Nitish Kumar Reddy: మోకాళ్లతో తిరుమల మెట్లెక్కిన నితీష్ కుమార్ రెడ్డి.. మొక్కు తీర్చుకున్న యంగ్ సెన్సేషన్..
ABN , Publish Date - Jan 14 , 2025 | 10:03 AM
ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో అదరగొట్టి దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న వైజాగ్ కుర్రాడు, యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి హాజరయ్యాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాడు.
ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో అదరగొట్టి దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న వైజాగ్ కుర్రాడు, యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి హాజరయ్యాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాడు. అలిపిరి నుంచి కాలినడక మార్గంలో వెళ్లిన నితీష్ కుమార్.. మోకాళ్ల పర్వతం నుంచి మోకాళ్లపై నడుస్తూ మెట్లెక్కాడు. తన మొక్కును తీర్చుకున్నాడు. కాలి నడక మార్గంలో మంగళవారం (జనవరి 14) తిరుమల చేరుకున్న నితీష్‌కు టీటీడీ పాలకవర్గం ఘనస్వాగతం పలికింది. నితీష్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు (Nitish Climbs Tirumala stairs on Knees).
ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నితీష్ బ్యాట్‌తో అదరగొట్టాడు. ఈ సిరీస్ లో భారీగా పరుగులు సాధించిన టాప్ బ్యాటర్ల జాబితాలో ఒకడిగా నిలిచాడు. అంతేకాదు మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొని సెంచరీ సాధించాడు. ఆ క్రమంలో పలు రికార్డులను కూడా నెలకొల్పాడు. ఆసీస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన నితీష్‌కు వైజాగ్‌లో ఘన స్వాగతం లభించింది. అభిమానులు భారీ ఎత్తున చేరుకుని నితీష్‌కు స్వాగతం పలికారు.
21 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా సత్తా చాటడానికి ఊవిళ్లూరుతున్నాడు. సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన నితీష్ బంతితో కూడా టీమిండియాకు సేవలు అందించనున్నాడు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఇంగ్లండ్ పర్యటనకు కూడా నితీష్ వెళ్లబోతున్నాడు. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్‌తో టీమిండియా 5 టీ-20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడబోతోంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..