Hair Transplant: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సకు సరైన సమయం ఇదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:51 PM
హెయిర్‌ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేయించుకునేందుకు 30 నుంచి 50 ఏళ్ల మధ్య సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. అయితే, అవసరాన్ని బట్టి 22 ఏళ్ల మొదలు 60 ఏళ్ల వాళ్లు కూడా ఈ చికిత్స చేసుకోవచ్చని వైద్యులు అంటున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో జుట్టు పలచబడటం, బట్టతల అనేక సమస్యల్ని తెచ్చి పెడతాయి. ముఖ్యంగా రూపురేఖలకు ప్రాధాన్యమున్న రంగాల్లోని వారికి ఇవి కెరీర్‌కు అడ్డంకిగా మారతాయి. ఇక పెళ్లి విషయాల్లో అయితే చెప్పనే అక్కర్లేదు. అదృష్టవశాత్తూ బట్టతలకు అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ అని చెప్పకతప్పదు. అయితే, ఈ ట్రీట్‌మెంట్‌కు తగిన సమయం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారా.. ఈ పండ్లు తింటే సమస్యకు చెక్
పేషెంట్ వయసుతో పాటు బట్టతల ఏ దశలో ఉందో, డోనర్ హెయిర్ లభ్యత ఏ స్థాయిలో ఉందో అనే అంశాలు, ఇతర వ్యక్తిగత విషయాల ఆధారంగా వైద్యులు ఈ చికిత్స ఎప్పుడు చేయాలనేది నిర్ణయిస్తారు. అయితే, బట్టతల దాదాపుగా వచ్చి ఇక జుట్టు ఊడదు అన్న తరుణంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్‌తో మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
సాధారణంగా 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఈ ఆపరేషన్ చేస్తారని అన్నారు. అయితే, చిన్న వయసులోనే ఈ సమస్య బారిన పడ్డవారికి కాస్త ముందుగానే ఈ చికిత్స చేయడం మంచిదని కూడా సూచిస్తున్నారు. ఇక పెద్ద వయసు ఉన్న వారు ఫిట్‌గా ఉంటే 60 ఏళ్ల వరకూ ఎప్పుడైనా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకోవచ్చని చెబుతున్నారు.
Also Read: నవజాత శిశువుల గురించి మీకీ ఆసక్తికర విషయాలు తెలుసా
22 ఏళ్ల లోపు వయసు వారిలో మాత్రం ఆ ఆపరేషన్ కొంత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంటుందని కూడా వైద్యులు చెబుతున్నారు. టీనేజర్లలో జుట్టు ఊడటం మొదలెడితే 20ల్లోనూ కొనసాగుతుందని, ఇలాంటి సందర్భాల్లో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్సతో ఒక్కోసారి అసహజ ఫలితాలు, మళ్లీ మళ్లీ ఈ చికిత్సలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక పెళ్లికి ముందు కొందరు ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకుందామని భావిస్తున్నారని, ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆపరేషన్ తరువాత జుట్టు మొలిచేందుకు గరిష్టంగా 12 నెలలు పట్టే అవకాశం ఉందని కాబట్టి కరెక్టుగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక లాంగ్ హెయిర్ ఎఫ్‌యూఈతో తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు పొందొచ్చని చెప్పారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే 30 నుంచి 50 ఏళ్ల లోపు ఎప్పుడైనా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స చేయించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.