Share News

Fugitive Riaz Arrested: కానిస్టేబుల్‌ను చంపి పరారైన రియాజ్‌ అరెస్టు

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:18 AM

నిజామాబాద్‌లో సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను హత్య చేసి శుక్రవారం రాత్రి పరారైన పాతనేరస్థుడు రియాజ్‌ను పోలీసులు ఆదివారం మధ్యాహ్నం పట్టుకున్నారు....

Fugitive Riaz Arrested: కానిస్టేబుల్‌ను చంపి పరారైన రియాజ్‌ అరెస్టు

  • సారంగపూర్‌ శివారులో ఆదివారం మధ్యాహ్నం చిక్కిన పాత నేరస్థుడు

  • పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తీవ్ర యత్నం

  • ఈ క్రమంలో ఓ యువకుడిపై కత్తితో దాడి

నిజామాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌లో సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను హత్య చేసి శుక్రవారం రాత్రి పరారైన పాతనేరస్థుడు రియాజ్‌ను పోలీసులు ఆదివారం మధ్యాహ్నం పట్టుకున్నారు. అయితే, తనని వెంబడిస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రియాజ్‌ తీవ్రంగా ప్రయత్నించాడు. పోలీసుల నుంచి పారిపోతున్న తనని అడ్డుకోబోయిన ఓ యువకుడిపై కత్తితో దాడి కూడా చేశాడు. వివరాలిలా ఉన్నాయి. పలు కేసుల్లో నిందితుడైన రియాజ్‌ను బైక్‌ దొంగతనం కేసులో అరెస్టు చేసిన సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ ద్విచక్రవాహనంపై అతడిని పోలీసుస్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశాడు. కానీ, మార్గమధ్యలో ప్రమోద్‌ను పొడిచి చంపి రియాజ్‌ పరారయ్యాడు. అప్పట్నించి రియాజ్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే, సారంగపూర్‌ కెనాల్‌ శివారులోని పొలాల్లో రియాజ్‌ దాక్కొని ఉన్నాడనే సమాచారంతో శనివారం రాత్రి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన రియాజ్‌.. వారికి చిక్కకుండా ఉండేందుకు రాత్రంతా ఓ పాడైన లారీ క్యాబిన్‌లో దాక్కున్నాడు. ఎంత వెతికినా రాత్రి జాడ తెలియకపోవడంతో ఆదివారం ఉదయం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. పోలీసులు తనని సమీపిస్తున్న విషయాన్ని గమనించిన రియాజ్‌ లారీ క్యాబిన్‌లో నుంచి దూకి పరుగులు తీశాడు. రహదారిపైకి వచ్చి అటుగా వచ్చిన ఆసిఫ్‌ అనే ద్విచక్రవాహనదారుడిని లిఫ్ట్‌ అడిగి అతడితో కొద్ది దూరం వెళ్లారు. గమనించిన పోలీసులు కేకలు వేయడంతో బైక్‌ ఆపేసిన ఆసీఫ్‌.. రియాజ్‌ను పట్టుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పెనుగులాట జరగ్గా.. ఆసి్‌ఫపై కత్తితో దాడి చేసిన రియాజ్‌ తీవ్రంగా గాయపరిచాడు. పెనుగులాటలో రియాజ్‌ కూడా పడిపోగా అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రియాజ్‌తోపాటు ఆసి్‌ఫను ఆస్పత్రికి తరలించారు. కాగా, పోలీసులు రియాజ్‌ను ఎన్‌కౌంటర్‌ చేశారనే ప్రచారం జరగ్గా.. ఆ వార్తలను నిజామాబాద్‌ సీపీ సాయిచైతన్య ఖండించారు.

Updated Date - Oct 20 , 2025 | 04:18 AM