Share News

ఆర్‌సీబీ బోణీ అదిరింది

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:26 AM

జరిగిన లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్లతో డిఫెండింగ్‌ చాంప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కేకేఆర్‌ ను చిత్తు చేసింది..

ఆర్‌సీబీ బోణీ అదిరింది

  • కోహ్లీ, సాల్ట్‌ హాఫ్‌ సెంచరీలు

  • 7 వికెట్లతో కోల్‌కతా చిత్తు

  • రహానె శ్రమ వృథా

  • క్రునాల్‌కు 3 వికెట్లు

కోల్‌కతా: ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అదిరే బోణీ చేసింది. విరాట్‌ కోహ్లీ (36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్‌), ఫిల్‌ సాల్ట్‌ (31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) ధనాధన్‌ అర్ధ శతకాలతోపాటు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్రునాల్‌ పాండ్యా (3/29) తిప్పేయడంతో.. శనివారం జరిగిన లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్లతో డిఫెండింగ్‌ చాంప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)ను చిత్తు చేసింది. తొలుత కోల్‌కతా 20 ఓవర్లలో 174/8 స్కోరు చేసింది. కెప్టెన్‌ అజింక్యా రహానె (56), సునీల్‌ నరైన్‌ (44) రాణించారు. హాజెల్‌వుడ్‌ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో బెంగళూరు 16.2 ఓవర్లలో 177/3 స్కోరు చేసి గెలిచింది. సారథి రజత్‌ పటీదార్‌ (34) ధాటిగా ఆడాడు.


బాదేసిన సాల్ట్‌: ఛేదనలో బెంగళూరు ఓపెనర్లు సాల్ట్‌, కోహ్లీ చెలరేగడంతో వార్‌ వన్‌సైడ్‌గా మారింది. బౌండ్రీతో ఖాతా తెరిచిన సాల్ట్‌.. మూడో ఓవర్‌లో వైభవ్‌ బౌలింగ్‌లో 20 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లో వరుణ్‌ బౌలింగ్‌లో 4,6,4,4తో 21 పరుగులు పిండుకొన్న సాల్ట్‌ టీమ్‌ స్కోరును ఫిఫ్టీ దాటించాడు. కోహ్లీ కూడా వీలుచిక్కినప్పుడల్లా బ్యాట్‌కు పని చెప్పడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి బెంగళూరు 80/0తో గెలుపు దిశగా దూసుకెళ్లింది. అర్ధ శతకం పూర్తి చేసుకొన్న సాల్ట్‌ను వరుణ్‌ క్యాచవుట్‌ చేయడంతో.. తొలి వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌లో వచ్చిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ (10)ను నరైన్‌ అవుట్‌ చేశాడు. అనంతరం వచ్చిన పటీదార్‌తో కలసి కోహ్లీ మూడో వికెట్‌కు 44 రన్స్‌ జోడించడంతో గెలుపు సులువైంది. బౌండ్రీతో కోహ్లీ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. పటీదార్‌ను వైభవ్‌ పెవిలియన్‌ చేర్చాడు. అయితే, విజయానికి 27 బంతుల్లో 13 రన్స్‌ అవసరమవగా.. లివింగ్‌స్టోన్‌ (15 నాటౌట్‌) 4,6,4తో బెంగళూరు 22 బంతులు మిగిలుండగానే గెలిచింది.


రహానె మెరిసినా..: రహానె, నరైన్‌ రెండో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరుకు బాటలు వేసినా.. కీలక వికెట్లను పడగొట్టిన క్రునాల్‌ కోల్‌కతా జోరుకు బ్రేకులు వేశాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ డికాక్‌ (4) వికెట్‌ కోల్పోయింది. కానీ, వన్‌డౌన్‌లో వచ్చిన రహానె.. మరో ఓపెనర్‌ నరైన్‌తో కలసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆరో ఓవర్‌లో యశ్‌ బౌలింగ్‌లో రహానె 4,6,4తో 20 రన్స్‌ పిండుకోవడంతో పవర్‌ప్లేలో కోల్‌కతా 60/1 స్కోరు చేసింది. సుయాష్‌ వేసిన 9వ ఓవర్‌లో రహానె అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. నరైన్‌ 6,4తో ఆ ఓవర్‌లో మొత్తం 22 రన్స్‌ లభించాయి. అయితే, వరుస ఓవర్లలో నరైన్‌, రహానె అవుటవడంతో కోల్‌కతా బ్యాటింగ్‌ కుదుపునకు లోనైంది. నరైన్‌ను సలామ్‌, రహానెను క్రునాల్‌ అవుట్‌ చేయడంతో కోల్‌కతా 11 ఓవర్లలో 110/3తో నిలిచింది. ఈ దశలో బెంగళూరు స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి పరుగులను కట్టడి చేశారు. వెంకటేష్‌ అయ్యర్‌ (6), రింకూ సింగ్‌ (12)ను కూడా క్రునాల్‌ వెనక్కిపంపగా..రస్సెల్‌ (4)ను సుయాష్‌ బౌల్డ్‌ చేయడంతో డెత్‌ ఓవర్లలో కోల్‌కతా 29 పరుగులే చేయగలిగింది. రఘువంశీ (30)ను యశ్‌.. హర్షిత్‌(5)ను హాజెల్‌వుడ్‌ అవుట్‌ చేశాడు. దీంతో నైట్‌రైడర్స్‌ కష్టంగా 170 పరుగుల మార్క్‌ దాటింది.


స్కోరుబోర్డు

కోల్‌కతా: డికాక్‌ (సి) జితేశ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 4, నరైన్‌ (సి) జితేశ్‌ (బి) రసిఖ్‌ 44, రహానె (సి) రసిఖ్‌ (బి) క్రునాల్‌ 56, వెంకటేశ్‌ (బి) క్రునాల్‌ 6, రఘువంశీ (సి) జితేశ్‌ (బి) యశ్‌ దయాల్‌ 30, రింకూ (బి) క్రునాల్‌ 12, రస్సెల్‌ (బి) సుయాశ్‌ 4, రమణ్‌దీప్‌ (నాటౌట్‌) 6, హర్షిత్‌ (సి) జితేశ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 5, స్పెన్సర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 174/8; వికెట్ల పతనం: 1-4, 2-107, 3-109, 4-125, 5-145, 6-150, 7-168, 8-173; బౌలింగ్‌: హాజెల్‌వుడ్‌ 4-0-22-2, యశ్‌ దయాల్‌ 3-0-25-1, రసిఖ్‌ సలామ్‌ 3-0-35-1, క్రునాల్‌ పాండ్యా 4-0-29-3, సుయాశ్‌ శర్మ 4-0-47-1, లివింగ్‌స్టోన్‌ 2-0-14-0.


బెంగళూరు: సాల్ట్‌ (సి) స్పెన్సర్‌ (బి) వరుణ్‌ 56, కోహ్లీ (నాటౌట్‌) 59, పడిక్కళ్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) నరైన్‌ 10, పటీదార్‌ (సి) రింకూ (బి) అరోరా 34, లివింగ్‌స్టోన్‌ (నాటౌట్‌) 15, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 16.2 ఓవర్లలో 177/3; వికెట్ల పతనం: 1-95, 2-118, 3-162; బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 3-0-42-1, స్పెన్సర్‌ జాన్సన్‌ 2.2-0-31-0, వరుణ్‌ చక్రవర్తి 4-0-43-1, హర్షిత్‌ రాణా 3-0-32-0, సునీల్‌ నరైన్‌ 4-0-27-1.

3

కోల్‌కతాపై వెయ్యికి పైగా పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కోహ్లీ. డేవిడ్‌ వార్నర్‌ (1093 పరుగులు), రోహిత్‌ (1070) విరాట్‌ కంటే ముందున్నారు.

ఇవి కూడా చదవండి..

IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే

IPL 2025: బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 04:26 AM