Tamim Iqbal Heart Attack: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్‌కు మైదానంలో గుండె పోటు.. పరిస్థితి విషమం
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:28 PM
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ గుండె పోటుకు గురయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, జాతీయ జట్టు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గుండె పోటుకు గురయ్యాడు. మైదానంలోనే అతడికి ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. అతడికి తీవ్రమైన హార్ట్ ఎటాక్ వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రధాన వైద్యుడు డా. దేబాశిష్ చౌదరి పేర్కొన్నారు.
సోమవారం ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్ సందర్భంగా తమీమ్ గుండె పోటుకు గురయ్యాడు. ముహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు నేతృత్వం వహిస్తున్న అతడు టాస్‌లో ఎప్పటిలాగానే పాల్గొన్నాడు. ఆ తరువాత మైదానంలో ఉండగానే గుండెపోటుకు గురయ్యాడు. తన ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో మైదానంలో చికిత్స చేశారు. ఆ తరువాత మరో ఆసుపత్రికి తరలించారు.
Also Read: దోనీ రేంజ్ ఇది.. ఈ వీడియో చూస్తే సంబరం పీక్స్‌కు వెళ్లడం పక్కా!
‘‘తొలుత స్థానిక ఆసుపత్రిలో అతడి పరీక్షలు నిర్వహించారు. గుండెలో సమస్య ఉన్నట్టు గుర్తించారు. ఢాకా తరలించేందుకు ఏర్పాట్లు చేశాము. హెలికాఫ్టర్‌ను రప్పించాము. అయితే, అతడిని హెలీపాడ్ వద్దకు తరలిస్తున్న సమయంలో మరోసారి తీవ్ర గుండె పోటుకు గురయ్యాడు. వెంటనే వెనక్కు తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. అతడికి తీవ్రమైన గుండె పోటు వచ్చినట్టు వైద్య పరీక్షల్లో తేలింది’’ అని డా.దేబాశిష్ పేర్కొన్నారు. లైఫ్ సపోర్టుపై ఉంచి అతడికి చికిత్స చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Also Read: పెళ్లి ఎప్పుడు బ్రో అంటూ ప్రశ్న.. తెగ సిగ్గుపడిపోయిన నితీశ్ రెడ్డి
తమీమ్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 2023లోనే అతడు రిటైర్మెంట్ ప్రకటించినా అప్పటి ప్రధాని షేక్ హసీనా అభ్యర్థన మేరకు వెనక్కు తగ్గాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనాలని కోరినా అతడు సున్నితంగా తిరస్కరించాడు. తన అంతర్జాతీయ కెరీర్ ముగిసిందని స్పష్టం చేశాడు. తన కెరీర్‌లో తమీమ్ మొత్తం 70 టెస్టులు, 243 వన్డేలు, 70 టీ20 మ్యాచులు ఆడాడు. మూడు ఫార్మాట్లలో వరుసగా 5134, 8357, 1778 పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి