ఇద్దరు యువకుల బలవన్మరణం
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:14 AM
నల్లగొండ జిల్లాలో శుక్రవారం ఇద్దరు యువకులు బలవన్మరణం చెందారు. మనస్తాపంతో ఒకరు ఉరి వేసుకొని ఒకరు, తండ్రితో జరిగిన గొడవతో క్షణికావేశంలో పురుగుల మందు తాగి మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇద్దరు యువకుల బలవన్మరణం
నల్లగొండ జిల్లాలో శుక్రవారం ఇద్దరు యువకులు బలవన్మరణం చెందారు. మనస్తాపంతో ఒకరు ఉరి వేసుకొని ఒకరు, తండ్రితో జరిగిన గొడవతో క్షణికావేశంలో పురుగుల మందు తాగి మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు.
నాంపల్లి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి మండలంలోని వెంకటంపేట గ్రామానికి చెందిన యువకుడు నాంపల్లి మండలంలోని కేతేపల్లి శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ శోభనబాబు తెలిపిన వివరాల ప్రకారం... చింతపల్లి మండలంలోని వెంకటంపేట గ్రామానికి చెందిన సండే హనుమంతు (25) తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో అతను ఇంటి వద్ద ఒంటరిగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. తనకు ఎవరూ లేరనే మనోవేదనతో కేతేపల్లి గ్రామశివారులో వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు. శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహం వద్ద ఉన్న ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. మృతుడు హనుమంతు చెల్లెలు చెరుకుపల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. దేవరకొండ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
క్షణికావేశంలో క్రిమిసంహారక మందు తాగి....
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలో ద్విచక్ర వాహన విషయంతో తండ్రితో జరిగిన వివాదంతో క్షణికావేశంలో ఓ యువకుడు క్రిమి సంహారక మందు తాగి తనువు చాలించాడు. ఎస్‌ఐ శివతేజ తెలిపిన వివరాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన భీమనపల్లి వెంకటయ్య, వెంకటమ్మ దంపతులకు కొండయ్య (32) ఏకైక కుమారుడు. నాలుగేళ్ల క్రితం కొండయ్యకు వివాహం చేయగా భార్యతో నెలకొన్న వివాదంతో ప్రస్తుతం ఇరువురు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ద్విచక్ర వాహన విషయంలో కొండయ్యకు తండ్రి వెంకటయ్యతో వివాదం జరిగింది. దీంతో కొండయ్య ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఫ్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు కొండయ్య తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసి నట్లు ఎస్‌ఐ శివతేజ తెలిపారు.