Share News

New Ration Cards: 5 లక్షల కొత్త రేషన్‌ కార్డులు

ABN , Publish Date - Apr 01 , 2025 | 05:05 AM

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల ఎంపిక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పౌర సరఫరాల శాఖ ప్రకారం, ఎలాంటి ఆలస్యాలు లేకుండా ఈ ఏప్రిల్‌లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు జారీ అవుతాయని వెల్లడించారు.

New Ration Cards: 5 లక్షల కొత్త రేషన్‌ కార్డులు

ఇప్పటి వరకు 1.26 లక్షల లబ్ధిదారుల ఎంపిక.. మరో 4.32 లక్షల అర్జీలపై అధికారుల కసరత్తు

ఈ నెలలోనే కార్డుల పంపిణీ పూర్తయ్యే అవకాశం

జాబితాలో పేరుంటే ఈ నెల నుంచే సన్న బియ్యం

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల లబ్ధిదారుల ఎంపిక క్రమంగా కొలిక్కి వస్తోంది. కాంగ్రెస్‌ ప్రభు త్వం ఏర్పడిన 16 నెలల నుంచి పేదలు రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తుండగా.. ఈ ఏప్రిల్‌తో లబ్ధిదారుల ఎంపిక, కార్డులజారీ ప్రక్రియ పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తూనే.. మరోవైపు లబ్ధిదారుల లెక్క తేల్చే పనిలో పౌరసరఫరాల శాఖ నిమగ్నమైంది. అయితే కొత్త కార్డుల జారీ ప్రక్రియ కాస్త ఆలస్యమైనా.. లబ్ధిదారుల జాబితాలో పేర్లుంటే చాలు.. సన్న బియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించటం ఆశావహులకు ఊరటనిచ్చింది.

రేషన్‌కార్డుల కోసం ప్రజాపాలన, ప్రజావాణి, మీ- సేవ కేంద్రాల్లో సుమారు 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన సర్వేలో కూడా రేషన్‌కార్డులు లేనివారు వివరాలను వెల్లడించారు. కానీ, ఇప్పటి వరకు 1.26 లక్షల మంది లబ్ధిదారులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. ఇంకా లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డునే ప్రాతిపదికగా తీసుకుంటున్న విషయం విదితమే. వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ‘ఎల్‌వోసీ’ (లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌)కి దరఖాస్తు చేసుకోవాలన్నా, ఆస్పత్రి బిల్లులు సమర్పించి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పొందాలన్నా రేషన్‌కార్డు ఉండాల్సిందే. పెళ్లిళ్లు చేసుకొని వేరుగా కాపురాలు పెట్టిన పిల్లలు.. కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, తీసివేతల కోసం పలు కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. దరఖాస్తులు లక్షల సంఖ్యలో రావటంతో వాటిని వడపోసి, అర్హత కలిగిన కుటుంబాలను ఎంపిక చేయటానికి జాప్యమవుతోంది. ఇప్పటి వరకు 1.26 లక్షల కుటుంబాలను ఎంపిక చేశారు. అయితే వీరికి కొత్త కార్డులు జారీ చేయలేదు. లబ్ధిదారుల జాబితాలో మాత్రం పేర్లున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ 1.26 లక్షల కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఇవికాకుండా మరో 4.32 లక్షల కుటుంబాలపై కసరత్తు చేస్తున్నారు. ఇవికాకుండా 1.50 లక్షల మంది ఒంటరి సభ్యుల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో కొందరు పాత కార్డుల్లోకి వెళ్తారా..? కొత్తగా ఎంపిక చేసిన 1.26 లక్షల జాబితాలోకి వెళ్తారా..? 4.32 లక్షల కార్డుల్లోకి చేరుతారా..? అన్నది పూర్తిస్థాయి కసరత్తు తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే లెక్క తేలుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ కసరత్తు పూర్తయితే 5 లక్షల నుంచి ఐదున్నర లక్షల కుటుంబాల ఎంపిక పూర్తవుతుంది. కానీ దరఖాస్తుల సంఖ్యకు.. ఎంపిక చేసే లబ్ధిదారుల సంఖ్యకు పోల్చి చూస్తే చాలా తేడా ఉంది. సుమారు 10 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. కానీ ఇందులో 50 నుంచి 55 శాతం వరకే కార్డులు పంపిణీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు మీ-సేవ కేంద్రాలతోపాటు, ప్రతి సోమవారం కలెక్టర్లు నిర్వహించే ప్రజావాణిలో ఇప్పటికీ దరఖాస్తులు వస్తున్నాయి. అయితే సమగ్ర కుల గణన సర్వేను ప్రాతిపదికగా తీసుకొని ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.


టెండర్‌ దశలోనే కార్డుల ముద్రణ

కొత్త రేషన్‌ కార్డుల ముద్రణ ఇంకా ప్రారంభం కాలేదు. ‘పీవీసీ క్యూఆర్‌ కోడ్‌ స్మార్ట్‌ రేషన్‌ కార్డుల’ ముద్రణ బాధ్యతలు అప్పగించటానికి ఈ నెల 11న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ టెండర్లు పిలిచింది. అదే రోజు నుంచి టెండరు బిడ్లు స్వీకరిస్తోంది. 17న ప్రీ-బిడ్‌ సమావేశం నిర్వహించింది. టెండర్ల నమోదుకు ఈ నెల 25 వరకు గడువిచ్చి.. టెండర్లు స్వీకరించింది. ఈ ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందో..? లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు పూర్తవుతుందో..? కార్డులు ఎప్పుడు జారీ చేస్తారో..? అని ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ నెల 30 నుంచి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ కోటా నుంచి సన్న బియ్యం వస్తాయా..? లేదా..? అని ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే లబ్ధిదారుల జాబితాలో పేరుంటే చాలు.. సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్‌ ప్రకటించటంతో ఆశావహులు ఊపిరి పీల్చుకున్నారు.


ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 05:07 AM