DK Aruna: డీకే అరుణ ఇంట్లోకి ఎందుకొచ్చాడు?
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:22 AM
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా డీకే అరుణకు ఫోన్ చేసి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా తన ఇంటికి అదనపు భద్రత కల్పించాలని డీకే అరుణ కోరగా.. సీఎం అందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.

గంటన్నర పాటు దేనికోసం వెతికాడు??
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
నిందితుడు పాతనగరానికి వెళ్లినట్లు గుర్తింపు
సీసీ కెమెరాల్లో దృశ్యాల సేకరణ
డీకే ఇంటిని సందర్శించిన సీపీ సీవీ ఆనంద్
ఫోన్‌లో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి
బంజారాహిల్స్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): డీకే అరుణ ఇంట్లోకి చొరబడిని ఆగంతుకుడు గంటన్నర పాటు ఏం చేశాడు? దేనికోసం వెతికాడు? వస్తువులేమీ చోరీ చేయకుండా ఎందుకు తిరిగి వెళ్లిపోయాడు? అతని ఉద్దేశమేమిటి? అనే కోణాల్లో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3.42 సమయంలో.. ఓ ఆగంతుకుడు జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 56లో నివసించే డీకే అరుణ నివాసంలోకి చొరబడ్డ విషయం తెలిసిందే..! వంటింటి కిటికీని తొలగించి, లోనికి ప్రవేశించిన దుండగుడు.. దేనికోసమో వెతికి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మొదటి అంతస్తులో ఉన్న బెడ్‌రూంలో సుమారు అరగంటపాటు వెతికి.. అక్కడి వస్తువులను చిందరవందర చేశాడు. ఇంట్లోకి ప్రవేశించే ముందే.. సీసీకెమెరాల వైర్లను తొలగించాడు.
దీన్ని బట్టి.. అతను ఈ ఇంటికి కొత్తవాడు కాకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం హైదరాబాద్ సీసీ కెమెరాలను జల్లెడపట్టగా.. ఆ దుండగుడు పాతనగరం వైపు పారిపోయినట్లు నిర్ధారించారు. సీసీ కెమెరాల ఫుటేజీల్లో ఆగంతుకుడి ముఖం స్పష్టంగా కనిపిస్తున్నట్లు సమాచారం. కాగా.. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం డీకే అరుణ ఇంటిని పరిశీలించారు. సిబ్బందిని అడిగి.. ఆగంతుకుడు ఎలా వచ్చాడు? ఎటువైపు నుంచి పారిపోయాడు? అనే వివరాలను తెలుసుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా డీకే అరుణకు ఫోన్ చేసి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా తన ఇంటికి అదనపు భద్రత కల్పించాలని డీకే అరుణ కోరగా.. సీఎం అందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.