Share News

Dhoni CSK Playoffs Chances: ఈసారి ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కాకపోతే.. సీఎస్‌కు కెప్టెన్ ధోనీ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 21 , 2025 | 01:13 PM

ఈసారి ప్లేఆఫ్స్‌కు సీఎస్‌కే క్వాలిఫై కావడం కష్టమేనని ధోనీ అన్నాడు. ఈ సారి విఫలమైతే వచ్చే సారి మరింత మెరుగ్గా బరిలోకి దిగుతామని తెలిపాడు.

Dhoni CSK Playoffs Chances: ఈసారి ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కాకపోతే.. సీఎస్‌కు కెప్టెన్ ధోనీ కీలక వ్యాఖ్యలు
CSK IPL 2025 playoff hopes

ఇంటర్నెట్ డెస్క్: ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరడం సీఎస్‌కేకు కష్టమేనని జట్టు కెప్టెన్ ధోనీ అంగీకరించాడు. అయితే, ప్లేఆఫ్స్‌కు చేరేందుకు తాము శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పారు. ఆదివారం వాంఖెడే స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఘోర పరాజయం చవి చూసిన విషయం తెలిసిందే. సీఎస్‌కేకు ఇది వరుసగా ఆరో ఓటమి. ఈ మ్యాచ్‌లో మిడిల్ ఓవర్స్‌లో టీం ఆటతీరుపై ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బిగ్ షాట్స్ ఆడాలన్న కసి, పట్టుదల కొరవడిందని అభిప్రాయపడ్డాడు. ఫలితంగా భారీ స్కోరు చేయలేకపోయామని చెప్పారు. ఈ మ్యాచ్‌లో ముంబై 26 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సునాయస విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో ధోనీ ఈ కామెంట్స్ చేశాడు.


‘‘తదుపరి అన్ని గేమ్స్ మేము గెలవాల్సి ఉంది. కానీ ఒక్కో గమ్ లక్ష్యంగా ముందుకు సాగుతాము. ఒక వేళ కొన్ని మ్యాచులు ఓడిపోతే వచ్చే సీజన్‌లో అయినా అన్నీ సరిగా కుదిరేలా ప్రయత్నం చేస్తాము. ఈ ఓటములే తదుపరి టీం నిర్మాణంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. ఎక్కువ మంది ఆటగాళ్లను మార్చే ఉద్దేశం మాకు లేదు. అయితే, ఈసారి ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవడంపై దృష్టి పెడతాము. అది కుదరకపోతే తదుపరి సీజన్ ‌లో మరింత బలంగా రంగంలోకి దిగుతాము. అసలు మా ఆట తీరు మెరుగ్గా ఉందా.. బ్యాటర్లు కావాల్సినన్ని పరుగులు రాబడుతున్నారా.. బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయగలుగుతున్నారా.. ఇవే మా ముందున్న ప్రశ్నలు’’ అని మ్యాచ్ అనంతరం ధోనీ తెలిపాడు.


ఇప్పటివరకూ ఆడిన 8 మ్యాచుల్లో సీఎస్‌కే కేవలం రెండింట్లోనే విజయం సాధించింది. నాలుగు పాయింట్లతో మైనస్ 1.392 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో చివరన ఉన్న సీఎస్‌కే ప్లేఆఫ్స్ చేయడం దాదాపు కష్టమే. అయితే, సాంకేతికంగా చూస్తే మాత్రం ఈ అవకాశం మిగిలే ఉంది. తదుపరి జరిగే అన్ని మ్యాచుల్లో గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకుంటే తప్ప ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం లేదు.

ఇవి కూడా చదవండి:

బెంగళూరు.. ప్రతీకారం

ముంబై హ్యాట్రిక్‌

అమోఘం.. అతని అరంగేట్రం!

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 21 , 2025 | 01:13 PM