SLBC tunnel collapse: టన్నెల్‌లో మృతదేహాల వెలికితీతకు సలహాల కోసం 12 మంది కమిటీ
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:00 AM
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ శిథిలాల నుంచి మిగిలిన ఆరుగురు మృతదేహాలను వెలికితీయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 12 మందితో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ కమిటీ సురక్షిత మార్గాలపై సలహాలు ఇవ్వనుంది.
హైదరాబాద్, ఏప్రిల్, 16(ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోని మృతదేహాలను వెలికి తీసేందుకు సలహాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం 12 మందితో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఫిబ్రవరిలో 14వ కి.మీ వద్ద టన్నెల్ పైకప్పు కూలడంతో 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికి తీయగా, ఇంకా ఆరుగురి మృతదేహాలు లోపలే ఉన్నాయి.ఈ నేపథ్యంలో మార్చి 24వ తేదీన నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి శిథిలాల కింద ఉన్న ఆరు మృతదేహాలను బయటకు తీయాలని ఆదేశించారు. సురక్షిత మార్గాల అన్వేషణకు సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. దాంతో 12 మందితో కమిటీ ఏర్పాటు చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది.