Viveka Case: వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:46 PM
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కూతురు సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. తండ్రి హత్య కేసు విచారణపై హైకోర్టుకు పలు విజ్ణప్తులు చేశారు. సీబీఐ అధికారులతో పాటు నిందితులను కూడా ఆమె ప్రతివాదులుగా చేర్చారు.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండ్రి హత్య కేసు విచారణపై వివేకా కూతురు సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. రోజూవారి విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆమె కోరారు. ఆరు నెలల్లోగా కేసు విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ణప్తి చేశారు. సీబీఐ అధికారులతో పాటు నిందితులను కూడా ఆమె ప్రతివాదులుగా చేర్చారు. కేసు విచారణ 15 నెలలుగా ముందుకు సాగడం లేదని న్యాయ స్థానానికి తెలిపారు. ఈ పిటిషన్‌పై ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. సీబీఐతో పాటు కేసులో నిందితులుగా ఉన్నవారందరికీ వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చేందుకు సునీత తరపు న్యాయవాదికి అనుమతినిచ్చింది.
కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇక, ఈ కేసులో రెండవ నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ బుధవారం కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ను కలిశారు. తనకు రక్షణ కల్పించాలని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘9 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాక కూడా నరకం అనుభవిస్తున్నాను. జైల్లో పడ్డ ఇబ్బందులపై ఇంతవరకు ఎక్కడా నోరు విప్పలేదు. ఇప్పుడు మాట్లాడుతుంటే కొందరికి నచ్చడం లేదు. గత ప్రభుత్వం వల్లే ఇబ్బందులు పడుతున్నాను. ఆ పార్టీకి చెందిన వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. వారి పేర్లు కూడా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాను. నేను బతుకుతానో లేదో కూడా తెలియదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
Operation Garuda AP: ఏపీలో ఆపరేషన్ గరుడ.. ఖంగుతిన్న మెడికల్‌షాప్
Marri Rajasekhar: నన్ను అవమానించారు.. విడదల రజినీపై మర్రి రాజశేఖర్ ఫైర్