Iftar in Bahrain: బహ్రెయిన్ తెలుగు కళా సమితి ఇఫ్తార్ విందులో అరబ్బు ప్రముఖులు
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:40 PM
గల్ఫ్‌లోని తెలుగు ప్రవాసీ సంఘాలన్నింటిలోనూ పాతది అయిన బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి ఈసారి నిర్వహించిన ఇఫ్తార్ విందు భారతీయ వసుధైక కుటుంబ విలువలకు ప్రతిబింబంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బహ్రెయినీ అరబ్బు ప్రముఖులు పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మాతృభూమిలో క్రమేణా మతపర విద్వేష పూరిత వాతావరణం పెరుగుతూ సామరస్యం దెబ్బతింటున్న నేపథ్యంలో ప్రవాసంలో తెలుగు ప్రవాసీయులు మాత్రం మతసామరస్యం, మానవీయతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ ఇష్టపూర్వకంగా ఒక మతస్థులు మరొకర్ని విందుకు ఆహ్వానించి వడ్డించే వారే నిజంగా విశాల హృదయులు. తెలుగు ప్రవాసీయులు ప్రతి రంజాన్ మాసంలో చేపట్టే ఇఫ్తార్ కార్యక్రమాలు ఆప్యాయత వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడటానికి దోహదపడుతున్నాయి.
గల్ఫ్ లోని తెలుగు ప్రవాసీ సంఘాలన్నింటిలోనూ పాతది అయిన బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి నిర్వహించే ఏ పండుగ అయినా పూర్తిగా ఆధ్యాత్మికతను చాటిచెబుతుంది. సర్వమత ఆదరణలో భాగంగా తెలుగు కళా సమితి ప్రతి సంవత్సరం డిస్కవరి ఇస్లాం అనే సంస్థ సౌజన్యంతో నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమం కూడా వినూత్నంగా ఉంటుంది. ఈసారి నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో బహ్రెయినీ అరబ్బు ప్రముఖులను ఆహ్వానించడం ద్వార భారతీయ వసుధైక కుటుంబ విలువలను ప్రదర్శించింది.
Also Read: దుబాయ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
ఇఫ్తార్ విందుకు బహ్రెయిన్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ హసన్ ఈద్ బఖమ్మాస్ ముఖ్య అతిథిగా, స్వచ్ఛంద సేవా సంస్థల అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ రాషేద్ అల్ సనదీన గౌరవ అతిథిగా పాల్గొన్నారు. అబ్దుల్ హాకీం ఉమేరీ, మోహమ్మద్ అబ్దుల్ ముజాహీద్, మోహమ్మద్ యహ్యా మురాద్, మునా అల్ శుయేఖీ అనే బహ్రెయినీ ప్రముఖులు హజరయ్యారు.
తెలుగు కళా సమితి పక్షాన రఘునంద బాబు, నోముల మురళీ, మురళీ కృష్ణా, యం.బి.రెడ్డి, డాక్టర్ అబ్దుల్ అజీజ్ తదితరులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Also Read: తానా మహాసభలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
స్థానిక అరబ్బు ప్రముఖులను ఆహ్వానించడం ద్వార భారతీయ విలువలను తాము తెలియజేసామని బహ్రెయిన్ తెలుగు కళా సమితి కార్యవర్గం పేర్కొంది. ఈ సంఘానికి అధ్యక్షుడిగా జగదీశ్, ఉపాధ్యక్షులుగా రాజకుమార్, నాగ శ్రీనివాస్, కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్, సహాయక కార్యదర్శిగా లత, కార్యవర్గ సభ్యులుగా గంగాసాయి, సంతోష్, చంద్రబాబు, దీపక్‌లు వ్యవహరిస్తున్నారు.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..