Nalgonda acid attack: ఎస్టీ మహిళపై హత్యాయత్నం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:02 AM
నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఒక ఎస్టీ మహిళపై యాసిడ్ దాడికి పాల్పడిన మహేశ్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. హత్యాయత్నానికి పదేళ్లు, యాసిడ్ దాడికి మరో పదేళ్లుగా శిక్షను తీర్పులో పేర్కొంది.
నల్లగొండ టౌన్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ఓ ఎస్టీ మహిళను వేధించి యాసిడ్‌తో దాడి చేసి చంపేందుకు యత్నించిన నిందితుడికి తగిన శాస్తి జరిగింది. హత్యాయత్నానికి పదేళ్లు, యాసిడ్ దాడి చేసినందుకు మరో పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి రోజారమణి తీర్పునిచ్చారు. ఎస్పీ శరత్‌చంద్ర వివరాల మేరకు.. నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన మహిళ (ఎరుకల-ఎస్టీ) భర్తతో మనస్పర్థల కారణంగా పుట్టింటి వద్దే ఉంటూ కూలీ పనులు చేసుకుంటోంది. అదే గ్రామానికి చెందిన బచ్చనబోయిన మహేశ్ యాదవ్ అలియాస్ పిట్టల మహేశ్ ఆమెను లైంగికంగా వేధించేవాడు. 2018 అక్టోబరు 13న బాధితురాలు నిద్రిస్తుండగా మహేశ్ ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా పక్కనే ఉన్న పత్తి చేలలోకి లాక్కెళ్లాడు. ఆమె ప్రతిఘటించటంతో వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను పోసి చంపేందుకు యత్నించాడు. బాధితురాలు తప్పించుకుని మరుసటి రోజు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో 2019లో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రస్తుత నాంపల్లి ఎస్సై శోభన్‌బాబు సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం నిరూపణ అయింది. హత్యాయత్నం కేసులో 10 ఏళ్లు, రూ.1000 జరిమానా, యాసిడ్ దాడికి యత్నించినందుకు మరో 10 ఏళ్లు, వెయ్యి జరిమానా విధిస్తూ రెండూ ఏకకాలంలో అనుభవించాలని కోర్టు తీర్పునిచ్చింది.