మే 15 వరకు సెమిస్టర్ పరీక్షలు వాయిదా
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:08 AM
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు మే 15 వరకు వాయిదా పడ్డాయి.
అయోమయంలో డిగ్రీ విద్యార్థులు ఫ మెట్టు దిగని ప్రభుత్వం ఫ పట్టు వీడని యాజమాన్యాలు
భువనగిరి టౌన్, నల్లగొండ, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు మే 15 వరకు వాయిదా పడ్డాయి. 3 సంవత్సరాల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు, ఆరు నెలల బకాయి వేతనాలు చెల్లించాలంటూ లెక్చరర్స్ పరీక్షల బహిష్కరణ అస్త్రం ప్రయోగించడంతో ఈ నెల 11 నుంచి మే 6 వరకు జరుగాల్సిన డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షలు, 1, 3, 5వ సెమిస్టర్స్ సప్లమెంటరీ పరీక్షలను మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఈ నెల 16 వరకు వాయిదా వేసింది. అయినప్పటికీ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం మెట్టు దిగకపోవడం, పరీక్షల బహిష్కరణలో యాజమాన్యాలు పట్టు వీడక పోవడంతో మే 15 వరకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఎంజీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బుధవారం ప్రకటించింది. ఇదే కారణంతో ప్రాక్టికల్స్ జరుగకపోగా థియరీ పరీక్షలు కూడా వాయిదా పడడంతో డిగ్రీ విద్యార్ధులు ఆంధోళనకు గురవుతున్నారు. పరీక్షలు వాయిదా పడుతుండడంతో 6వ సెమిస్టర్ పరీక్షలు రాయాల్సిన విద్యార్ధులు ఉన్నత విద్యలో ప్రవేశాలకు నిర్వహించే ఐ-సెట్, సీపీజీఈటి, లా-సెట్ తదితర అర్హత పరీక్షలపై వత్తిడికి గురవుతున్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాల్సింది ప్రభుత్వం, పరీక్షలను నిర్వహించాల్సింది యాజామాన్యాలు కావడంతో ఇరువర్గాలు కూడా ఎవరికి వారు పట్టుదలగా ఉండడంతో పరీక్షల నిర్వాహణపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి యూనివర్సీటీ వంతైంది. అయితే కళాశాలలకు రావాల్సిన రూ.100 కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేసి పరీక్షలను నిర్వహించి విద్యార్ధులు భవిష్యత్తును కాపాడాల్సినబాధ్యత ప్రభుత్వానిదేనని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ ప్రైవేట్, డిగ్రీ యాజామాన్యాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డికి, నల్లగొండలో ఎంజీయూ సివోఈ ఉపేందర్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు.