Share News

బచ్చలి ఆరోగ్యానికి నెచ్చెలి

ABN , Publish Date - Apr 19 , 2025 | 04:58 AM

కారం, వగరు, తీపి ఈ మూడురుచులు కలగలసిన ఆకు కూర బచ్చలి. దీనిలో పాలకూరతో సమానమైన పోషకతత్వాలు ఉంటాయి. ఇది తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. భోజన కుతూహల...

బచ్చలి ఆరోగ్యానికి నెచ్చెలి

కారం, వగరు, తీపి ఈ మూడురుచులు కలగలసిన ఆకు కూర బచ్చలి. దీనిలో పాలకూరతో సమానమైన పోషకతత్వాలు ఉంటాయి. ఇది తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. భోజన కుతూహల గ్రంథంలో దీనిని పోతకి లేదా ఉపోదకీ అని పేర్కొన్నారు. ఈ బచ్చలిలో రెండు రకాలు ఉన్నాయి. ఆకుపచ్చ కాండం, ఆకుపచ్చ ఆకులతో ఉన్న బచ్చలిని బసెల్లా ఆల్బా అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. ఎర్రని కాండం, ముదురు ఆకుపచ్చ ఆకులు కలిగిన బచ్చలిని బసెల్లా రుబ్రా అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. దీని గింజలు ఊదా రంగులో ఉంటాయి. ఈ రంగును తెలుగువారు బచ్చలిపండు రంగు అనే పిలుస్తారు. చాలా మంది బచ్చలి కూర వేడి చేస్తుందని భావిస్తారు. కానీ ఇది వాతాన్ని, వేడిని- రెండింటినీ అదుపు చేస్తుంది. ఆయుర్వేద గ్రంథాల్లో బచ్చలి కూర వల్ల ప్రయోజనాలను వివరించారు. ఆ ప్రయోజనాలు..

  • ఇది రక్తశుద్ధికి తోడ్పడుతుంది. ఎముకలకు పుష్టినిస్తుంది.

  • అనేక రకాల స్త్రీ సమస్యలకు ఇది పరిష్కారం. సంతాన ప్రాప్తినిస్తుంది. గర్భాశయపోషకంగా పనిచేస్తుంది.

  • బచ్చలి ఆకును నమిలితే నోటిపూతను నివారిస్తుంది. ఈ ఆకు రసంలో పసుపు కలిపి పెడితే గాయాలు త్వరగా మానతాయి. కాలిన గాయాలకు ఈ ఆకు రసం మందుగా పనిచేస్తుంది. ఈ రసాన్ని రాస్తే దురదలు తగ్గుతాయి.

  • బచ్చలి కూరకు మూత్ర పిండాల్లో రాళ్లను కరిగించే స్వభావముంది.

  • బచ్చలి కూరలో జిగురు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మలబద్ధకం ఉన్నవారు బచ్చలికూరను తింటే మంచిది.

  • గంగరాజు అరుణాదేవి


రకరకాల వంటలు

తెలుగువారు కంద బచ్చలి కూరను అన్ని శుభకార్యాల్లోనూ వండుతారు. ఇక బచ్చలికూరతో రకరకాల రుచికరమైన వంటలు చేసుకోవచ్చు.

  • బచ్చలికూరలో నూనె వేసి తాలింపు వేసి మూత పెట్టి మగ్గనిస్తే మెత్తగా అవుతుంది. దీనిలో ఉడికిన కందిపప్పు లేదా పెసర పప్పు వేసి పప్పుగా చేసుకోవచ్చు.

  • బచ్చలికూరను సన్నగా తరిగి దీనిలో శనగపిండి లేదా మొక్కజొన్న పిండి కలిపి కొద్దిగా నూనె వేసి వేయిస్తే రుచికరమైన కూర అవుతుంది. దీనిలో కొందరు కొబ్బరి తురుము, నువ్వుపప్పు కూడా వేస్తారు.

  • బచ్చలికూరను సన్నగా తరిగి దానిని నూనెలో దోరగా వేయించాలి.

ఆ తర్వాత దానిలో తాలింపు, కొద్దిగా చింతపండు వేయాలి. దీనిని మిక్సీలో వేసి రుబ్బి పచ్చడిగా కూడా చేసుకోవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: ఫోర్త్‌ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి

Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా

Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 19 , 2025 | 04:58 AM