Intermediate Education: పురుషులకు 59 మహిళలకు 41
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:54 AM
తెలంగాణ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ ఫలితాలు విడుదలయ్యాయి, ఇందులో కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక మొదటి ర్యాంకు సాధించారు. టాప్ 100 ర్యాంకుల్లో మహిళలు 41 మంది, పురుషులు 59 మంది ఉన్నారు

గ్రూప్-1 తొలి 100 ర్యాంకుల్లో మగవారిదే పైచేయి
550 మార్కులతో టాపర్ కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక
535.5 మార్కులతో వెంకటరమణకు రెండో ర్యాంకు
టాప్ 10లో జోన్-1లో నలుగురు, జోన్-2లో ఐదుగురు
ర్యాంకర్లలో బీసీలు 48 మంది, ఓసీలు 32,
ఓసీ(ఈడబ్ల్యూఎస్) 12, ఎస్టీలు 5, ఎస్సీలు ముగ్గురు
మొత్తం 52 మందికి 500కు పైగా మార్కులు
టీజీపీఎస్సీ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ ఫలితాల
విడుదల.. వెబ్‌సైట్‌లో 12622 మంది జాబితా
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆదివారం విడుదల చేసిన ఫలితాల్లో మల్టీజోన్-2కు చెందిన ఓసీ అభ్యర్థి కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. ఆమెకు 900కి గాను 550 మార్కులు వచ్చాయి. మల్టీజోన్-2కు చెందిన బీసీ-ఏ అభ్యర్థి దాది వెంకటరమణ 2వ ర్యాంక్ సాధించారు. ఇతనికి 900కి గాను 535.5 మార్కులొచ్చాయి. ఇక తెలంగాణేతరులను మల్టీ జోన్-9లో చేర్చారు. ఈ జోన్ పరిధిలో ఓసీ పురుషుడు జనరల్ ర్యాంకింగ్‌లో 535.5 మార్కులతో మూడో స్థానంలో ఉన్నారు. మల్టీజోన్-1లో ఓసీ మహిళకు అత్యధికంగా 532.5 మార్కులు వచ్చాయి.
జనరల్ ర్యాంకింగ్‌లో ఈమెది 4వ స్థానం. టాప్ 100 ర్యాంకుల్లో పురుషులు ముందంజలో ఉన్నారు. వెబ్‌సైట్‌లో మొత్తం 12,622మంది అభ్యర్థుల మార్కులు, ర్యాంకుల జాబితాను అందుబాటులో ఉంచింది.
కల సాకారమవుతోంది..
గూప్-1 అభ్యర్థుల ఎన్నో ఏళ్ల కల సాకారం కాబోతోంది. 563 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబరులో మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. ఈ నెల 10న అభ్యర్థుల ప్రొవిజనల్ మార్కులను వాళ్ల లాగిన్‌లో విడుదల చేసింది. వాటిలో ఏమైనా అభ్యంతరాలుంటే.. ఈ నెల 24 వరకు రీ కౌంటింగ్‌కు అవకాశం ఇచ్చింది. ఈ పక్రియ ముగిసిన అనంతరం ఆదివారం జనరల్ ర్యాంకింగ్ ఫలితాలను విడుదల చేసింది. త్వరలో కేటగిరీల వారీగా అర్హులకు 1:2 పద్ధతిన సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని.. ఈ విషయాన్ని అభ్యర్థులకు తెలియజేయడంతో పాటు వెబ్‌సైట్‌లో సైతం సమాచారాన్ని ఉంచుతామని తెలిపింది. అభ్యర్థుల మార్కుల మెమోను వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్‌లో పొందుపరిచామని, హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీ, టీజీపీఎస్సీ ఐడీ, రిజిస్టర్ మొబైల్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. మార్కుల మెమో వారం రోజులు, జనరల్ ర్యాంకు జాబితా ఏప్రిల్ 28 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేస్తామని కమిషన్ తెలిపింది.
తాజా ఫలితాల్లో టాప్ 10 ర్యాంకుల్లో ఆరుగురు మహిళలు.. నలుగురు పురుషులు ఉన్నారు. టాప్ 100లో కూడా 59 మంది పురుష అభ్యర్థులు ర్యాంకులు సాధించగా.. 41 మంది మహిళలు ర్యాంకులు సాధించారు. తొలి 100 ర్యాంకర్లలో బీసీలు 48 మంది.. ఓసీలు 32 మంది, ఓసీ ఈడబ్ల్యూఎ్‌సలో 12 మంది, ఎస్టీలు ఐదుగురు, ఎస్సీలు ముగ్గురు ఉన్నారు. ఇక టాప్ 500 ర్యాంకుల్లో మాత్రం మహిళల కంటే మగాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. పురుషులు 296 మంది ఉండగా.. మహిళలు 204 మంది ఉన్నారు. టాప్ టెన్‌లో మల్టీజోన్-2లో ఐదుగురు మంచి ర్యాంకులు సొంతం చేసుకున్నారు. మల్టీ జోన్-1లో నలుగురు, మల్టీ జోన్-9 (తెలంగాణేతరులు)లో ఒకరు ర్యాంకులు సాధించారు. వీరిలో ఏడుగురు ఓసీ అభ్యర్థులు కాగా.. ఇద్దరు బీసీ-బి, ఒకరు బీసీ-ఏ అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 52 మంది అభ్యర్థులు 500కు పైగా మార్కులు సాధించారు. కాగా, అభ్యర్థులు సాంకేతిక ఇబ్బందుల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్ నంబరు 040 2354218/040 23542187 లేదా జ్ఛిజూఞఛ్ఛీటజుః్టటఞటఛి.జౌఠి.జీుఽ లో సంప్రదించాలని కమిషన్ సూచించింది.
కలెక్టర్ కావాలనేది కల: వెంకటరమణ
నల్లగొండకు చెందిన దాది వెంకటరమణ రాష్ట్ర స్థాయిలో 535.5 మార్కులతో రెండో ర్యాంకు సాధించారు. ఐదేళ్లుగా సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది ప్రకటించిన జేఎల్, డీఏవో, గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల్లోనూ ప్రతిభ చూపారు. ప్రస్తుతం జహీరాబాద్‌లో జూనియర్ లెక్చరర్‌గా విధులు నిర్వరిస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు దాది శ్రీనివాసరావు విద్యాశాఖలో ఉద్యోగి కాగా, తల్లి రమాదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. మొదటినుంచి కలెక్టర్ కావాలన్నది తన కల అని వెంకటరమణ చెప్పారు. గ్రూప్-1లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు రావడంతో డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ వస్తుందన్నారు.
తేజస్వినిరెడ్డికి 4వ ర్యాంకు
హనుమకొండ జిల్లా మాందారిపేటకు చెందిన జిన్నా విజయ్‌పాల్‌రెడ్డి-హేమలత దంపతుల కూతురు తేజస్వినిరెడ్డి 532.5 మార్కులతో నాలుగో ర్యాంకు సాధించారు. తేజస్వినిరెడ్డి 2019లో నిర్వహించిన గ్రూప్-2లో అర్హత సాధించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో పంచాయతీ అధికారిగా పనిచేశారు. ప్రస్తుతం గ్రూప్-1లో 4వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ అయ్యే అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఫ మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన బోయినిపల్లి ప్రణయ్‌సాయి 17వ ర్యాంకు, వనపర్తి జిల్లాకు చెందిన మండ్ల పవన్‌కుమార్‌కు 25, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వెంకటేశ్ ప్రసాద్ సాగర్‌కు 27, మెదక్‌కు చెందిన శైలేశ్ 41వ ర్యాంకు, నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ సతీమణి బరీరా ఫరీద్‌కు 68, మెదక్ జిల్లా మూసాపేటకు చెందిన ప్రభాత్‌రెడ్డి 73, సిద్దిపేట జిల్లాకు చెందిన అఖిల్‌రెడ్డి 75, లావుడ్య శ్రీకాంత్ 89, వికారాబాద్‌కు చెందిన వర్షితకు 100వ ర్యాంకు దక్కింది.
అంధుల విభాగంలో అహ్మద్ అగ్రస్థానం
వరంగల్‌కు చెందిన అహ్మద్ దివ్యాంగుల (అంధుల) విభాగంలో మొదటి ర్యాంకు సాధించారు. 471 మార్కులు సాధించిన అహ్మద్‌కు జనరల్ కేటగిరీలో 261 ర్యాంకు రాగా.. దివ్యాంగుల విభాగంలో ప్రథమ స్థానం దక్కింది. ఆయన ప్రస్తుతం ప్రజారోగ్య సాంకేతిక శాఖ వరంగల్ డివిజన్‌లో ఏఈఈగా పనిచేస్తున్నారు. తనకు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉందని అహ్మద్ ఆనందం వ్యక్తం చేశారు.
ఎస్సీ కేటగిరీలో హరిణి ఫస్ట్
ఎస్సీ విభాగంలో కరీంనగర్‌కు చెందిన కన్నం హరిణి ఫస్ట్ ర్యాంకు సాధించారు. 499.5 మార్కులతో జనరల్ కేటగిరీలో 55వ ర్యాంకు సాధించిన హరిణి.. ఎస్సీ విభాగంలో రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంకు దక్కించుకున్నారు. 2019లో బీటెక్ పూర్తి చేసిన హరిణి.. రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశారు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి, సివిల్స్‌కు సన్నద్ధమవుతూ.. గ్రూప్-1 కూడా రాశారు. గ్రూప్-1 ఉద్యోగంలో చేరినప్పటికీ ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకొని సివిల్స్ రాస్తానని హరిణి చెప్పారు.
ఆరేళ్ల నిరీక్షణతో ఏడో ర్యాంకు..
గ్రూప్-1లో 524 మార్కులతో 7వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ప్రస్తుతం బడంగ్‌పేట మునిసిపల్ కార్పొరేషన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. నా భర్త రవీందర్‌రెడ్డి ఇరిగేషన్ శాఖ ఉద్యోగి. మాకు ఇద్దరు పిల్లలు. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు కుటుంబ బాధ్యతలతో నేను ఇంత మంచి ర్యాంకు సాధించడం వెనుక మా అత్తమ్మ జయమ్మ, నా తోటికోడలు రజిత తోడ్పాటు ఉంది. మెట్టినింటి సహకారంతో గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపిక కావాలన్న నా కల సాకారమైంది. 2018లో యూపీఎస్సీ పరీక్ష రాశాను. కానీ ప్రిలిమ్స్‌దాటలేదు. ఆపై గ్రూప్-1మీద పూర్తి శ్రద్ధ పెట్టాను. రోజుకు ఆరు గంటలు చదివాను. ఆరేళ్ల నా నీరీక్షణ ఫలించింది. కలెక్టర్ కాలేకపోయినా, డిప్యూటీ కలెక్టర్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది.
- అనూషా రెడ్డి, 7వ ర్యాంకు
23 ఏళ్లకే 40వ ర్యాంక్..
మాది హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి. 23 ఏళ్ల వయస్సులోనే గ్రూప్-1కు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. 504.5 మార్కులతో నాకు 40వ ర్యాంక్ వచ్చింది. మా తండ్రి శ్రీనివాస్ ప్రైవేట్ ఉద్యోగి. తల్లి చెరుకూరి పద్మ గణిత అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. 2022 నుంచి ఢిల్లీలో ఉంటూ యూపీఎస్సీకి సిద్ధం అవుతున్నా. ఒక సబ్జెక్టు మినహా మిగిలిన సబ్జెక్టుల సిలబస్ ఒకే రకంగా ఉండటం వల్ల గ్రూప్-1 పరీక్ష రాశా. ఇంత మంచి ర్యాంక్ రావడాన్ని రివార్డ్‌గా భావిస్తున్నా. ఈ ర్యాంక్ ఆధారంగా వచ్చే ఉద్యోగాన్ని చేస్తూనే.. ఐఏఎస్ సాధించాలన్నది నా లక్ష్యం.
- ఇమ్మాని సాకేత్, 40వ ర్యాంకు
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News