Share News

జీతాలు రాక.. వెతలు తీరక

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:15 AM

మూడు నెలలుగా కూలీలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు వే తనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.

  జీతాలు రాక.. వెతలు తీరక
పనులు చేస్తున్న కూలీలు

జీతాలు రాక.. వెతలు తీరక

మూడు నెలలుగా కూలీలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు అందని వేతనాలు

ఇబ్బందులు పడుతున్న శ్రమజీవులు

భారంగా మారిన కుటుంబ పోషణ

పెద్దఅడిశర్లపల్లి,ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): మూడు నెలలుగా కూలీలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు వే తనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. జాతీ య ఉపాధి హామీ పథకంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్న కూలీలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు అందని వేతనాల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించడంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. పనుల ఎంపిక, కూలీలు హాజరయ్యేలా వారిలో చైతన్యం తీసుకరావడం, రిజిస్టర్లలో వివరాల నమోదు వంటి పనులు చేపడుతున్నారు. పథకంలో పక్కాగా నిర్వహించేందుకు ప్రభుత్వం నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎనఎంఎంఎ్‌స)ను గత ఆర్థిక సంవత్సరం ప్రారంభించింది.

కేటగిరీలుగా విభజించి

ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనులకు వచ్చిన కూలీల పేర్లు నమోదు చేసుకుని వారి ఫొటో తీసి యాప్‌లో నిక్షిప్తం చేస్తారు. పని పూర్తయిన తర్వాత మరో దఫా చిత్రం తీసి అందులో పొందుపరిచి బాధ్యతలు వారికి అప్పగించారు. ఇలాంటి వాటిని చేపడుతున్నా సకాలంలో జీతాలు రాక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పని దినాలు కల్పించిన వారికి కేటగిరీలుగా విభజించారు. అత్యధిక కేటగిరీ వారికి నెలకు రూ.12,200, రెండో దశ ఎఫ్‌ఏలకు రూ.9వేలు, మూడో కేటగిరీ చెందిన ఎఫ్‌ఏలకు రూ.7,700 వేతనం నిర్ణయించారు.

14 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు

ఉమ్మడి పీఏపల్లి మండలంలోని 31 గ్రామపంచాయతీల్లో 14 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వారికి జనవరి, ఫిబ్రవరి, మార్చి(నెలల) వేతనాలు అందాల్సి ఉంది. ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్య విన్నవించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బకాయి వేతనాలు విడుదల చేయాలని మండలంలోని ఎఫ్‌ఏలు కోరుతున్నారు. మరో వైపు 8వేల మంది కూలీలుండగా అందులో 4,200 పనులు చేస్తున్నారు. వీరికి సైతం వేతనాలు అందలేదు.

వేతనాలు చెల్లించాలి

పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు వెంటనే విడుదల చేసి సిబ్బంది ఎదుర్కొంటు న్న ఇబ్బందులు తొలగించాలి. రెగ్యులర్‌గా జీతాలు అందకపోవడంతో కుటుంబపోషణ ఇబ్బందిగా మారింది. అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి రెగ్యులర్‌ గా వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి.

- గోలి రవి, ఎఫ్‌ఏ, గుడిపల్లి

ఉన్నతాధికారులకు నివేదించాం

గ్రామాల్లో ఉపాఽధి హామీ లో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు, కూలీలకు సంబంధించిన వేతనాలు పెండింగ్‌ లో ఉన్న మాట వాస్తవం. ఉపాధిహామీ సిబ్బందిలో టెక్నికల్‌ అసిస్టెంట్లకు మిన హా మిగతా వారికి సంబంధించిన వేతనాలు మూడు నెలలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు నివేదించాం.

- ఎం.శ్రీనివాస్‌, ఏపీవో, పీఏపల్లి

Updated Date - Apr 19 , 2025 | 12:16 AM