ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:26 AM
ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని వైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ కాల్వ సుజాత పిలుపునిచ్చారు.
వైశ్య కార్పొరేషన్ చైౖర్మన్ కాలువ సుజాత
నార్కట్‌పల్లి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని వైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ కాల్వ సుజాత పిలుపునిచ్చారు. చట్టసభల్లో ఆర్యవైశ్యుల ప్రాతినిధ్యం పెరగాలని ఆమె ఆకాంక్షించారు. నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని వాసవీ భవన్‌లో ఆదివారం రాత్రి జరిగిన నార్కట్‌పల్లి మండల ఆర్యవైశ్య మహాసభ నూతన మండల, పట్టణ, యువత, మహిళా కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. నూతనంగా పదవీ ప్రమాణం చేసిన వారంతా మీకంటే ముందు పనిచేసిన సంఘ నాయకుల సలహాలు సూచనలు తీసుకుని వాసవీభవన్ అభివృద్దితో పాటు వైశ్యుల సంక్షేమానికి పాటుపడాలన్నారు. వ్యాపార క్షేత్రంతో పాటు ప్రజాక్షేత్రంలో కూడా ఆర్యవైశ్యులు తమ ప్రభావాన్ని చూపించాలని పిలుపునిచ్చారు. పోటీతత్వం సరైందే కానీ అది వైశ్య సమాజ అభివృద్దికి దోహదపడేలా ఉండాలని కాలువ సుజాత సూచించారు. సమాజంలో అన్ని కులాలు సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేస్తుంటే ఆర్యవైశ్యులు మాత్రం అడగరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులగణన చేసిందని అందులో వైశ్య జనాభా గణన కూడా ఉన్నందున రాబోయే రోజుల్లో జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో ఆర్యవైశ్యుల ప్రాతినిధ్యం పెరగవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల కులదేవత వాసవీ మాత ఆలయ నిర్మాణానికి కావల్సిన స్థలం కోసం స్థానిక ఎమ్మెల్యే సహకారంతో జిల్లా మంత్రి, దేవదాయ శాఖ మంత్రిని కలిసి మంజూరు చేయిస్తానని కాలువ సుజాత హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు తేరటుపల్లి చంద్రశేఖర్, కాచం సుష్మ, నాంపల్లి భాగ్య, లక్ష్మిశెట్టి శ్రీనివాస్, ఎల్‌వీ కుమార్, కోటగిరి దైవాదీనం, గుండా నాగరాజు, వనమా మనోహర్, స్థానిక సంఘ నాయకులు పాల్వాయి భాస్కర్‌రావు, సల్లా వాసుదేవ్, రంగా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.