Share News

Pillowcases Bacteria: టాయిలెట్ సీట్లపై కంటే దిండ్ల కవర్‌లపై ఎక్కువ బ్యాక్టీరియా.. తాజా అధ్యయనంలో వెల్లడి

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:17 PM

అపరిశుభ్రమైన దిండ్ల కవర్లు, దుప్పట్లపై భారీ స్థాయిలో బ్యాక్టీరియా పేరుకుంటుందని తాజా అధ్యయనంలో తేలింది. టాయిలెట్ సీట్లపై కంటే ఎక్కువగా సూక్ష్మక్రిములు వాటిపై చేరుతాయని అధ్యయనకర్తలు హెచ్చరిస్తున్నారు.

Pillowcases Bacteria: టాయిలెట్ సీట్లపై కంటే దిండ్ల కవర్‌లపై ఎక్కువ బ్యాక్టీరియా.. తాజా అధ్యయనంలో వెల్లడి

ఇంటర్నెట్ డెస్క్: బాత్‌రూంలల్లో ఎన్ని సూక్ష్మ క్రిములు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, బెడ్‌రూమ్‌లో మనం నిత్యం వాడే దిండ్లపై కూడా ఇంతకంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంధ సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.

‘‘బెడ్ షీట్స్, దుప్పట్లు, దిండ్ల కవర్లు క్రమం తప్పకుండా ఉతకకపోతే బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయిలో పేరుకుంటుంది. నాలుగు వారాల పాటు వీటిని ఉతక్కుండా ఉంటే దిండ్ల కవర్లు, దుప్పట్లపై టాయిలెట్‌లో కంటే 17 వేల ఎక్కువ బ్యాక్టీరియా చేరుతుంది. అంటే ఒక చదరపు అంగుళంలో 3 నుంచి 5 మిలియన్ల బ్యాక్టీరియా వరకూ వచ్చి చేరుతాయి’’ అని సంస్థ తన నివేదికలో పేర్కొంది.


Also Read: ఇంట్లో ఏసీ లేదా.. ఇలా చేస్తే ఎండాకాలంలోనూ కూల్ కూల్

గ్రామ్ నెగెటివ్ రాడ్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, బాసిల్లై, గ్రామ్ పాజిటివ్ కొక్కై వంటి బ్యా్క్టీరియా వచ్చి చేరుతాయి. వీటిల్లో కొన్ని ప్రమాదకరం కాకపోయినా మిగతావి మాత్రం వ్యాధి కలుగజేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అపరిశుభ్ర దిండ్లపై నిద్రిస్తే హానికారక బ్యాక్టీరియా, ఫంకై, ఇతర అలర్జీ కారకాల బారిన పడాల్సి వస్తుంది. మొటిమలు, ఇతర చర్మ సంబంధిత రోగాలు చుట్టుముడతాయి. స్వేదం, మృత చర్మ కణాలు వంటివాటితో నిండిన దిండ్ల కవర్ల.. చర్మంలోని స్వేదగ్రంథుల రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి. దీంతో, చర్మ సంబంధిత సమస్యలు మరింత తీవ్రమవుతాయి.


Also Read: విదేశాల్లో ఉండగా పాస్‌పోర్టు పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే..

అపరిశుభ్ర దిండ్ల కవర్లు, దుప్పట్లతో ఆస్థమా వంటి సమస్యలు కూడా తీవ్రమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రకరకాల పురుగులు, పెంపుడు జంతువుల నుంచి వెలువడే వ్యర్థాలు వంటివి ఊపిరితిత్తుల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. ఊపిరి ఆడకపోవడం, దగ్గు తుమ్ములు, కంటివెంట నీరు ధారాపాతంగా కారడం వంటివి వేధిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలున్న వారి ఇబ్బందులు పెరుగుతాయి.

స్ట్రెప్టోకొక్కస్ లాంటి బ్యాక్టీరియాతో ఇన్‌ఫెక్షన్లు కూడా వ్యాపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖంపై గాయాలు ఉన్నప్పుడు ఈ ప్రమాదం మరింత పెరుగుతుందని అంటున్నారు. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే, దుప్పట్లు, దిండ్ల కవర్లను క్రమం తప్పకుండా శుభ్రపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Read Latest and Health News

Updated Date - Mar 31 , 2025 | 11:17 PM