Newborn Babies Fascinating Facts: నవజాత శిశువుల గురించి మీకీ ఆసక్తికర విషయాలు తెలుసా
ABN , Publish Date - Mar 20 , 2025 | 10:10 PM
నవజాత శిశువుల చూడటానికి ఎంత ముద్దొస్తారో వారి శరీర లక్షణాలు కూడా అంతే ఆశ్చర్యం కొలుపుతాయని అంటారు వైద్యులు. మరి ఈ ఆసక్తికర విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం

ఇంటర్నెట్ డెస్క్: నవజాత శిశువులు చూడటానికి ఎంత ముద్దొస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చిన్నారులను చూస్తే ఎంతటి కఠిన హృదయం అయినా ఇట్టే కరిగిపోవాల్సిందే. అయితే, శిశువుల సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి. చాలా తక్కువ మందికి తెలిసిన అంశాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
నశజాత శిశువులకు కన్నీళ్లు రావట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అప్పుడే పుట్టిన పిల్లల్లో కన్నీరు ప్రవహించే వాహికలు పూర్తిగా అభివృద్ధి చెందవని నిపుణులు చెబుతున్నారు. అయితే కళ్లు తడారిపోకుండా తగినంత తేమ చిన్నారుల కళ్లల్లో ఉంటుందని వైద్యులు భరోసా ఇస్తున్నారు. పుట్టిన కొద్ది వారాలకు కన్నీటి వాహికలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయి. కాబట్టి, పుట్టగానే పిల్లలు గుక్కపెట్టి ఏడ్చినా చుక్క నీరు కూడా కంటి నుండి రాలదని గుర్తుపెట్టుకోవాలి
పెద్దల్లో 206 ఎముకులు ఉంటే నవజాత శిశువుల్లో మాత్రం ఆశ్చర్యకరంగా 300 ఎముకలు ఉంటాయి. వీటిలో చాలా మటుకూ కార్టిలేజ్ అనే కణజాలంతో తయారైనవి. బిడ్డ పెరిగే కొద్దీ ఇవన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమవుతాయి. చివరకు 206కు చేరుకుంటాయి. ఉదాహరణకు నవజాత శిశువు ముఖంలో ఎముకలు విడివిడిగా ఉంటాయి. తల్లి నుంచి బయటకొచ్చే సమయంలో సులువుగా ఉండేందుకు ఈ వ్యవస్థ ఏర్పడింది. పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ ఇవి ఒకదానితో మరొకటి అనుసంధానం అవుతాయి.
Also Read: రాత్రుళ్లు సరిగా నిద్రపట్టట్లేదా.. అర్ధరాత్రి రెండింటికి మెళకవ వస్తోందా?
ఇక పెద్దల్లో ఆహారాల రుచిని గ్రహించేందుకు నాలుకపై రెండు నుంచి పది వేల వరకూ టేస్ట్ బడ్స్ ఉంటాయి. అయితే, నవజాత శిశువుల్లో మాత్రం ఏకంగా 10 వేల టేస్ట్ బడ్స్ ఉంటాయి. కేవలం నాలుకపైనే కాకుండా గొంతు లోపల, దవడలపై కూడా ఇవి వ్యాపించి ఉంటాయి. పిల్లలు పెద్దయ్యే కొద్దీ ఇవి అంతర్థానమై చివరకు నాలుక మీద మాత్రమే మిగులుతాయి.
నవజాత శిశువులు నిద్రలో ఒక్కోసారి కొన్ని సెకెన్ల పాటు ఊపిరి తీసుకోవడం ఆపేస్తారట. అయితే, ఇది అత్యంత సహజమైన విషయమని నిపుణులు చెబుతున్నారు. తమ శ్వాసకోస వ్యవస్థపై పిల్లల్లో ఇంకా పూర్తిస్థాయి నియంత్రణ రాకపోవడంతో ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పెద్ద అయ్యే కొద్దీ ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది.
Also Read: పురుష ఉద్యోగుల్లో 57 శాతం మందికి ఈ సమస్య.. జాగ్రత్త పడకపోతే..
ఇక నవజాత శిశువులు వెల్లకిలా పడుకున్నప్పుడు తలను కుడివైపునకు తిప్పడం సహజం. దాదాపు 85 శాతం మంది ఇలాగే ఉంటారట. మెడ కండరాలు బలహీనంగా ఉండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా మెదడు, కండరాల చలనం మధ్య సమన్వయం లేకపోవడం ప్రధాన కారణమని 2017లో జరిగిన ఓ అధ్యయనం తేల్చింది.
పిల్లల బోసినవ్వులు ఆరు నుంచి 8 వారాల తరువాతే మొదలవుతాయి. అంతకుముందు వారు నవ్వినట్టు అనిపించినా అవి అసంకల్పిత చర్యలని నిపుణులు చెబుతున్నారు. 8 వారాల తరువాత పిల్లలు తమ చుట్టు ఉన్న వాటిని గుర్తుపట్టడం, తెలిసిన ముఖాలు కనిపించినప్పుడు నవ్వడం చేస్తారు. ఇది వారి పలకరింపుగా పెద్దలు భావించాలి.