దోసకాయ చికెన్ కూర
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:55 AM
చికెన్- 300 గ్రాములు, దోసకాయ ముక్కలు- ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు- రెండు కప్పులు, పచ్చిమిర్చి- మూడు, కారం- ఒకటిన్నర చెంచాలు, ఉప్పు- ఒకటిన్నర చెంచాలు, పసుపు- అర చెంచా...
కావాల్సిన పదార్థాలు
చికెన్- 300 గ్రాములు, దోసకాయ ముక్కలు- ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు- రెండు కప్పులు, పచ్చిమిర్చి- మూడు, కారం- ఒకటిన్నర చెంచాలు, ఉప్పు- ఒకటిన్నర చెంచాలు, పసుపు- అర చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, ఆవాలు- పావు చెంచా, జీలకర్ర- పావు చెంచా, ఎండుమిర్చి- రెండు, కరివేపాకు- రెండు రెమ్మలు, ధనియాల పొడి- అర చెంచా, నూనె- మూడు చెంచాలు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు
తయారీ విధానం
ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, అర చెంచా ఉప్పు, అర చెంచా కారం, అరచెంచా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి అరగంటసేపు నానబెట్టాలి.
స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. తరవాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి దోరగా వేపాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. ఇవన్నీ వేగాక నానబెట్టిన చికెన్ ముక్కలు వేసి కలపాలి. గిన్నెమీద మూతపెట్టి అయిదు నిమిషాలు మగ్గించాలి. తరవాత దోసకాయ ముక్కలు, ఒక చెంచా కారం, ఒక చెంచా ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. అరగ్లాసు నీళ్లు పోసి మరో అయిదు నిమిషాలు మగ్గించాలి. చివరలో కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ మీద నుంచి దించాలి. ఈ కూర రోటీ, చపాతీ, పుల్కా, వేడి అన్నంలోకి బాగుంటుంది.
జాగ్రత్తలు
చికెన్ ముక్కలు మగ్గుతున్నప్పుడు అందులో ఒక గరిటెడు పెరుగు కలిపితే కూర రుచిగా ఉంటుంది.
దోసకాయను పెద్ద ముక్కలుగా కోయాలి.
దోసకాయ... పులుపు, తీపి కలగలసిన రుచిలో ఉంటుంది. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం లాంటి మినరల్స్‌తోపాటు ఎ, సి, కె విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దోసకాయను తరచూ తినడం వల్ల ఎముకలు బలపడతాయి. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరానికి కావాల్సినంత తేమ లభిస్తుంది. చర్మం మృదువుగా బిగుతుగా మారుతుంది. రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు తగ్గుతాయి. దోసకాయలో ఉండే కుకుర్బిటాసిన్ ... మూత్రాశయ క్యాన్సర్‌ను నివారిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఫోర్త్ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి
Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!
Read Latest Telangana News And Telugu News