Myanmar earthquake: ఛీ అందరూ భయంతో చస్తుంటే.. ఎంతకు తెగించార్రా..
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:25 PM
మయన్మార్‌లో వచ్చిన భూకంపాల కారణంగా బ్యాంకాక్‌లో భూప్రకంపనలు వచ్చాయి. పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయాయి. వాటిలో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల బిల్డింగ్ కూడా ఉంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గత శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌లో రెండు వరుస భూకంపాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం కారణంగా బ్యాంకాక్‌లో భూప్రకంపనలు వచ్చాయి. భూప్రకంపనల కారణంగా నిర్మాణంలో ఉన్న ఓ పెద్ద బిల్డింగ్ కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే నలుగురు చైనా వ్యక్తులు కూలిపోయిన బిల్డింగ్‌లోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న కొన్ని విలువైన డాక్యుమెంట్లను తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. వీళ్లకు ఆ కుప్పకూలిన బిల్డింగ్‌కు సంబంధం ఏంటంటే.. కూలిపోయిన 30 అంతస్తుల బిల్డింగ్‌ను చైనాతో సంబంధాలు ఉన్న ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తోంది. భూప్రకంపనలు రాగానే ఆ బిల్డింగ్ సెకన్లలో కుప్పకూలింది.
పోలీసులు బిల్డింగ్ కూలిపోవటంపై సదరు కంపెనీపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. పట్టుబడిన వారు ఆ కంపెనీలోనే పని చేస్తున్నారు. ఆ నలుగురిలో కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ కూడా ఉన్నాడు. మిగిలిన ముగ్గురు సబ్ కాంట్రాక్టర్లు. డాక్యుమెంట్లను కాపాడుకోవడానికే లోపలికి వెళ్లినట్లు వారు పోలీసులకు తెలిపారు. ఆ డాక్యుమెంట్లు ఉంటేనే ఇన్సురెన్స్ క్లైమ్ చేసుకోవడానికి ఉంటుందని అన్నారు. పోలీసులు వారిని విచారించిన తర్వాత తాత్కాళికంగా వదిలిపెట్టేశారు. వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్దమయ్యారు.
మయన్మార్ విలవిల
వరుస భూకంపాల కారణంగా మయన్మార్ శవాల దిబ్బగా మారిపోయింది. దాదాపు 3 వేల మంది మరణించారు. మరో 3 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ చనిపోయిన వారి శవాలు బయటపడుతూనే ఉన్నాయి. అంత్యర్యుద్ధం కారణంగా ఆంక్షలు ఉండటంతో.. ఒక్కో శవాన్ని బయటకు తీయడానికి 2 నుంచి 8 గంటలు పడుతోంది. మయన్మార్‌లో వచ్చిన భూకంపం తీవ్రత 334 అణుబాంబులతో సమానమని జియాలజిస్టులు చెబుతున్నారు. ఇక, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. తరచుగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఆదివారం కూడా మయన్మార్‌లో భూకంపం వచ్చింది. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది.
ఇవి కూడా చదవండి:
Myanmar Earthquake: మయన్మార్ భూకంపం.. 334 అణుబాంబులతో సమానం