Rajasthan SI exam fraud: పైఅధికారులకు రాసిన లేఖలో తప్పులు.. మహిళా పోలీసు జైలు పాలు.. అసలేం జరిగిందో తెలిస్తే..
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:01 PM
ఓ మహిళా ఎస్సై తన పైఅధికారులకు రాసిన తప్పుల తడక లేఖ చివరకు ఆమె కొంపముంచింది. ఆమె భాష నైపుణ్యాలు ప్రశ్నార్థకంగా ఉండటంతో అధికారులు విచారించగా మహిళ మోసం బయటపడింది. పోలీసు నియామక పరీక్షలో ఆమె కాపీ కొట్టి టాప్ ర్యాంకు తెచ్చుకున్నట్టు తేలింది. రాజస్థాన్‌లో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎస్సై నియామక పరీక్షల్లో ఆమె టాప్ ర్యాంకు సాధించింది. ట్రెయినీ ఎస్సైగా విధుల్లో చేరింది. ఇక అంతా సాఫీ అనుకుంటున్న తరుణంలో ఆమె మోసం బయటపడింది. పైఅధికారులకు తను స్వయంగా రాసిన ఓ లెటర్ ఆమె బండారాన్ని బయటపెట్టింది. అసలేం జరిగిందో తెలుసుకుని చివరకు పోలీసు ఉన్నతాధికారులు కూడా షాకైపోయారు. రాజస్థాన్‌లోని ఝున్‌ఝ్నూ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగానే కాకుండా యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది (Rajasthan SI exam fraud).
2021 నాటి ఎస్సై నియామక పరీక్షల్లో మోనికా అనే అభ్యర్థి రాష్ట్రస్థాయిలో ఏకంగా 34వ ర్యాంకు సాధించారు. ఇక హిందీ పేపర్‌లో ఊహించని స్థాయిలో 200 మార్కులకు 181 స్కోర్ సాధించారు. జనరల్ నాలెడ్జ్ పేపర్ 200 మార్కులకు మరో 161 సాధించారు. ఇంటర్వ్యూలో మాత్రం 15 మార్కులే స్కోర్ చేశారు. ఆ తరువాత ట్రెయినీగా విధుల్లో చేరారు.
Also Read: భారతీయ వీధులు శుభ్రం చేసిన విదేశీ టూరిస్టులు
ఇక గతేడాది జూన్ నుంచి జులై 2 వరకూ మెడికల్ లీవ్ పెట్టిన ఆమె తన సమస్యకు సంబంధించి ఎటువంటి మెడికల్ రికార్డులు దాఖలు చేయలేదు. ఆ తరువాత నవంబర్ 11న అధికారులకు ఆమె మరో లేఖ రాశారు. తనను ఝన్‌ఝ్నూ పోలీస్ లైన్స్‌లో విధులు కేటాయించాల్సిందిగా కోరారు.
అయితే, మోనికా హిందీలో రాసిన 20 లైన్ల లేఖను చూసి పైఅధికారులు ఆశ్చర్యపోయారు. నియామక పరీక్షల్లో టాప్ ర్యాంకు సాధించిన యువతి లేఖలో అన్ని అక్షర దోషాలు రాయడం ఏంటో అర్థంకాలేదు. ముఖ్యంగా ఆమె హోదాకు సంబంధించిన పదంలోనూ అక్షర దోషాలు ఉండటం పోలీసు ఉన్నతాధికారులను ఆశ్చర్యపరిచింది. నేను, ఇన్స్‌పెక్టర్, ప్రొబేషనర్, డాక్యుమెంట్, ఝున్‌ఝ్నూ వంటి సింపుల్ పదాలను కూడా ఆమె తప్పులు లేకుండా రాయలేకపోయింది.
Also Read: విమానం టేకాఫ్ అవుతుండగా ఊహించని ఘటన
ఆ తరువాత పోలీసులు జరిపిన దర్యాప్తులో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాటి పరీక్షల్లో మోనికా బ్లూటూత్ పరికరం సాయంతో కాపీ కొట్టినట్టు తేలింది. కాపీ కొట్టడంలో సహకరించేందుకు కలీర్ అనే వ్యక్తికి మోనికా ఏకంగా రూ.15 లక్షలు ఇచ్చినట్టు బయటపడింది. చివరకు కలీర్ అరెస్టు అయినట్టు తెలియగానే ఆమె పారిపోయింది.