K Narayana: చౌకబారు ప్రకటనల్లో నటించొద్దు!
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:44 AM
యువతను నాశనం చేసే బెట్టింగ్ యాప్‌లు, సమాజాన్ని చెడగొట్టే వాణిజ్య ప్రకటనలను సినీనటులు ప్రోత్సహించవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సూచించారు.

కాసుల కోసం కక్కుర్తి పడకండి
బెట్టింగ్ యాప్‌లకు ఎంతో మంది బలయ్యారు
గతంలో చిరంజీవికి వద్దని చెబితే మానేశాడు
హీరో అంటే అలా ఉండాలి: సీపీఐ నారాయణ
న్యూఢిల్లీ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): యువతను నాశనం చేసే బెట్టింగ్ యాప్‌లు, సమాజాన్ని చెడగొట్టే వాణిజ్య ప్రకటనలను సినీనటులు ప్రోత్సహించవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సూచించారు. డబ్బుల కోసం కక్కుర్తి పడి చౌకబారు ప్రకటనల్లో నటించవద్దని హితవు పలికారు. తెలియక చేశామని, చట్ట పరంగా అవకాశం ఉన్నందున చేశామని కొంత మంది చెప్పడాన్ని తప్పుపట్టారు. సినిమా వాళ్లను ఎక్కువ మంది అనుసరిస్తూ ఉంటారని గుర్తుచేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్‌లు, గుట్కాల వంటి ప్రకటనలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. బెట్టింగ్ యాప్‌ల వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. చిరంజీవి ఒక కూల్ డ్రింక్ ప్రకటనలో నటిస్తే తాను వద్దని వారించానని, ఆపకపోతే ధర్నా చేస్తానని హెచ్చరించానని తెలిపారు.
ఓ వైపు రక్తదానం చేస్తూ, మరోవైపు రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రోత్సహిస్తారని అడిగినట్లు చెప్పారు. కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత ఆయన మళ్లీ ఆ ప్రకటన చేయలేదన్నారు. ఎంత డబ్బులిస్తామన్నా ఆయన అంగీకరించలేదని, హీరో అంటే అలా ఉండాలని నారాయణ పేర్కొన్నారు. గుట్కా ఆహారంలో భాగమేనని ఓ తీర్పు వచ్చిందని, దాన్ని ఆసరాగా చేసుకుని పాన్ పరాగ్ పేరుతో ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీ్‌సలు, ఓటీటీ.. ఇలా ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయని, వాటిని వదిలేసి పాడు సంపాదన ఎందుకని ప్రశ్నించారు. ఇకనైనా చౌకబారు ప్రకటనలు చేయొద్దని సూచించారు. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలన్నారు. సినిమా వాళ్లు చెబుతున్నారని ప్రజలు ప్రభావితం కావొద్దని, ఆలోచనతో వ్యవహరించాలని సూచించారు.