AI Journalism : ఇక జర్నలిస్టుల అవసరం లేనట్టేనా.?
ABN , Publish Date - Mar 26 , 2025 | 06:06 PM
భవిష్యత్తులో, AI రొటీన్ పనులను చేస్తుండగా, జర్నలిస్టులు మరింత సృజనాత్మకంగా, విమర్శనాత్మకంగా ఆలోచించే పాత్రలకు మారవచ్చు.

AI Journalism : ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(AI) పాత్ర జర్నలిజంలో ఎలా ఉండబోతోంది. ఈ నవకల్పన ఎలక్ట్రానిక్ మీడియా రంగం తోపాటు ప్రింట్ మీడియాలోనూ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టబోతోందా అనేది చర్చనీయాంశమైంది. తాజాగా 'ఇల్ ఫోగ్లియో'(Il Foglio) అనే ఇటాలియన్ పత్రిక తొలిసారిగా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఒక ఎడిషన్‌ను ప్రచురించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇక్కడ రిపోర్టర్లు లేరు.. సబ్ ఎడిటర్లు లేరు.. ప్రూఫ్ రీడర్లు లేరు.. పేజ్ మేకప్ ఆర్టిస్టుల్లేరు.. ఫోటోగ్రాఫర్లు లేరు.. ఐనా సరే, డెయిలీ పేపర్ పబ్లిషైంది.. ప్రింట్ ఎడిషన్, డిజిటల్ ఎడిషన్ మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఈ ప్రత్యేక ఎఐ ఎడిషన్, 'ఇల్ ఫోగ్లియో ఏఐ' (Il Foglio AI) పేరుతో, నాలుగు పేజీలతో కూడిన ఒక సప్లిమెంట్‌గా రూపొందించబడింది. ఈ పత్రిక రోజువారీ వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు ఇంకా పాఠకుల నుంచి వచ్చిన లేఖలను కూడా AI ద్వారా రూపొందించింది.
వ్యాసాలు, శీర్షికలు, కోట్స్, సారాంశాలు అన్నీ AI ద్వారా రూపొందించబడ్డాయి. వ్యాసాలు స్పష్టంగా, వ్యాకరణ దోషాలు లేకుండా ఉన్నప్పటికీ, మానవుల నుంచి నేరుగా కోట్స్ లేకపోవడం ఒక పరిమితిగా కనిపించింది. జర్నలిజంలో AI యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి, దాని ఉపయోగాన్ని ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవడానికి ఈ ఇనీషియేటివ్ తీసుకున్నారు. పత్రిక సంపాదకుడు క్లాడియో సెరాసా (Claudio Cerasa) దీనిని "జర్నలిజాన్ని పునరుజ్జీవింపజేయడం కోసం ఒక అవకాశంగా చూస్తున్నా.. నాశనం చేయడానికి కాదు" అని పేర్కొన్నారు.
AI సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది, ఇల్ ఫోగ్లియో ప్రయోగం దీనికి ఒక ఉదాహరణ. AI సాధారణ వార్తల రచన, సారాంశాలు, డేటా విశ్లేషణలు వంటి పనులను త్వరగా, తక్కువ ఖర్చుతో చేయగలదు. సెరాసా ఇంకా ఏమన్నారంటే,"AI మానవులతో పోటీపడగలదు, కానీ దీర్ఘకాలంలో ఈ పోటీ సామర్థ్యాన్ని పెంచాలి" అని, భవిష్యత్తులో, AI రొటీన్ పనులను చేస్తుండగా, జర్నలిస్టులు మరింత సృజనాత్మకంగా, విమర్శనాత్మకంగా ఆలోచించే పాత్రలకు మారవచ్చు. కావున, జర్నలిస్టుల అవసరం పూర్తిగా తొలగిపోకపోవచ్చు, కానీ వారి పనితీరు కచ్చితంగా మారుతుంది." సెరాసా అంటున్నారు.
ఇక, సదరు ఏఐ పత్రిక మొదటి ఎడిషన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఒక కథనం, "పుతిన్, ది 10 బిట్రేయల్స్" అనే వ్యాసం (రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క 20 ఏళ్ల వాగ్దాన ఉల్లంఘనలు), ఇటలీ ఆర్థిక వ్యవస్థ గురించి ఒక సానుకూల కథనం, యువ యూరోపియన్లలో “సిచుయేషన్‌షిప్స్” (స్థిరమైన సంబంధాలకు దూరంగా ఉండే ధోరణి) గురించిన విశ్లేషణ ఉన్నాయి. చివరి పేజీలో AI రాసిన పాఠకుల లేఖలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఒకటి "AI మనుషులను నిష్ప్రయోజనం చేస్తుందా?" అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రచురణ ప్రయోగం 2025 ఏప్రిల్ 18 వరకూ కొనసాగుతుంది.
మరిన్ని చదవండి :
Share Market closing bell: భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు
Yogi Adityanath: హిందువులు సురక్షితంగా ఉంటే, ముస్లింలు సురక్షితం: యోగి