Ipupuva Laddu: ఇప్పపువ్వు లడ్డూ!
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:15 AM
ఇప్పపువ్వు లడ్డూ తయారీకి సంబంధించిన ప్రత్యేక పరిశ్రమను ఆదివాసీ మహిళల ఉపాధి కోసం ఆదిలాబాద్‌లో స్థాపించారు. ఇవి గిరిజన బాలికల రక్తహీనతను నివారించడంలో సహాయపడుతున్నాయి. 2019లో ప్రారంభించిన ఈ పరిశ్రమ ద్వారా గిరిజన మహిళలు ఉపాధి పొందుతున్నారు, మరియు ప్రతి బుధ, శుక్రవారాల్లో రక్తహీనత నివారణ కోసం లడ్డూలను బాలికలకు ఇవ్వబడుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో తయారు చేస్తున్న ఆదివాసీ మహిళలు
కిలో 400.. నెలకు 8లక్షల అమ్మకాలు
ఈ లడ్డూతో రక్తహీనత సమస్యకు చెక్
ఆరోగ్య పోషణమిత్రలో భాగంగా విద్యార్థినులకు సరఫరా
లడ్డూ తయారీకి మోదీ ప్రశంసలు
ఉట్నూర్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ఇప్పపువ్వుతో లడ్డూ! రుచికి రుచి.. అద్భుతమైన పోషక విలువలున్న ఈ మిఠాయి కావాలంటే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో ఆదివాసీ మహిళలు ఈ లడ్డూలను తయారు చేస్తున్నారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. ఇప్పపువ్వు లడ్డూను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆదివాసీ మహిళలను ప్రశంసించడం గమనార్హం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన బాలికల్లో రక్తహీనత సమస్య ఎక్కువ. ఆదివాసీ మహిళలు సాధారణంగా ఇళ్లలో ఇప్పపువ్వు లడ్డూ తయారు చేసుకోవడం.. ఆ మిఠాయిలోని పోషక విలువల ద్వారా రక్తహీనత సమస్యకు చెక్‌పెట్టే అవకాశం ఉండటంతో లడ్డూ తయారీ కోసమే ప్రత్యేకంగా ఓ పరిశ్రమ పెడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన ఐటీడీఏ అధికారులు చేశారు. అలా గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన దివ్య దేవరాజన్ చొరవతో 2019లో ఉట్నూర్ ఎక్స్‌రోడ్డులో రూ.14 లక్షలతో ఆదివాసీల ఆహార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆదివాసీ భీంబాయి మహిళా గ్రూప్‌నకు చెందిన 12మంది గిరిజన మహిళా సంఘం సభ్యులు ఇప్పపువ్వు లడ్డూలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పపువ్వును సేకరించి.. నెయ్యి, బెల్లం బాదంపప్పు, జీడిపప్పు, నువ్వులు, పల్లీలు సమపాళ్లలో కలిపి లడ్డూలను తయారు చేస్తున్నారు. తయారీ కోసం సరుకులను సొంతంగానే సమకూర్చుకుంటున్నారు.
కిలో లడ్డూలను రూ.400కు విక్రయిస్తున్నారు. గిరిజన బాలికల్లో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య పోషణమిత్ర పథకంలో భాగంగా ప్రతి బుధ, శుక్రవారాల్లో తలా రెండు లడ్డూల చొప్పున ఇస్తున్నారు. ఈ లడ్డూ తయారీ గిరిజన మహిళలకు మంచి ఉపాధిగా మారింది.
ప్రధాని ప్రశంసించడం సంతోషంగా ఉంది
ఇప్పపువ్వుతో మేం తయారు చేస్తున్న లడ్డూల గురించి ప్రధాని మోదీ ప్రశంసించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ లడ్డూతో గిరిజన బాలికల్లో రక్తహీనత సమస్య తగ్గుతోంది. ఐటీడీఏ అధికారులు ఇప్పపువ్వు లడ్డూలను కొనుగోలు చేయడంతో మహిళలకు ఉపాధి లభిస్తోంది. ప్రతినెల రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల విలువైన అమ్మకాలు జరుగుతున్నాయి. ఖర్చులు పోనూ సభ్యులందరికీ తలా రూ.20 వేలదాకా ఆదాయం మిగులుతోంది.
- భాగుబాయి, ఆదివాసీ
ఆహార కేంద్రం అధ్యక్షురాలు, ఉట్నూర్
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News