Share News

University Students Protest: రగడ.. రగడగా మారిన హెచ్‌సీయూ భూముల వ్యవహారం..

ABN , Publish Date - Apr 01 , 2025 | 04:37 AM

ప్రభుత్వం, కంచ గచ్చిబౌలి భూమిపై వేలం వేయడానికి ముమ్మరంగా సర్వేలు చేస్తుండగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ భూములు విశ్వవిద్యాలయానికి చెందకపోవడంతో ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును వివరించింది. ప్రభుత్వం ఈ భూమిని పూర్తిగా తన అధీనంలో ఉన్నట్లు స్పష్టం చేస్తోంది.

University Students Protest: రగడ.. రగడగా మారిన హెచ్‌సీయూ భూముల వ్యవహారం..
HCU Issue

కంచ గచ్చిబౌలి భూములు మావే: సర్కార్‌.. కాదు మావే: హెచ్‌సీయూ

534 ఎకరాలను 2004లోనే సర్కారుకు స్వాధీనం చేసిన వర్సిటీ

బదులుగా గోపనపల్లిలో 397 ఎకరాలు హెచ్‌సీయూకిచ్చిన సర్కారు

అప్పట్లోనే ఐఎంజీకి.. న్యాయ వివాదాలు.. ప్రభుత్వ భూములేనన్న సుప్రీం

తర్వాత ఆ భూములు టీజీఐఐసీకి.. స్వాధీనం చేసుకోవాలని సూచన

వర్సిటీ రిజిస్ట్రార్‌ సమ్మతితో నిరుడు సర్వే.. హద్దుల గుర్తింపు: ప్రభుత్వం

టీజీఐఐసీ చెప్పేదంతా అబద్ధం.. సర్వే జరగలే.. హద్దులూ గుర్తించలే

వెనక్కి తీసుకోవాలంటే కమిటీ ఆమోదం తప్పనిసరి: వర్సిటీ రిజిస్ట్రార్‌

నాడు భూములు అమ్మొద్దన్నవ్‌.. నువ్వు చేస్తోందేంటి రేవంత్‌?: కేటీఆర్‌

విద్యార్థినుల జుట్టు పట్టి లాక్కెళ్తారా?.. మానవత్వం లేదా?: బండి

పోలీసుల తీరు గర్హనీయం .. ఖండించిన విద్యార్థి యువజన సంఘాలు

హైదరాబాద్‌, రాయదుర్గం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న కంచ గచ్చిబౌలి భూములపై రగడ కొనసాగుతోంది! రాత్రి పగలు తేడా లేకుండా దాదాపు 50 ఎక్స్‌కవేటర్లతో ఆ భూములను చదును చేసే కార్యక్రమాన్ని సర్కారు ముమ్మరంగా చేస్తుంటే.. ఆ భూములు వర్సిటీవేనని, వాటిని తమకు అప్పగించాలంటూ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులు ఆందోళన తీవ్రం చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ చదును చేసే కార్యక్రమాలను అడ్డుకున్న విద్యార్థులు.. సోమవారం వివిధ రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. వారికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు మద్దతు పలికాయి. వేలాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలోనే, ఆ భూములు ప్రభుత్వానివేనంటూ టీజీఐఐసీ ఆధారాలను బయటపెట్టింది. సోమవారం ఉదయం, సాయంత్రం రెండు ప్రకటనలను విడుదల చేసింది. ప్రస్తుతం వివాదం నెలకొన్న భూములను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హెచ్‌సీయూ స్వాధీనం చేసిందని, దానికి బదులుగా వర్సిటీకి సర్కారు 397 ఎకరాలను బదలాయించిందని స్పష్టం చేసింది. దీనిపై అప్పటి వర్సిటీ రిజిస్ట్రార్‌ సంతకం చేశారని తెలిపింది. సంబంధిత కాపీలను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) విడుదల చేసింది. అయితే, కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ టీజీఐఐసీ చేసిన ప్రకటనను హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ ఖండించారు. దీంతో, ఇప్పుడు ఈ అంశం చర్చనీయంగా మారింది.

fg.gif

హెచ్‌సీయూ భూమి అంగుళం కూడా లేదు

కంచ గచ్చిబౌలిలో వేలానికి ప్రతిపాదించిన 400 ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ (హెచ్‌సీయూ) భూమి లేదని.. ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కు తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా.. కొంత మంది రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు స్వప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఆ భూమికి యజమాని ప్రభుత్వమేనని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది. దానిపై ఎలాంటి వివాదానికి పాల్పడినా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ), విశ్వవిద్యాలయ అధికారుల సమక్షంలో చేపట్టిన సర్వేలో అంగుళం భూమి కూడా యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (సెంట్రల్‌ యూనివర్సిటీ)ది కాదని తేలిందని తేల్చి చెప్పింది. ఆ భూమిలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రణాళికలో ఎలాంటి చెరువులూ లేవని, అక్కడ ఉన్న రాళ్ల రూపాలను సంరక్షిస్తామని తెలిపింది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలోనూ స్థానిక సుస్థిరాభివృద్ధికి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ భూముల వ్యవహారాన్ని వక్రీకరిస్తున్న విషయం టీజీఐఐసీ దృష్టికి వచ్చిన నేపథ్యంలో వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం, టీజీఐఐసీ విడుదల చేసిన ప్రకటనల ప్రకారం.. కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్‌ 25లోని 534 ఎకరాల 28 గుంటల భూమిని హెచ్‌సీయూ శేరిలింగంపల్లి మండల కార్యాలయానికి స్వాధీనం చేసింది. ఈ మేరకు 2004 జనవరి 31న ఉత్తర్వులు (5763/ఎల్‌సీఐ/2003) జారీ చేసింది. అప్పటి శేరిలింగంపల్లి మండల అదనపు గిర్దావర్‌ ఆధ్వర్యంలో ఈ బదలాయింపు జరిగింది. దీనిపై అప్పటి రిజిస్ట్రార్‌ వై.నర్సింహులు, శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారి సంతకాలు చేశారు. దీనికి బదులుగా శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 36లో 191 ఎకరాల 36 గుంటలు, సర్వే నంబరు 37లోని 205 ఎకరాల 20 గుంటలు... మొత్తం 397 ఎకరాల 16 గంటల ప్రభుత్వ భూమిని అదే రోజు యూనివర్సిటీకి బదిలీ చేయడం జరిగింది. దీనిపై కూడా అప్పటి వర్సిటీ రిజిస్ట్రార్‌ వై.నర్సింహులు, శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారి సంతకాలు చేశారు. అప్పుడే యూనివర్సిటీకి భూమిని బదలాయించినందున... ఇప్పుడు సర్వే నంబర్‌ 25లో వర్సిటీకి భూమి ఉందని వాదించడం సరైంది కాదని తెలిపింది.


సుప్రీం కోర్టులోనూ విజయం

కంచ గచ్చిబౌలిలోని ఈ భూములను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించిందని, దీనిపై సుప్రీం కోర్టులో పోరాడి తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని వివరించింది. దాని ప్రకారం.. కంచ గచ్చిబౌలి సర్వే నంబరు 25లోని 400 ఎకరాల భూమిని 2004, జనవరి 13న అప్పటిఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధి నిమిత్తం ఐఎంజీ అకాడమీ్‌సకి కేటాయించింది. భూమిని సొంతం చేసుకున్న తరువాత ఆ సంస్థ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006, నవంబరు 21న రాష్ట్ర ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసి, ఆ భూమిని ఏపీ యూత్‌ అడ్వాన్స్‌మెంట్‌, టూరిజం అండ్‌ కల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించింది. దీంతో ఐఎంజీ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ అనంతరం.. 2024 మార్చి 7న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఆ తీర్పును ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అయితే, 2024 మే 3న ఐఎంజీ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. అనంతరం.. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌, తహసీల్దార్‌ నేతృత్వంలో ఆ భూమిని ప్రభుత్వ భూమిగా (అస్తబల్‌ పోరంబోకు సర్కారీ) నిర్ధారించారు. ఆక్రమణలకు గురికాకుండా పరిశ్రమల అభివృద్ధికి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని టీజీఐఐసీకి సూచించారు. దీంతో ఆ భూమిని తమకు కేటాయించాలని టీజీఐఐసీ 2024 జూన్‌ 19న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి 2024 జూన్‌ 24న ఉత్తర్వులు జారీ చేశారు. శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు ఆ 400 ఎకరాల భూమికి సంబంధించి పంచనామా నిర్వహించి, దాన్ని గత ఏడాది జూలై 1న టీజీఐఐసీకి అప్పగించారు. ఆ భూమి ఉమ్మడి హద్దుల గుర్తింపునకు తమ అధికారులకు సహకరించాలని కోరుతూ టీజీఐఐసీ సైబరాబాద్‌ జోనల్‌ మేనేజర్‌.. నిరుడు జూలై 4న హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు.

gf.gif

జూలై 7న రిజిస్ట్రార్‌ను వ్యక్తిగతంగా కలిసి ప్రతిపాదనలు అందించారు. రిజిస్ట్రార్‌ సమ్మతితో అదే నెల 19న సర్వే నిర్వహించారు. అదే రోజు హద్దులు నిర్ధారించారు. వాస్తవాలు ఇలా ఉంటే.. కొన్ని మీడియా సంస్థలు ఆ భూమిపై ప్రజలను, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది.


సర్వే నిర్వహించలేదు: రిజిస్ట్రార్‌

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ టీజీఐఐసీ చేసిన ప్రకటనను హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ దేవేష్‌ నిగమ్‌ ఖండించారు. ప్రభుత్వ వాదన నేపథ్యంలో సోమవారమే ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘‘2024 జూలైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదు. ఇప్పటి వరకు భూమి ఎలా ఉందనే దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారు. హద్దులకు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటి వరకు భూమికి హద్దులు గుర్తించలేదు. దీనిపై హెచ్‌సీయూకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆ భూమిని వర్సిటీకే ఇవ్వాలని చాలాకాలంగా కోరుతున్నాం. భూమిని కేటాయించడంతోపాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరతాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. టీజీఐఐసీ అధికారులు చెప్పేదాంట్లో వాస్తవం లేదని, ఒక్కసారి విశ్వ విద్యాలయానికి కేటాయించిన భూమిని తిరిగి వెనక్కి తీసుకోవాలంటే విశ్వవిద్యాలయ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుందని, ఇప్పటి వరకు అలాంటిది ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. చట్టం 13లోని క్లాజ్‌(9) ప్రకారం రాష్ట్రపతి నియమించిన విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి ఉంటుందని, దాని అనుమతితో ఈ ప్రక్రియ జరగాల్సి ఉంటుందని తెలిపారు. కానీ, ఈ భూమి విషయంలో అలాంటిది ఏమీ జరగలేదని పేర్కొన్నారు.

gf.gif

50 ఎకరాల్లో పొదల తొలగింపు

కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు, పొదలను టీజీఐఐసీ అధికారులు భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య దాదాపు 50 ఎక్స్‌కవేటర్లతో తొలగించారు. రాళ్లు రప్పలను చదును చేశారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా పనులు కొనసాగించారు. ఆదివారం ఉదయం ఈ పనులను విద్యార్థులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, విద్యార్థుల మధ్య జరిగిన తోపులాటతో క్యాంప్‌సలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. భూమి వద్దకు విద్యార్థులు ఎవరూ వెళ్లకుండా రోడ్డు మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసుల బలగాలు అడ్డుకుంటున్నాయి. ఆదివారం రాత్రి వాహనాల లైట్ల సాయంతోనే టీజీఐఐసీ అఽధికారులు చెట్ల తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. సోమవారం సాయంత్రం వరకూ పనులు కొనసాగాయి. మొత్తంమీద 50 ఎకరాల వరకూ చదును చేసినట్లు చెబుతున్నారు. టీజీఐఐసీ అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. అయితే, సోమవారం రాత్రి పనులు జరగలేదు. కానీ, మరిన్ని ఎక్స్‌కవేటర్లను అక్కడికి తీసుకొస్తున్నట్లు కొన్ని వీడియోలు మాత్రం విడుదలయ్యాయి.


ఇద్దరు హెచ్‌సీయూ విద్యార్థుల రిమాండ్‌

భూమిని చదును చేసేందుకు వచ్చిన ఎక్స్‌కవేటర్లను అడ్డుకున్న కొంతమంది హెచ్‌సీయూ విద్యార్థులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించిన విషయం తెలిసిందే. విద్యార్థులు, పోలీసులకు జరిగిన తోపులాటలో మాదాపూర్‌ ఏసీపీ శ్రీకాంత్‌కు గాయాలయ్యాయి. ఆయన కాలుకు ఫ్రాక్చర్‌ కావడంతో హెచ్‌సీయూలో పీడీఎఫ్‌ స్కాలర్‌ రోహిత్‌కుమార్‌, పీహెచ్‌డీ స్టూడెంట్‌ ఎర్రం నవీన్‌కుమార్‌పై 329(3), 182(1), 132 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, హెచ్‌సీయూలో సోమవారం కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌ రెడ్డికి శవ యాత్ర నిర్వహించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసులు గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఉద్రిక్తతల మధ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. హెచ్‌సీయూ గుర్తింపు స్టూడెంట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం తరగతులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. వర్సిటీ భూముల్లో నుంచి పోలీసులు, యంత్రాలను తొలగించాలని, భూములను వర్సిటీకి రిజిస్టర్‌ చేయాలని, భూముల డాక్యుమెంట్లు పారదర్శకంగా ఉండాలని, ఈసీ కమిటీ వెంటనే సమావేశమై మినిట్స్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బహిష్కరణకు ఏఐఎ్‌సఏ, ఎస్‌ఎ్‌ఫఐ, ఏఎ్‌సఏ, బీఎ్‌సఎఫ్‌, పీడీఎ్‌సయూ తదితర విద్యార్థి సంఘాల మద్దతు ప్రకటించాయి


ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 07:50 AM