Share News

దోసకాయతో వెరైటీగా..

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:07 AM

మనం దోసకాయలతో ఇగురు, పప్పు, ఆవకాయ... ఇలా ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం. టమాటా, చిక్కుళ్లు లాంటివి చేర్చి రకరకాల కూరలు కూడా వండేస్తూ ఉంటాం...

దోసకాయతో  వెరైటీగా..

వంటిల్లు

మనం దోసకాయలతో ఇగురు, పప్పు, ఆవకాయ... ఇలా ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం. టమాటా, చిక్కుళ్లు లాంటివి చేర్చి రకరకాల కూరలు కూడా వండేస్తూ ఉంటాం.

ఇవి కాక దోసకాయలతో మాంసాహార రుచులు కూడా ప్రయత్నించవచ్చు.

దోసకాయలను విభిన్నంగా ఆస్వాదించాలనుకునేవారి కోసం ఈ వంటకాలు.

దోసకాయ చేపల పులుసు

కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు- పావు కిలో, దోసకాయ ముక్కలు- ఒక కప్పు, నూనె- పావు కప్పు, ఆవాలు- పావు చెంచా, మెంతులు- పావు చెంచా, ఎండు మిర్చి- 4, ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, కరివేపాకు- రెండు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, పసుపు- అర చెంచా, కారం- ఒక చెంచా, గరం మసాలా పొడి- ఒక చెంచా, టమాటా గుజ్జు- అర కప్పు, ఉప్పు- తగినంత, చింతపండు రసం- ఒక కప్పు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు


తయారీ విధానం: ముందుగా చేప ముక్కలను నీళ్లతో శుభ్రంగా కడగాలి. తరవాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పావు చెంచా పసుపు, పావు చెంచా ఉప్పు, పావు చెంచా కారం వేసి చేత్తో కలపాలి.

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో నూనె వేసి వేడిచేయాలి.

తరవాత ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి, కరివేపాకు, పావు చెంచా పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇవన్నీ దోరగా వేగాక అర చెంచా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. రెండు నిమిషాల తరవాత దోసకాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి మగ్గించాలి. అయిదు నిమిషాల తరవాత ముప్పావు చెంచా కారం, గరం మసాలా పొడి వేసి కలపాలి. ఇవి కొద్దిగా వేగాక టమాటా గుజ్జు, చింతపండు రసం వేసి బాగా కలపాలి. అయిదు నిమిషాల తరవాత అర చెంచా ఉప్పు వేసి, రెండు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. తరవాత చేప ముక్కలు వేసి మూతపెట్టి మగ్గించాలి. ఆరు నిమిషాల తరవాత మూత తీసి కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ మీద నుంచి దించాలి.


11-Navya.jpg

ఈ పులుసు వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది.

జాగ్రత్తలు

  • రోహు, కట్లా, శీలావతి, కొరమీను చేపలతో ఈ పులుసు చేసుకోవచ్చు. కానీ ముల్లు ఉండే రోహు చేపతో చేసిన పులుసు రుచికరంగా ఉంటుంది.

  • దోసకాయ, చేప ముక్కలను మరీ మెత్తగా మగ్గించకూడదు.

దోసకాయ వంకాయ పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • దోసకాయ ముక్కలు- ఒక కప్పు, వంకాయ ముక్కలు- ఒక కప్పు, టమాటా ముక్కలు- అర కప్పు, పచ్చి మిర్చి- పన్నెండు, చింతపండు- నిమ్మకాయంత, కొత్తిమీర- ఒక చిన్న కట్ట, కరివేపాకు- రెండు రెమ్మలు, జీలకర్ర- ఒక చెంచా, అవాలు- పావు చెంచా, వెల్లుల్లి రెబ్బలు- అయిదు, నూనె- నాలుగు చెంచాలు, పసుపు- పావు చెంచా, ఉప్పు- తగినంత, పచ్చిశనగపప్పు- ఒక చెంచా, మినప్పప్పు- ఒక చెంచా, ఎండు మిర్చి- ఒకటి, ఇంగువ- చిటికెడు


తయారీ విధానం

  • స్టవ్‌ మీద గిన్నెపెట్టి రెండు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. ఇందులో అర చెంచా జీలకర్ర, కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, వంకాయ ముక్కలు వేసి దోరగా వేపాలి. తరవాత టమాటా ముక్కలు, చింతపండు, కొద్దిగా ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గించాలి. తరవాత అర కప్పు దోసకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి స్టవ్‌ మీద నుంచి దించి చల్లార్చాలి. మిక్సీ గిన్నెలో వెల్లుల్లి రెబ్బలు, వేయించిన వంకాయ-టమాటా ముక్కల మిశ్రమం వేసి కచ్చాపచ్చాగా ఉండేలా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీయాలి. స్టవ్‌ మీద తాలింపు గిన్నె పెట్టి రెండు చెంచాల నూనె వేసి వేడిచేయాలి. ఇందులో అర చెంచా జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కొద్దిగా పసుపు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు, అరకప్పు దోసకాయ ముక్కలు వేసి కలపాలి. ఈ తాలింపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి బాగా కలపాలి. ఉప్పు సరిచూసుకోవాలి.

ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.

జాగ్రత్తలు

  • దోసకాయను చిన్న ముక్కలుగా కోయాలి. పొడవాటి వంకాయలు తీసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది.

  • గ్రైండ్‌ చేసేటప్పుడు కొన్ని వేయించిన పల్లీలు వేస్తే పచ్చడికి కమ్మదనం వస్తుంది.

  • ఈ పచ్చడిని రోట్లో చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: ఫోర్త్‌ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి

Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా

Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 19 , 2025 | 05:07 AM