Gilt Jewellery Care: గిల్టు నగల మన్నిక కోసం ఇలా చేయాలి..!
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:58 AM
తాజా ఫ్యాషన్‌కు తగ్గట్టు గిల్టు నగలు చీరల నుంచి ట్రెండీ డ్రెస్సులవరకూ అందరికీ సరిపోతున్నాయి. సరైన రీతిలో చూసుకుంటే ఇవి ఎక్కువకాలం కొత్తదనంతో మిగిలి అందాన్ని ఇస్తాయి.
మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అనుగుణంగా ప్రస్తుతం రకరకాల గిల్టు నగలు అందుబాటులో ఉన్నాయి. చీర, గౌను, ట్రెండీ డ్రెస్ ఇలా ఏ అవుట్‌ఫిట్ మీదనైనా చక్కగా అమరుతాయి ఈ నగలు. తక్కువ బరువుతో సౌకర్యవంతంగా అనిపిస్తాయి. అందుకే మహిళలు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎంతో ముచ్చట పడి కొనుక్కున్న గిల్టు నగలను ధరించేటప్పుడు చిన్న చిట్కాలు పాటిస్తూ సరైన పద్ధతిలో భద్ర పరచుకుంటే అవి ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. ఆ వివరాలు తెలుసుకుందాం...
గిల్టు నగలకు తడి తగిలితే అవి బంగారు మెరుపును కోల్పోతాయి. అందుకే గొలుసులు, హారాలు, నెక్లె్‌సలు, గాజులు, ఉంగరాలను స్నానం చేసేటప్పుడు తీయడం మంచిది. చేతులు కడుక్కునేటప్పుడు కూడా వాటికి తడి తగలకుండా చూసుకోవాలి.
మేకప్ ఉత్పత్తులు, మాయిశ్చరైజర్, పర్‌ఫ్యూమ్, లోషన్, డియోడరెంట్‌లు వాడేముందు గిల్టు నగలు ధరించకూడదు. అలా చేస్తే ఈ ఉత్పత్తుల్లోని రసాయనాల వల్ల నగలకు ఉన్న గోల్డ్ ప్లేటింగ్ తొలగిపోయి అవి నల్లబడే అవకాశం ఉంటుంది. మేకప్ పూర్తయి పర్‌ఫ్యూమ్ చల్లుకున్న అయిదు నిమిషాల తరవాతనే గిల్టు నగలు ధరించడం మంచిది.
వేసవికాలంలో ఎక్కువగా చెమట పట్టే సమయాల్లో ఈ నగలు వేసుకోవద్దు. చెమట తగిలితే నగలు నలుపుతిరుగుతాయి.
దుస్తులు ధరించిన తరవాతనే నగలు వేసుకోవాలి. లేదంటే దుస్తులకు ఉండే దారాలు, పోగులు పట్టుకుని నగలు విరిగిపోవచ్చు. నగల్లో ఉండే రాళ్లు, పూసలు రాలిపోవచ్చు.
ఒకసారి ధరించిన నగలను భద్రపరచేముందు వాటిని వెల్వెట్ వస్త్రం లేదా పలుచని కాటన్ గుడ్డతో మెల్లగా తుడవాలి. నగలకు అంటుకున్న చెమట, దుమ్ము లాంటి వాటిని పూర్తిగా తొలగించాలి. లేదంటే నగలు మెరుపును కోల్పోయి పాతబడతాయి.
గిల్టు నగలను అన్నింటినీ ఒకే బాక్సులో పెట్టకూడదు. అలా పెడితే ఒకదానికి మరోటి రాసుకుని వాటి మీద గీతలు పడతాయి. మెరుపుదనం తగ్గుతుంది. నగలను వాటికి నిర్దేశించిన బాక్సుల్లో మాత్రమే జాగ్రత్త చేయాలి.
ఈ నగలను గాలి, వెలుతురు చొరబడని పెట్టె లేదా సంచిలో పెట్టి ఉంచితే ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. పలుచని గుడ్డలో చుట్టి పెడితే వాటి మెరుపుదనం చాలాకాలం వరకూ నిలిచి ఉంటుంది.
ఇవి కూడా చదవండి...