలకు ఏం సమాధానం చెబుతారు? నేడు ‘దొంగే... దొంగా, దొంగా’ అని అరిచినట్లుగా ఉంది నేడు జగన్ ముఠా వ్యవహారం. ఓ పక్క తిరుపతి పవిత్రతను కాపాడే ప్రయత్నాలు జరుగుతుంటే తట్టుకోలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు గోశాలలో గోవుల చనిపోయాయంటూ వారు దుష్ప్రచారం చేస్తున్నారు.

జగన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిల ఏలుబడిలో తిరుమల పుణ్యక్షేత్ర పవిత్రత మంటగలిసింది. జగన్ హయాంలో స్వామివారి ప్రసాదాలు, లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యతపై 2023 జూన్, జూలై నెలల్లో కేంద్ర హోంశాఖ నిపుణుల బృందం తిరుమలలో అధ్యయనం చేసి ఓ నివేదికను రూపొందించింది. వెంగమాంబ అన్నదాన సత్రంలో వడ్డిస్తున్న ఆహారంలో శుచి, శుభ్రత, నాణ్యత లేవని, నిబంధనలను గాలికొదిలేస్తున్నారని నిపుణుల బృందం గుర్తించింది. ఆహార పదార్థాల నాణ్యతను నిర్ధారించాల్సిన ల్యాబ్‌లో పరీక్షా పరికరాలే లేవని ఆ బృందం తేల్చింది. తాము చేసిన పాపాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్ ముఠా అబద్ధాలు చెబుతున్నది. అనవసరమైన పనులతో కమీషన్ల కోసం శ్రీనివాసుడి సొమ్ములు దోచిపెట్టడం వరకు కొండ మీద వారు చేసిన అక్రమాలకు అంతేలేదు. అవన్నీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పరిశీలనలో బట్టబయలయ్యాయి. జగన్ ఏలుబడి చివరిలో టీటీడీ నిధులతో కమీషన్ల కోసం రూ.1400 కోట్ల విలువైన పనులకు తిరుమలలో టెండర్లు పిలిచారు.

కోనేటిరాయడి దివ్యధామాన్ని పక్కా వ్యాపార కేంద్రంగా, స్వార్ధ రాజకీయాలకు కూడలిగా మార్చింది జగన్‌రెడ్డి కాదా? స్వలాభం కోసం అయిదేళ్లు ఆంధ్రప్రదేశ్‌ను చిద్రం చేయడమేగాక, టీటీడీ ప్రతిష్ఠను మంటకలిపింది వారు కాదా? వ్యాపార, ఆర్థిక, రాజకీయ అవసరాలకు తిరుమలను వాడుకున్న వైసీపీవారు క్షమార్హం కాని ఘోరాపరాధాలకు పాల్పడింది వాస్తవం కాదా? శ్రీనివాసుడి పట్ల తరగని భక్తిప్రపత్తులతో ఆబాలగోపాలం సమర్పించిన కానుకల సొమ్మును జగన్‌రెడ్డి తన వందిమాగధుల కోసం విచ్చలవిడిగా ఖర్చుపెట్టింది నిజం కాదా?


అబద్ధాల మెట్లపై నుంచి అధికార పీఠానికి ఎగబాకిన భ్రష్ట చరిత్ర జగన్‌రెడ్డిది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి పింక్ డైమండ్‌ను మాయం చేశారని, వకుళమాత పోటులో తవ్వకాలు జరిపి నగలను కొట్టేశారని, 2019 ఎన్నికలకు ముందు కూడా జగన్ ముఠా విస్తృతంగా దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందింది. పదవుల్లోకి వచ్చాక తిరుమల పవిత్రధామాన్ని కాసులవేటకు వేదికగా మార్చుకున్నది. మందీ మార్బలాన్ని వెంటేసుకుని ఎప్పుడంటే అప్పుడు దర్శనానికి వెళ్తూ సామాన్య భక్తులకు నరకం చూపించారు వైసీపీ నేతలు. ‘గోవిందా గోవిందా’ అంటూ భక్తకోటి శరణు ఘోషతో మార్మోగాల్సిన పుణ్యక్షేత్రంలో నిత్యం రాజకీయ విమర్శలకు దిగారు. టీటీడీ పాలకమండలిలో నేరచరితులకు పెద్దపీట వేసి శ్రీవారి భక్తుల మనోభావాలను గాయపరచారు. టీటీడీలో జగన్ పార్టీ ప్రబుద్ధులు చేయని అక్రమాలు లేవు. గడచిన అయిదేళ్లలో స్వామివారి లడ్డూ ధరల నుంచి కొండ మీది గదుల అద్దె వరకు అన్నింటినీ విపరీతంగా పెంచి సామాన్య భక్తులను నిలువుదోపిడీ చేశారు. జగన్ జమానాలో ఊరూరికీ పాకిన గంజాయి మహమ్మారి ఆఖరికి తిరుమలకూ చేరింది. ఈ విధంగా శ్రీనివాసుడి సన్నిధిలో పాపిష్టి పనులకు తెగబడిన జగన్‌రెడ్డి గ్యాంగ్ తామేదో పవిత్రులమయినట్లు జగన్నాటకాలు ఆడుతున్నది.


జగన్ ఏలుబడిలో అపవిత్రమైన తిరుమలకు మళ్ళీ పూర్వవైభవం కల్పించేలా టీటీడీని సంపూర్ణంగా సంస్కరించేందుకు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. వైసీపీని ప్రజలు తన్ని తరిమినా, పశ్చాత్తాపం లేకుండా కూటమి ప్రభుత్వాన్ని అబద్ధాలతో ఆ పార్టీ ఆడిపోసుకుంటున్నది.

నన్నూరి నర్సిరెడ్డి

టీటీడీ ట్రస్ట్‌ బోర్డు సభ్యులు

ఈ వార్తలు కూడా చదవండి:

Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు.. తనను పెళ్లి చేసుకున్నాడంటూ..

MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

Updated Date - Apr 17 , 2025 | 06:11 AM