10th Class Exams: తొలి రోజు 99.67% మంది హాజరు
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:10 AM
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు, శుక్రవారం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష 2,650 కేంద్రాల్లో సాఫీగా జరిగింది. మొత్తం 4.95 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 99.67 హాజరు శాతం నమోదైనట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. పరీక్షలపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు
నాన్నను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగి పలు చోట్ల పరీక్ష రాసిన విద్యార్థినులు
మంచిర్యాలలో తెలుగు ప్రశ్నపత్రం బదులు హిందీ పేపర్ బండిల్
నల్లగొండలో వాట్సా్‌పలో ప్రశ్నపత్రం!
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు, శుక్రవారం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష 2,650 కేంద్రాల్లో సాఫీగా జరిగింది. మొత్తం 4.95 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 99.67 హాజరు శాతం నమోదైనట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసే విధంగా పరీక్షలపై దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశ్నపత్రాల ఫొటోలను కొందరు వాట్సా్‌పలో సర్క్యులేట్ చేసి విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు.
వాట్సా్‌పలో ‘పది’ తెలుగు ప్రశ్నపత్రం
నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో శుక్రవారం వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్నం చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవగా, అరగంటకే స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం ప్రత్యక్షమైందన్న విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలిసింది. వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న ప్రశ్నపత్రాన్ని నల్లగొండ డీఈవో బిక్షపతి శాలిగౌరారం ఎంఈవో సైదులుకు వాట్సాప్ చేశారు. వెంటనే ఆర్డీవో, ఇతర అధికారులు గీతాంజలి స్కూల్ పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. డీఈవో వాట్సా్‌పలో పంపిన పేపర్‌పై ఉన్న వాటర్ మార్క్ నంబరు శాలిగౌరారం మండలంలోని మూడు పరీక్ష కేంద్రాల్లోని నంబరుతో కలవకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో జిల్లాలోని అన్ని సెంటర్ల వద్ద విద్యాశాఖ, రెవెన్యూ అధికారులు, పోలీసులు తనిఖీలు చేశారు. చివరకు నకిరేకల్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో విధుల్లో ఉన్న వ్యక్తి ఒకరు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సా్‌పలో వేరేవారికి పంపారని, అది అక్కడి నుంచి ఇతర గ్రూపులకు వెళ్లిందని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ అంశంపై నల్లగొండ ఆర్డీవో అశోక్‌రెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా తాను శాలిగౌరారంలోని కేంద్రాల వరకే తనిఖీ చేశానని, అక్కడ ఎలాంటి పేపర్ లీక్ కాలేదని, నకిరేకల్ విషయం తనకు తెలియదని చెప్పారు. కాగా, నకిరేకల్‌లోని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు విద్యా శాఖకు సిఫారసు చేసినట్లు సమాచారం.
తండ్రి మరణించిన బాధలోనూ..
ఏడాదంతా కష్టపడి చదివిన ఆ విద్యార్థినులకు ఎక్కడ లేని కష్టం వచ్చింది. పదో తరగతి పరీక్షల తొలి రోజే కన్న తండ్రిని పోగొట్టుకొన్నారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి పరీక్షలు రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం తిలక్‌నగర్‌లో తండ్రిని కోల్పోయిన బాధలోనూ అక్కాచెల్లెళ్లు హర్షిత, ప్రియ శుక్రవారం పరీక్ష రాశారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో శ్రీలత, నారాయణపేటలో అంజమ్మ కూడా వారి తండ్రులను కోల్పోయిన బాధలోనూ పరీక్ష రాశారు. ఇక కూకట్‌పల్లిలోని ఓ ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థికి ఫీజు కట్టలేదన్న కారణంతో హాల్‌టికెట్ ఇవ్వలేదు. అతని తండ్రి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా న్యాయసేవా సంస్థను సంప్రదించగా.. సీనియర్ సివిల్ జడ్జి డి.కిరణ్‌కుమార్ వెంటనే పాఠశాలకు ఫోన్ చేసి హాల్ టికెట్ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు మంచిర్యాలలోని బాలుర పాఠశాలలో పదో తరగతి పరీక్ష తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రాల కట్ట రావడంతో గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్ పరీక్ష కేంద్రానికి చేరుకొని, బోర్డు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సూచనలతో పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచిన పెట్టెల నుంచి తెలుగు ప్రశ్నపత్రాలు ఉన్న ట్రంకు పెట్టెను తీసుకొచ్చారు. దీంతో విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సమయం ఇచ్చారు. వారికి స్నాక్స్, తాగునీరు అందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులను కలెక్టర్ సస్పెండ్ చేశారు.