Share News

Cotton seed prices: పత్తి రైతుపై విత్తన భారం

ABN , Publish Date - Apr 01 , 2025 | 05:12 AM

తెలంగాణలో పత్తి రైతులపై విత్తన భారం పెరుగుతోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ లేకపోవడంతో, ప్రైవేటు కంపెనీల నుంచి అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ ఏడాది బీజీ-2 పత్తి విత్తన ప్యాకెట్‌ ధర రూ.901 గా పెరిగింది, గత ఏడాది కంటే రూ.37 అధికం. రైతులు విత్తనాల సరఫరాకు ప్రభుత్వ జోక్యం కోరుతున్నారు.

 Cotton seed prices: పత్తి రైతుపై విత్తన భారం

తాజాగా రూ.864 నుంచి 901కి పెరిగిన ధర

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులపై విత్తన భారం ఏటా పెరుగుతూనే ఉంది. అటు కేంద్రం నుంచి గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ... నయా పైసా సబ్సిడీ లేకపోవడం, ప్రైవేటు విత్తన కంపెనీలు, డీలర్ల నుంచి కొనుగోలు చేయాల్సి రావడం.. రైతులకు శాపంగా మారింది. తాజాగా 2025-26 సంవత్సరానికి బీజీ-2 పత్తి విత్తన ప్యాకెట్‌ (475 గ్రాములు) ధరను రూ.901 గా నిర్ణయిస్తూ కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. గత ఏడాది(2024-25)ఒక ప్యాకెట్‌ ధర రూ.864 ఉండగా... ఈ ఏడాది రూ.37 అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021-22 లో పత్తి విత్తన ప్యాకెట్‌ ధర రూ.767 ఉండగా, 2022-23లో రూ.810, 2023- 24లో రూ.853, 2024-25లో 864, ఈ ఏడాది రూ.901కి పెరిగింది. రాష్ట్రంలో ఏటా సగటున 50లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఎకరాకు కనీసం రెండు విత్తన ప్యాకెట్లు సరిపోయే అవకాశం ఉన్నా... రైతులు మూడు ప్యాకెట్ల చొప్పున వినియోగిస్తున్నారు. విత్తనాలు నాటిన తర్వాత వర్షాలు సకాలంలో పడకపోయినా, అధిక వర్షాలతో విత్తనాలు మురిగిపోయినా, వరదనీటికి కొట్టుకుపోయినా... రెండోసారి పత్తి విత్తనాలు నాటాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో విత్తనాలకే రూ.2,706 నుంచి రూ.3,604 వరకు రైతులు ఖర్చు చేయాల్సి వస్తోంది.

విత్తన సబ్సిడీకి ఎదురుచూపులు

పత్తి విత్తనాల సరఫరాను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలని వ్యవసాయరంగ నిపుణులు, రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా.. కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విత్తనాభివృద్ధి సంస్థ క్రియాశీలకంగా పనిచేస్తోంది. ఆరు తడి పంటలు, పచ్చిరొట్ట, సోయాబీన్‌ విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. అదేతరహాలో పత్తి విత్తనాలను కూడా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీ చేయాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది.


ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 05:12 AM