అంచలంచెలుగా ఎదుగుతూ..
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:17 PM
తొలుత మున్సిపాలిటీగా..ఆ తరువాత జిల్లాగా.. ఇప్పుడు కా ర్పొరేషన్‌గా మంచిర్యాల పట్టణ దినాదినాభివృద్ధి చెం దుతూ వస్తోంది. జిల్లా ఇటు వాణిజ్య పరంగా అటు అక్షరాస్యతలోనూ పేరు ప్రఖ్యాతలు గడిస్తోంది.
- కార్పొరేషన్‌గా మంచిర్యాల
-తొలిసారిగా 1956లో బల్దియాగా ఏర్పాటు
-వ్యాపారానికి కేంద్ర బిందువైన నగరం
-అందుబాటులో ప్రధాన రైలు మార్గం
-జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ తరువాత వేగంగా అభివృద్ధి
===================
మంచిర్యాల, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): తొలుత మున్సిపాలిటీగా..ఆ తరువాత జిల్లాగా.. ఇప్పుడు కా ర్పొరేషన్‌గా మంచిర్యాల పట్టణ దినాదినాభివృద్ధి చెం దుతూ వస్తోంది. జిల్లా ఇటు వాణిజ్య పరంగా అటు అక్షరాస్యతలోనూ పేరు ప్రఖ్యాతలు గడిస్తోంది.
మున్సిపాలిటీగా ఏర్పడ్డ 69 ఏళ్ల తరువాత నగర పాలక సంస్థగా అవతరించింది. 1956లో మున్సిపాలిటీగా అవతరించిన మంచిర్యాలను అంతకు ముందు గర్మిళ్లగా పిలిచేవారు. గోదావరి నది ఉత్తరం వైపు ఒడ్డున కేంద్రీకృతమై ఉన్న మంచిర్యాల నగరం నివా స యోగ్యానికి అత్యంత అనువైన ప్రాంతం. 35 కిలీమీటర్ల వైశాల్యంతో ఉన్న మంచిర్యాల నగరపాలక సంస్థలో దాదాపు 2 లక్షల 87వేల పై చిలుకు జనా భా ఉంది. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో భాగమైన మంచిర్యాల ప్రాంతం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత 2016లో ప్రత్యేక జిల్లాగా అవతరించింది. అప్పటి నుంచి పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందు తోంది. మంచిర్యాల నగరపాలక సంస్థలో నస్పూర్ మున్సిపాలిటీతోపాటు హాజీపూర్ మండలంలోని వేం పల్లి, కొత్తపల్లి, ముల్కల్ల, గుడిపేట, నర్సింగాపూర్, నంనూరు, చందనాపూర్ గ్రామాలను విలీనం చేస్తూ నగర పాలక సంస్థగా ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రం రాజకీయాలకు పెట్టింది పే రు. ప్రస్తుత ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, గడ్డం అరవిందరెడ్డి, దివంగత గోనె హన్మంతరావు, మాజీ ఎంపీ గడ్డం నర్సింహారెడ్డి ఇక్కడి వారే కావడం రాజకీయాలకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తాయి. అప్పటి లక్షెట్టిపేట అసెంబ్లీ నియోజక వర్గంలోనూ మంచిర్యాల పట్టణం నుంచే ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వ హించడం గమనార్హం. మంచిర్యాల చుట్టు పక్కల బొగ్గు బావులు, సిరామిక్ ఇండస్ట్రీలు, విద్యుత్ పరిశ్రమలు, సున్నపురాయి గనులు ఉండటంతో పారిశ్రామికంగా సైతం అభివృద్ధి దశలో పయనిస్తోంది.
అక్షరాస్యతలోనూ మేటి...
పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోనే మంచిర్యాల పట్టణానికి ఎడ్యుకేషన్ హబ్‌గా పేరు ప్రఖ్యాతులు ఉ న్నాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతం (ప్రస్తుత మం చిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు)లోనే కేజీ టూ పీజీ విద్య లభించే ఏకైక ప్రాంతం మంచిర్యాల నగరం. స్థానికంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలు అధికంగా ఉండటంతో జిల్లాతోపాటు పొరుగు జిల్లా ఆసిఫాబాద్ నుంచి సైతం అధిక సంఖ్యలో విద్యార్థులు ఇ క్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తుంటారు. అక్షరాస్యతలో జాతీయస్థాయి సగటు రేటు కంటే అధనంగా నమోదు కావడం గొప్ప విషయం. 2011 జనాభా లె క్కల ఆధారంగా జాతీయ అక్షరాస్యతా రేటు 64.35 శాతంగా ఉంది. ప్రస్తుతం 77 శాతం వరకు అక్షరా స్యతా ఉంటుందని అంచనా.
ప్రధాన రైలు మార్గంతో వాణిజ్య కేంద్రంగా....
మంచిర్యాల నగరంలో ప్రధాన దక్షిణ మధ్య రైల్వే మార్గం ఉండటంతో వ్యాపార, వాణిజ్యపరంగా అభి వృద్ధి చెందింది. న్యూఢిల్లీ-సికింద్రాబాద్ ప్రధాన రైలు మార్గం ఉండటంతో నిత్యం ఈ ప్రాంతం గుండా పదుల సంఖ్యలో ప్యాసింజర్ రైళ్లు ప్రయాణిస్తుంటా యి. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు రాకపోకలు సాగిస్తుండటంతో వాణిజ్యపరంగానూ పేరు ప్ర ఖ్యాతులు గడించింది. మంచిర్యాల నగరానికి జిల్లా ప్రజలతోపాటు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మం థని, తదితర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది వ్యాపారం, ఇతర పనుల నిమిత్తం వస్తుంటారు. వైద్యపరంగా సైతం మంచిర్యాలకు మంచి పే రు ఉంది. ప్రస్తుతం ఇక్కడ అధునాతన వైద్య సౌకర్యాలున్న కార్పొరేటు ఆసుపత్రులు, ఇతర వైద్యశాలలతోపాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం అందుబాటులో ఉండటంతో మం చిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని సిరొంచ తాలుకాకు చెందిన ప్రజలు చికిత్స కోసం వస్తుంటారు. త్వరలో 350 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కళాశాలకు అనుబంధంగా మరో 350 పడకల ఆసుపత్రి కూడా ఏర్పాటు కానుండటంతో మరిన్ని ఉన్నత వైద్య సేవలు అందనున్నాయి.
నెరవేరిన దశాబ్ధాల కల..
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడటం తో ప్రజల దశాబ్ధాల కల నెరవేరినట్లయింది. ము ఖ్యంగా ఆరేడు సంవత్సరాలుగా కార్పొరేషన్ అంశం ప్రజలను ఊరిస్తూ వస్తోంది. నస్పూర్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలను విలీనం చేస్తూ మంచిర్యాలను కా ర్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తామని 2019 మార్చిలో గో దావరిఖని పర్యటనకు వచ్చిన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంచిర్యాల పట్టణ కేంద్రంగా నగర పాలక సంస్థగా ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మంచిర్యాలను నగర పాలక సంస్థగా మార్చేందుకు జనాభా, ఆర్థిక ప్రాముఖ్యతపై రిపోర్టు ఇవ్వాలని 2019 ఏప్రి ల్ 23న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అర వింద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఐదే ళ్లు గడిచినా కేసీఆర్ హామీ నెరవేరకపోగా, మంచిర్యా ల ప్రస్తుత ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్రత్యేక కృషితో ప్రజల కల సాకారమైంది.
చైర్మన్లుగా 11 మంది పదవుల అలంకరణ...
మంచిర్యాల మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 11 మంది చైర్మన్ పదవిని అలంకరించారు. కార్పొరేషన్ గా తొలి ఎన్నికలు 12వ చైర్మన్ పదవి కోసం జరు గనున్నాయి. మున్సిపల్ ప్రథమ చైర్‌పర్సన్‌గా పట్టణానికి చెందిన కేవీ రమణయ్య పదవిని అలంకరించగా 1956 నుంచి 1957 వరకు కొనసాగారు. 1957 నుంచి 1959 వరకు శ్రీరామోజు లక్ష్మీకాంతం, 1959 -1962 ముత్తినేని అర్జున్‌రావు, 1963 -1971 గడ్డం నర్సింహారెడ్డి పదవులు అలంకరించారు. అనంతరం 1971-1982 వరకు ప్రత్యేకాధికారి పాలన విధించా రు. 1982- 1985 వరకు చల్లూరి చంద్రయ్య చైర్మన్ గా వ్యవహరించగా, 1985-1986 కొప్పుల రాజలింగు, 1986-1987 తిరిగి ప్రత్యేకాధికారి పాలన, 1987 -1992 వరకు రాచకొండ కృష్ణారావు, 1992 -1995 వరకు ప్రత్యేకాధికారి పాలన, 1995 -2000 రాచకొండ కృష్ణారావు, 2000-2005 మంగీలాల్ సోమాని, 2005 - 2005 ప్రత్యేకాధికారి పాలన, 2005 - 2010 రాచకొండ కృష్ణారావు, 2010-2014 ప్రత్యేకాధికారి పాలన, 2014 నుంచి 2019 వరకు మామిడిశెట్టి వసుంధర, 2019 నుంచి 2023 వరకు పెంట రాజయ్య, 2023 నుంచి 2024 వరకు సంవత్సరం పాటు రావుల ఉ ప్పలయ్య చైర్మన్ పదవిని అలంకరించారు. కాగా 2025 ఫిబ్రవరి 27న కౌన్సిల్ పదవీకాలం ముగియ డంతో ఆ రోజు నుంచి ప్రత్యేకాధికారి పాలన కొనసాగుతోంది.