CM Revanth Reddy Japan Tour: జపాన్‌లో సీఎం రేవంత్ పెట్టుబడుల వేట.. మారుబెనీతో వెయ్యి కోట్ల ఒప్పందం
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:31 PM
పెట్టుబడులు సేకరించడమే లక్ష్యంగా జపాన్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. వ్యాపార దిగ్గజం మారుబెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం సీఎం బృందం జపాన్ లోని సోనీ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించింది.
CM Revanth Reddy Japan Tour: జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది.
టోక్యోలో మారుబెనీ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై ఇరువురు చర్చించారు. వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెనీ కంపెనీ ప్రాజెక్టు చేపట్టనుంది. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి, నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు.
సదరు ఇండస్ట్రియల్ పార్క్‌లో జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. తద్వారా రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడును ఆకర్షించే అవకాశం ఉంది. మారుబేని ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ , డిఫెన్స్ రంగాలపై దృష్టి పెడుతుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్కు ఇదేనన్నారు. దీంతో తెలంగాణలో దాదాపు 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలున్నాయని మారుబేనికి ప్రభుత్వం తరఫున తగినంత సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంచుకున్న దార్శనికతను మారుబేని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ దై సకాకురా ప్రశంసించారు. తెలంగాణలో అవకాశాలను వినియోగించుకునేందుకు ముందు వరుసలో ఉంటామని చెప్పారు. కాగా, మారుబేని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410 కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫుడ్, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్ , మొబిలిటీ రంగాలలో ఈ కంపెనీ అగ్రగామి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉందీ కంపెనీ.






ఇవి కూడా చదవండి
Raj Tarun Parents: హైడ్రామాకు తెర.. ఇంట్లోకి వెళ్లిన రాజ్‌తరుణ్ పేరెంట్స్
Mithun Reddy High Court: ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News