Supreme Court Empowered Committee: నేడు కంచ గచ్చిబౌలికి కేంద్ర సాధికార కమిటీ రాక
ABN , Publish Date - Apr 10 , 2025 | 05:29 AM
సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ కంచ గచ్చిబౌలి భూములపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనుంది. అటవీ చట్టాల ఉల్లంఘనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కమిటీ నివేదిక కీలకంగా మారనుంది.
వాస్తవ పరిస్థితులపై అధ్యయనం
హైదరాబాద్‌లో 2 రోజుల పర్యటన
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ (సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ- పర్యావరణ మందింపు కమిటీ) గురువారం కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించనుంది. ఈ మేరకు కమిటీ బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. కమిటీ రెండు రోజుల పాటు నగరంలో పర్యటించనుంది. పర్యావరణ, అటవీ శాఖల సాధికార కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్.. సాధికార కమిటీకీ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, సీపీ గోయల్, సునిల్ లిమయి, జేఆర్ భట్ సభ్యులుగా ఉన్నారు. తాజ్‌కృష్ణా హోటల్‌లో బసచేసిన ఈ కమిటీ గురువారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంటుంది. అనంతరం కంచ గచ్చిబౌలి భూములను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. రెండో రోజు పర్యావరణ చట్టాల ఉల్లంఘనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంస్థలు, ఎన్జీవోలు, విద్యార్థులతో చర్చించనుంది. అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతి లేకుండా అభివృద్ధి కార్యకలాపాల పేరుతో కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వం చెట్లను తొలగిస్తుందంటూ వచ్చిన ఫిర్యాదులపై మార్చి 31వ తేదీన సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర సాధికార కమిటీ నివేదిక అత్యంత కీలకం కానుంది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించారు. కమిటీ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.